తైవాన్‌ నేర్పే ఆర్థిక పాఠాలు | Sakshi Guest Column On Economic lessons from Taiwan | Sakshi
Sakshi News home page

తైవాన్‌ నేర్పే ఆర్థిక పాఠాలు

Jun 8 2026 3:54 AM | Updated on Jun 8 2026 3:54 AM

Sakshi Guest Column On Economic lessons from Taiwan

సందర్భం

కేవలం ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆది లాబాద్‌ జిల్లాలను కలిపినంత భూభాగం; జనాభా పరంగా ఇంచుమించు మన దేశంలోని ఓ పెద్ద మహానగరంతో సమానం (2.3 కోట్లు) – అదే దశాబ్దాలుగా చైనా నుంచి తీవ్రమైన ఒత్తిడి నెదుర్కొంటున్న తైవాన్‌ దేశం. కానీ గత మే నెలలో ఈ చిన్న ద్వీపదేశం స్టాక్‌ మార్కెట్‌ సంపద విలువ ఏకంగా 4.95 ట్రిలియన్‌ డాలర్లకు ఎగబాకి, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశ స్టాక్‌ మార్కెట్‌ను స్వల్పంగా అధిగమించింది. దాంతో తైవాన్‌ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించడం ప్రపంచాన్ని విస్మయపరిచింది.  

ఆ ఒక్క కంపెనీ
ఒకప్పుడు వ్యవసాయం, పశుపోషణ, చేపలవేట వంటి మౌలిక వృత్తులపై ఆధారపడిన తైవాన్‌ – 70వ దశకంలో ఆర్థిక మంత్రి కేటీ లీ వంటి దీర్ఘదృష్టి గల నాయకుల సారథ్యంలో సాంకేతికత వైపు మళ్లింది. అప్పట్లో మైక్రోచిప్స్‌ రంగం అమెరికా, జపాన్‌ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలో ఉండేది. అందులో పొంచి ఉన్న అవకా శాన్ని పసిగట్టిన తైవాన్, అమెరికాలో అప్పటికే విశేషానుభవం గడించిన మోరిస్‌ చాంగ్‌ అనే స్వదేశీయుణ్ణి ప్రోత్సహించింది. ఆ నేపథ్యంలో 1987లో సాధారణ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ప్రారంభ మైన టీఎస్‌ఎంసీ (తైవాన్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ), నేడు అంతర్జాతీయ కాంట్రాక్ట్‌ చిప్‌ తయారీ రంగంలో దాదాపు 70% వాటాతో ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. 80,000 మందికి పైగా అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను కలిగి ఉన్న టీఎస్‌ఎంసీ, తైవాన్‌ స్టాక్‌ మార్కెట్‌ సంపదలో సుమారు 42–44% వాటా కలిగి ఉంది.

ప్రపంచం నేడు స్మార్ట్‌ఫోన్ల నుండి కృత్రిమ మేధ ఆధారిత సూపర్‌ కంప్యూటర్ల వరకు అవసరమైన చిప్స్‌ కోసం తైవాన్‌పై ఆధారపడుతోంది. దాంతో ఈ చిన్న చిప్‌లే చైనా వంటి శక్తిమంత మైన దేశంతో నిరంతర ప్రమాదం పొంచివుండే ఆ దేశానికి, అదృశ్య రక్షణ కవచంగా మారాయి. తైవాన్‌  దాడికి గురైతే, ఈ చిప్‌ల సరఫరాకు అంతరాయం ఏర్పడి తమ ఆర్థిక వ్యవస్థలకు ముప్పు తప్పదనే భయంతో పాశ్చాత్య దేశాలు, కూటములు తైవాన్‌  రక్షణకు బాసటగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా, తైవాన్‌ పొందే ఈ రక్షణ ‘సిలికాన్‌ షీల్డ్‌’ (సిలికాన్‌ రక్షణ కవచం)గా పేరొందింది. 

ప్రభుత్వ–ప్రైవేట్‌–విదేశీ సహకారం
2016లో తైవాన్‌ మార్కెట్‌ విలువ 820 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉండగా, భారత్‌ 1.45 ట్రిలియన్‌ డాలర్లతో ముందుంది. గత పదేళ్లలో భారత్‌ గణనీయంగా వృద్ధి చెందినా, తైవాన్‌ మరింత వేగంగా పరుగులు తీసింది. భారత్‌ బ్యాంకింగ్, ఐటీ సేవలు, విని యోగ వస్తువులు, ఇంధనం వంటి వివిధ రంగాలపై దృష్టి సారిస్తే; తైవాన్‌ తన శక్తియుక్తులను చిప్‌ తయారీ వంటి హార్డ్‌వేర్‌ రంగంపై కేంద్రీకరించడం దీనికి ప్రధాన కారణం. మన వ్యవస్థలు  ఎక్కువగా దేశీయ వినియోగంపై ఆధారపడి నడుస్తుంటే; తైవాన్‌ మాత్రం ప్రపంచ దేశాల సాంకేతికావసరాలను తీర్చుతూ అంతర్జాతీయ పెట్టుబడులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. అయితే, 143 కోట్ల జనాభా వినియోగావసరాలను తీర్చడానికి మన దేశం ప్రాధాన్యత నివ్వడం కూడా ఆక్షేపణీయం కాదు.

తైవాన్‌ విజయం వెనుక టీఎస్‌ఎంసీ ఒక్కటే కాదు– ఆ దేశ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్ల విధానం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సిన్చు సైన్‌ ్స పార్క్‌లో చిప్‌ డిజైన్‌ కంపెనీలు, తైచుంగ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో రోబోటిక్స్, కచ్చిత యంత్రాల తయారీ పరిశ్రమలు...  వనరులు, సాంకేతికత మార్పిడి వంటి అంశాల్లో పరస్పరం అనుసంధానమై పని చేస్తు న్నాయి. ప్రభుత్వ–ప్రైవేట్‌–విదేశీ సంస్థల మధ్య సహకారం, ఫిలిప్స్‌ వంటి దిగ్గజాల నుండి సాంకేతికత సరఫరా, అమెరికా విపణులతో సంబంధాలు ఈ వ్యవస్థను పటిష్ఠపరిచాయి. దీనికి తోడు, విద్యావిధానాన్ని పరిశ్రమల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, విశ్వవిద్యాలయాలను నైపు ణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చారు. అమెరికా సిలికాన్‌ వ్యాలీలో స్థిరపడిన తైవాన్‌ మేధావులను తిరిగి రప్పించడానికి పన్ను మినహా యింపులు, పరిశోధనా నిధులు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో, ఆ మానవ వనరులు దేశాభివృద్ధికి పునరంకితమయ్యాయి.

అయినప్పటికీ ఈ నమూనా బలహీనతలకు అతీతం కాదు. ఒకే కంపెనీపై గణనీయంగా ఆధారపడ్డ సెమీకండక్టర్‌ రంగం తైవాన్‌ జీడీపీలో సుమారు 18–20% వాటా కలిగి ఉంది. ఈ పరిణామం ‘డచ్‌ డిసీజ్‌’ లాంటి సంక్షోభం తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంది. 1960ల కాలంలో నెదర్లాండ్స్‌ (డచ్‌) అప్పుడప్పుడే అన్వేషించ బడుతున్న సహజ వనరులపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించడంతో, ఇతర రంగాలు బలహీనపడ్డాయి. అలా ఏదైనా ఒక రంగంపై దేశం అధికంగా ఆధారపడితే వచ్చే దుష్పరిణామాలను సూచించడానికి ఈ పదం వాడతారు. చిప్‌లకు ప్రత్యామ్నాయాలు ఆవిర్భవించినా లేదా అమెరికా, దక్షిణ కొరియా, భారత్‌ వంటి కొత్త పోటీదారులు పుంజుకున్నా దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలు చిక్కుల్లో పడతాయి. అంతేకాకుండా పరిమిత వనరులు కలిగిన ఆ దేశం విద్యుత్‌ సర ఫరాలో అంతరాయాలు, నీటి ఎద్దడి, వృద్ధాప్యానికి చేరువవుతున్న జనాభా, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదు ర్కొంటోంది. అన్నింటికంటే పెద్ద ముప్పు – దేశ సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేయగలిగిన చైనా సైనిక–రాజకీయ ఒత్తిడి. పారిశ్రా మికాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చిన తైవాన్, తొలినాళ్ళలో వీటిపై దృష్టి సారించలేదు. 

మనమేం చేయొచ్చు?
సవాళ్లను అధిగమిస్తూ తైవాన్‌ సాధిస్తున్న విజయాలు వర్ధమాన దేశాలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. భారతదేశం, ముఖ్యంగా సెమీకండక్టర్‌ రంగంలో ముందుకు సాగుతున్న తెలుగు రాష్ట్రాలు, తైవాన్‌ పురోగతిని నిశితంగా పరిశీలించాలి. భారత్‌ ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌’ ద్వారా వేల కోట్లు పెట్టుబడి పెట్టడం, ప్రస్తుత కృత్రిమ మేధ యుగంలో సరైన ముందడుగే. కానీ కేవలం భారీ ఉత్పత్తి సామర్థ్యాలు సమకూర్చుకోవడంతో పాటుగా, తైవాన్‌ తరహా సమగ్రమైన సరఫరా శృంఖలలను సృష్టించగలగాలి. నైపుణ్యాలను పెంపొందించే విద్యా విధానం, వ్యతిరేక దిశలో మేధో వలసలు, పారిశ్రామిక సముదాయాలు, విడిభాగాల ఉత్పత్తి
కేంద్రాలు, సాంకేతికత మార్పిడి, మార్కెటింగ్‌ అనుసంధానం– ఇవన్నీ అందులో అంతర్భాగాలు కావాలి. 

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎంతో ప్రతిభ చూపుతున్న మన తెలుగు యువత – తమ నైపుణ్యాలను హార్డ్‌వేర్‌ రూపకల్పన, చిప్‌ తయారీ, సరఫరా గొలుసుల కూర్పు వైపు కూడా విస్తరించాలి. ఇందుకోసం మన తెలుగు రాష్ట్రాలు కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్‌ రూపకల్పన, ఉత్పత్తి పారిశ్రామిక వాడలను నిర్మించాలి. విద్యారంగాన్ని సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ చిప్‌ సంస్థలతో ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధనలు, తైవాన్‌ లాంటి దేశాల సందర్శనలు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగం ప్రభావితమవ్వబోతోందన్న ఆందోళనకు ఇదో చక్కటి పరిష్కారం కూడా!

పల్లపోతు కృష్ణబాలాజి
వ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్‌.బి.ఐ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement