చైనాలో అశాంతికి మూలం? 

Sakshi Guest Column On China Covid Crisis

కోవిడ్‌ అంక్షలకు వ్యతిరేకంగా చైనా విద్యార్థులు, కార్మికుల నిరసనలకు దారితీసిన అసంతృప్తికి మూలం ఎక్కడుంది? పట్టణ, గ్రామీణ నిరుద్యోగిత పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ, ప్రాదేశిక ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. పైగా సంప్రదాయానికి విరుద్ధంగా షీ జిన్‌పింగ్‌ అధికార బాధ్యతలను మూడోసారి స్వీకరించడం చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ కేడర్లో చాలామందిని కలతపెట్టింది. వాస్తవానికి చైనాలో తలెత్తే ప్రజా నిరసనలు ఒక్కసారిగా వేగం పుంజుకుని రాజకీయ నాయకత్వాన్ని భయపెడుతుంటాయి. చైనా వ్యతిరేక శక్తులు మరోసారి సాంస్కృతిక విప్లవాన్ని ప్రేరేపించే అవకాశముందని చైనా కమ్యూనిస్టు పార్టీ భీతిల్లుతోంది. అందుకే నిరసనకారులపై చర్యలు తీసుకోవడం తప్పకపోవచ్చు. 

అధికారంలో ఉన్న షీ జిన్‌పింగ్‌కు అత్యంత చెడ్డ కాలంలో చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ మృతి (నవంబర్‌ 30) సంభవించి ఉండకూడదు. నాయకుల అంత్యక్రియలు చైనాలో భారీ ప్రదర్శనల భూకంప కేంద్రాలుగా మారుతుంటాయి. మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ప్రారంభ కాలంలోనే జీరో కోవిడ్‌ విధానం జిన్‌పింగ్‌ తలకు గట్టిగా చుట్టుకుంది. ఉరుంక్వీ పట్టణంలోని ఒక భవనంలో అగ్నిప్రమాదం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రోజుల వ్యవధిలోనే కఠినమైన జీరో కోవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. కనీసం పది నగరాల్లో చెలరేగిన నిర సన ప్రదర్శనల్లో విద్యార్థులు, పౌరులు, కార్మికులు వేగంగా భాగమై పోయారు. జిన్‌పింగ్‌ను వ్యతిరేకిస్తున్న శక్తులు ఈ నిరసన ప్రదర్శన లను మరింత రెచ్చగొట్టి ఉండవచ్చని అంచనా.

చైనా ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనంలోకి వెళుతోంది. జీవన వ్యయం వేగంగా పెరుగుతోంది. పట్టణ, గ్రామీణ నిరుద్యోగిత క్రమంగా పెరుగుతోంది. పట్టభద్రుల్లో నిరుద్యోగం ఇప్పటికే 20 శాతానికి చేరుకుంది. అదృష్టవశాత్తూ ఉద్యోగాలు దొరికినవారు గతంలోకంటే సగం వేతనాలు మాత్రమే పొందుతున్నారు. దీంతో ప్రజలకు నేరుగానే ఆర్థిక వ్యవస్థ తాలూకు బాధలు అనుభవంలోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ, ప్రాదేశిక ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇప్పటికే వీరికి చెల్లించిన బోనస్‌లను కూడా వెనక్కు తీసుకున్నారు. అయినప్పటికీ ఆర్థిక సంస్కరణల దిశగా, చైనా ప్రైవేట్‌ ఆంట్రప్రెన్యూర్లకు సహక రించడానికి జిన్‌పింగ్‌ ఏమాత్రం సుముఖంగా లేరు. చైనాలో 80 శాతం ఉద్యోగాలను, 90 శాతం రెవెన్యూను ప్రైవేట్‌ ఆంట్రప్రెన్యూర్లే కల్పిస్తున్నారు. అయినా ఈ వాస్తవానికి భిన్నంగా 20వ పార్టీ కాంగ్రెస్‌ ఆమోదించిన వర్క్‌ రిపోర్ట్‌ ‘ఉమ్మడి శ్రేయస్సు’ గురించి మాట్లాడింది.

జెంగ్‌జౌలోని ఫాక్స్‌కాన్‌ కంపెనీకి చెందిన అతిపెద్ద ఐఫోన్‌ ప్లాంట్‌ నిరసనకారుల ప్రధాన కేంద్రంగా నిలిచింది. వేతనాలు చెల్లించకపోవడంపై, కోవిడ్‌ –19 లాక్‌డౌన్‌ ఆంక్షలపై ఆగ్రహించిన కార్మికులు నవంబర్‌ 23న నిరసనలు ప్రారంభించి తమను అణిచి వేయడానికి వచ్చిన పోలీసులతో తలపడ్డారు. పరిశ్రమలో కోవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో బయటి ప్రపంచం నుంచి కార్మికు లను వేరుపర్చాలన్న విఫలయత్నం జరిగింది. అయితే ప్లాంట్‌లోని రెండు లక్షలమందిని బయటకు రాకుండా కట్టడి చేసిన యంత్రాంగం కార్మికులకు తగిన తిండి, నీరు సరఫరా చేయడంలో విఫలమైంది.  దీనికి తోడుగా కార్మికులకు అధిక వేతనాలు చెల్లిస్తామని చేసిన వాగ్దా నాన్ని కంపెనీ విస్మరించడంతో పరిస్థితులు విషమించాయి. ‘ప్రతి కార్మికుడి ఆరోగ్యానికి, భద్రతకు హామీ ఇవ్వడానికి’ నిబద్ధత పాటించ డంతో ఐఫోన్‌ 14 వెర్షన్‌ మొబైళ్లను వినియోగదారులకు అందించ డంలో జాప్యం జరగవచ్చని కంపెనీ ప్రకటించింది.

ఈ నిరసన ప్రదర్శనల గురించిన వార్తలను చైనా అధికారిక మీడియా తొక్కిపట్టింది. నవంబర్‌ 28 వరకు చైనా డెయిలీ, గ్లోబల్‌ టైమ్స్‌ పత్రికలు ఏ వార్తలనూ ప్రచురించలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం చైనాలోని విభిన్న ప్రాంతాలలో జరుగుతున్న నిరసనల గురించి పౌరులు పంపుతున్న వార్తలు వెల్లువలా పోస్ట్‌ అయ్యాయి. చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ట్రక్కుల మోహరింపు వార్తలు కూడా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు వచ్చాయి.  బీజింగ్‌లోని ప్రతిష్ఠాత్మక త్సింగువా యూనివర్సిటీతో సహా ఎందరో విద్యార్థులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

ఉహాన్, ఉరుంక్వి, కోర్లా, చెంగ్డు, నాంజింగ్, జెంగ్‌జౌ, చోంగ్‌ క్వింగ్, గ్వాంగ్‌జౌ, షాంఘై నగరాల్లో నిరసనలు ఊపందుకున్నాయి. ప్రజా సమూహాలు ‘షీ జిన్‌పింగ్‌ డౌన్‌డౌన్‌’, ‘చైనా కమ్యూనిస్టు పార్టీ వెళ్లిపో’ అంటూ నినదించాయి. నవంబర్‌ 27న రాత్రి 1.30 గంటల సమయంలో కూడా బీజింగ్‌లోని హైదియన్‌ జిల్లాలో జనం పోలీసు లతో తలపడ్డారు. చైనాలోని 79 ప్రాదేశిక విద్యా సంస్థల విద్యార్థులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారని హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేసే ఇనీషియం మీడియా అంచనా వేసింది. నవంబర్‌ 27 రాత్రి నుంచే భద్రతా బలగాలు నిరసనకారులను అరెస్టు చేయడం ప్రారంభిం చాయి. 

జిన్‌పింగ్‌ అధికార బాధ్యతలను మూడోసారి స్వీకరించడం (డెంగ్‌ జియావోపింగ్‌ మరణం తర్వాత ఇలా జరగడం ఇదే మొదటి సారి) చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ కేడర్లో చాలామందిని కలతపెట్టింది. పైగా, పోలిట్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీ, కేంద్ర మిలిటరీ కమిషన్‌ను తన విశ్వాసపాత్రులతో జిన్‌పింగ్‌ నింపివేశారు. పోలిట్‌ బ్యూరో లేదా పోలిట్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీకి అభ్యర్థులను ఎంపిక చేస్తున్న ప్పుడు గతాచరణకు భిన్నంగా సీనియర్‌ కేడర్లను జిన్‌పింగ్‌ సంప్ర దించలేదని అధికారిక మీడియా పేర్కొంది. దీంతో రిటైర్‌ అయినప్ప టికీ ప్రభావ శీలురైన కార్యకర్తలు జిన్‌పింగ్‌ పట్ల అసంతృప్తితో ఉన్నారు. 20వ పార్టీ కాంగ్రెస్‌ చివరి రోజున చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను తొలగించడం ఈ ఆచరణను ప్రతిబింబించింది. 

పోలిట్‌ బ్యూరోకు ప్రమోట్‌ చేయదగిన, పోలిట్‌ బ్యూరోలో కొనసాగాల్సిన కేడర్ల వయోపరమైన అర్హతకి సంబంధించి దశాబ్దాల పాటు కొనసాగిన సంప్రదాయాన్ని కూడా జిన్‌పింగ్‌ విస్మరించారు. 72 సంవత్సరాల జియాంగ్‌ యూక్సియాను పోలిట్‌ బ్యూరోలో కొన సాగించడం, రిటైర్మెంట్‌ వయస్సు రానప్పటికీ హూ చున్హువాను తొలగించడం, జనరల్‌ హె వెయిడాంగును తగిన అర్హత లేనప్పటికీ పోలిట్‌ బ్యూరోలోకి ప్రమోట్‌ చేయడం గట్టి ఉదాహరణలు. 

ఈ అశాంతికి పార్టీ అంతర్గత అసంతృప్తి కారణమని జియాంగ్‌ జెమిన్‌ మద్దతుదారులు చెబుతున్నారు. 2013 నుంచి వీరిని జిన్‌పింగ్‌ సంస్థాగతంగానే లక్ష్యం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నాయ కుడు లేకుండా పోయిన వీరు గణనీయ సంఖ్యలో ఉన్న ప్రభావశీలు రైన జిన్‌పింగ్‌ వ్యతిరేక వర్గంలో కలిసిపోగలరు. జియాంగ్‌ జెమిన్‌కు లాంఛనప్రాయమైన అంత్యక్రియలను నిర్వహించకూడదని తీసుకున్న నిర్ణయం కూడా గత సంప్రదాయం నుంచి పక్కకు పోవడమే. అది ప్రజా నిరసనలను మరింతగా పెంచుతుందని జిన్‌పింగ్‌ భయపడి ఉంటారని ఇది సూచిస్తోంది. 1989లో నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి మృతి సందర్భంగా ఏం జరిగిందో ఆయనకు బాగా తెలుసు.

చైనాలో నిరసనలు ఒక్కసారిగా వేగం పుంజుకుని రాజకీయ నాయకత్వాన్ని భయపెడుతుంటాయి. దీన్ని గుర్తించింది కాబట్టే, చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా... (విదేశీ) వ్యతిరేక శక్తుల చొరబాటు,  సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నపర్చే చట్టవిరుద్ధ చర్యలను కఠినంగా అణచివేయాలని సెంట్రల్‌ పొలిటికల్‌ అండ్‌ లీగల్‌ అఫెయిర్స్‌ కమిషన్‌ నిర్ణయించిందని రాసింది. ఇకపోతే చైనా సైబర్‌ స్పేస్‌ యంత్రాంగం సోషల్‌ మీడియాను నియంత్రించడానికి తరచుగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. ఇంటర్నెట్‌లో దేన్నయినా లైక్‌ చేస్తే అది నేరపూరిత మైన చర్య అవుతుందని సూచించే చట్టాన్ని కూడా అది రూపొందిం చింది. చైనా నాయకత్వం తాజా నిరసనలకు కారణాలను, నిరసన కారులను గుర్తించి దర్యాప్తు చేసే ‘చిన్న నాయకత్వ బృందాల’ను ఏర్పర్చింది.

చైనా వ్యతిరేక విదేశీ శక్తులు మరోసారి సాంస్కృతిక విప్లవాన్ని ప్రేరేపించే అవకాశముందని చైనా కమ్యూనిస్టు పార్టీ భీతిల్లుతోంది. నిరసనకారులపై చర్యలు తీసుకోవడం తప్పకపోవచ్చు. గతంలో తియనాన్మెన్‌ ఘటనలు చూపినట్లుగా, ఏ వ్యతిరేకతనైనా ‘తరువాతి 25 సంవత్సరాలపాటు’ అలాంటిది తలెత్తకుండా అణిచివేయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ విశ్వసిస్తోంది. పార్టీలోని ప్రత్యర్థులు తనను అధికారంలోంచి దింపడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తే మాత్రం జిన్‌పింగ్‌ కచ్చితంగా సహించరు!

వ్యాసకర్త అధ్యక్షుడు,సెంటర్‌ ఫర్‌ చైనా ఎనాలిసిస్‌ అండ్‌ స్ట్రాటెజీ
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top