మానవీయ ప్రపంచీకరణ కోసం...

Sakshi Guest Column On Chairmanship of the G-20 alliance

సందర్భం

జీ–20 దేశాల కూటమి అధ్యక్ష పదవిని నేడు భారత్‌ చేపడుతోంది. భారత అనుభవాలు అంతర్జాతీయ సమస్యలకు మార్గాలు చూపించగలవు. ఘర్షణ, పోటీ సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయిన ప్రపంచంలో... సార్వజనీన మానవ ఏకత్వ భావనను ప్రోత్సహించడంపైనే అధ్యక్ష హోదాలో భారత్‌ దృష్టి పెడుతుందని నేను బలంగా చెబుతున్నాను.

ఈరోజు, మన మనుగడ కోసం పోరాడాల్సిన అవసరం లేదు. నేటి మన యుగంలో యుద్ధం ఒక అవసరం కాదు. ప్రజాస్వామ్య మాతృమూర్తిగా మన ప్రాధాన్యతలు ‘ఒకే భూమి’ గాయాలు మాన్పేలా, ‘ఒకే కుటుంబం’లో సామరస్యాన్ని పెంపొందించేలా, ‘ఒకే భవిష్యత్తు’కు ఆశలు కల్పించేలా ఉంటాయి.

నేడు జీ–20 దేశాల కూటమి అధ్యక్ష పదవిని భారత్‌ చేపడుతోంది. ఇంతవరకు 17 పర్యా యాలు ఈ అధ్యక్ష పదవిని స్వీకరించిన సభ్యదేశాలు అద్భుతమైన ఫలితాలు అందించాయి. సూక్ష్మ ఆర్థిక సుస్థిరతను సాధించడం, అంతర్జాతీయ పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించడం, దేశాలను రుణభారం నుంచి బయటపడేయడం ఇవి సాధించిన చక్కటి ఫలితాల్లో కొన్ని మాత్రమే.

ఈ విజయాల నుంచి మనం ప్రయోజనాలు పొందటమే కాకుండా వాటి ఆధారంగా మరిన్ని విజయాలు సాధిస్తా మనడంలో సందేహమే లేదు. భారత్‌ ఈ పెద్ద భారాన్ని స్వీకరి స్తున్నందున, జీ–20 కూటమిని మరింత ముందుకు తీసుకుని పోగలమా అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. మొత్తం మానవ జాతి ప్రయోజనం పొందడం కోసం మన ప్రాథమిక ఆలోచనా ధోరణిని మనం ఉత్ప్రేరకంగా మార్చుకోగలమా? 

అలా మనం మార్చుకోగలమని నేను నమ్ముతున్నాను. మన ఆలోచనా ధోరణులు, మన మనస్తత్వాలు మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచే రూపొందుతాయి. మానవ చరిత్ర పొడవునా మానవ జాతి కొరతల్లోనే జీవిస్తూ వచ్చింది. పరిమిత వనరుల కోసం మనం పోరాడాం. ఎందుకంటే ఇత రులకు వాటిని నిరాకరించడం ద్వారానే మన మనుగడ ఆధారపడింది మరి. ఆలోచనలు, సిద్ధాంతాలు, అస్తిత్వాల మధ్య ఘర్షణ, పోటీ సర్వసాధారణమైన విషయాలుగా మారి పోయాయి. 

దురదృష్టవశాత్తూ, మనం అదేవిధమైన ప్రయోజన రహితమైన మనస్తత్వంలోనే ఈరోజుకూ కూరుకుపోయి ఉన్నాం. భూభాగాల కోసం లేదా వనరుల కోసం దేశాలు సాగిస్తున్న పోరాటంలో దీన్ని మనం చూస్తున్నాము. అత్యవసరమైన సరకుల సరఫరా కూడా ఆయుధంగా మారిపోతుండటంలో ఈ వ్యర్థ మనస్తత్వాన్ని మనం చూస్తున్నాము. ఈ ప్రపంచంలో కోట్లాదిమంది ప్రజలు వైరస్‌ దాడి ప్రమాదంలో ఉంటున్నప్పటికీ టీకాలు మాత్రం అతి కొద్ది దేశాలు పోగు చేసుకోవడంలోనూ దీన్ని మనం చూస్తున్నాము.  

ఘర్షణ, దురాశ అనేవి మానవ సహజ స్వభావమని కొంతమంది వాదించవచ్చు. ఈ వాదనతో నేను ఏకీభవించను. మానవులు వారసత్వపరంగానే స్వార్థపరులుగా ఉంటున్నట్లయితే, మానవు లందరూ ఒకటే అనే ఏకత్వ భావనను అనేక ఆధ్యాత్మిక సంప్రదా యాలు పూర్వం నుంచీ బోధిస్తూ రావడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలాంటి ఒక సంప్రదాయం భారతదేశంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.

అన్ని సజీవ ప్రాణులు, చివరకు నిర్జీవ వస్తువులు కూడా అయిదు ప్రాథమిక మూలకాలను కలిగి ఉంటున్నాయని ఈ సంప్రదాయం చెబుతోంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచతత్వాలే ఆ మూలకాలు. మానవుల శారీరకపరమైన, సామాజికపరమైన, పర్యావరణపరమైన క్షేమం, శ్రేయస్సుకు మనలో, మన మధ్య ఉంటున్న ఈ మూలకాలలోని సామరస్యం అత్యవసర మని ఆ సంప్రదాయం మనకు బోధిస్తోంది. 

ఈ సార్వజనీన మానవ ఏకత్వ భావనను ప్రోత్సహించడంపైనే భారత్‌ చేపడుతున్న జీ–20 కూటమి అధ్యక్ష పదవి దృష్టి పెడుతుందని నేను బలంగా చెబుతున్నాను. కాబట్టి ఇకనుంచి మన నినాదం ఒకటే. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’. ఇది నినాదం మాత్రమే కాదు. మానవ పరిసరాలు, పరిస్థితుల్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పులను ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ మార్పులను అభినందించడంలో మనం ఇంతవరకు సామూహికంగానే విఫల మయ్యామని చెప్పక తప్పదు. 

ఈరోజు యావత్‌ ప్రపంచ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చ డానికి సరిపోయే ఉత్పత్తులకోసం అవసరమైన సాధనాలను మనం కలిగి ఉన్నాము. ఈరోజు, మన మనుగడ కోసం పోరాడాల్సిన అవసరం లేదు. నేటి మన యుగంలో యుద్ధం ఒక అవసరం కాదు. నిజంగానే యుద్ధం మన అవసరం కాదు.

ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అయిన వాతావరణ మార్పు, ఉగ్రవాదం, సాంక్రమిక మహమ్మారులు వంటివాటిని మనం పరస్పరం పోరాడకుండానే పరిష్కరించు కోగలము. అయితే కలిసి పనిచేయడం ద్వారానే మనం దీన్ని సాధించగలం. అదృష్టవశాత్తూ, మానవజాతి మొత్తం ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించగల సకల సాధనాలను ఈరోజు సాంకేతిక విజ్ఞానం మనకు అందిస్తోంది. నేడు మనం నివసిస్తున్న బారీ స్థాయి వర్చువల్‌ ప్రపంచాలు డిజిటల్‌ టెక్నాలజీల భారీ పరిణామాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నాయి. 

మానవజాతిలో ఆరింట ఒకవంతు ప్రజలకు ఆశ్రయం ఇస్తున్న భారతదేశం– తన భాషలు, మతాలు, ఆచార సంప్రదాయాలు, విశ్వాసాలతో కూడిన అపారమైన వైవిధ్యంతో ఒక సూక్ష్మ ప్రపంచ రూపాన్ని కలిగి ఉంటోంది. సామూహికంగా నిర్ణయాలు తీసుకునే పురాతన సాంప్రదాయాలతో భారతదేశం నేడు ప్రజాస్వామ్య ప్రాథమిక డీఎన్‌ఏకి దోహదం చేస్తోంది. ప్రజాస్వామ్య మాతృ మూర్తిగా భారత జాతీయ ఏకాభిప్రాయం ఎవరి ఆదేశాలతోనో రూపొందలేదు. కోట్లాది స్వేచ్ఛా వాణుల మేళనంతో ఇదొక సామరస్య శ్రావ్య గీతంగా రూపొందింది.

ఈరోజు, భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటోంది. మన పౌర కేంద్రక పాలనా నమూనా అత్యంత వెనుకబడి ఉన్న పౌరుల సంక్షేమ బాధ్యతను కూడా చేపడుతోంది. అదే సమయంలో మన ప్రతిభా సంపన్నులైన యువత సృజనాత్మక మేధాతత్వాన్ని మరింతగా పెంచి పోషిస్తోంది.

జాతీయ అభివృద్ధిని ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఒక ప్రదర్శనగా కాకుండా, పౌరుల నేతృత్వంలోని ప్రజా ఉద్యమంగా మార్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం. పారదర్శకంగా, బహి రంగంగా, పరస్పర నిర్వహణీయంగా ఉండే డిజిటల్‌ పబ్లిక్‌ ఉత్పత్తు లను రూపొందించే దిశగా మనం టెక్నాలజీని ఉపయోగించు కుంటున్నాం. సామాజిక రక్షణ, ఆర్థిక సమగ్రత, ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల వంటి వివిధ రంగాల్లో ఇవి విప్లవాత్మకమైన పురోగతిని సుసాధ్యం చేశాయి.

ఈ అన్ని కారణాల వల్ల, భారత అనుభవాలు అంత ర్జాతీయ సమస్యలకు మార్గాలు చూపించగలవు. జీ–20 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న కాలంలో భారత అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, నమూనాలను ఇతరులకు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా చూపుతాము.

మన జీ–20 ప్రాధాన్యతలు జీ–20 సభ్య దేశాలతో చర్చలపైనే కాకుండా, దక్షిణార్ధ గోళంలో తమ వాణిని తరచుగా వినిపించ లేకుండా పోతున్న మన తోటి ప్రయాణికులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే రూపుదిద్దుకుంటాయి. మన ప్రాధాన్యతలు ‘ఒకే భూమి’ గాయాలు మాన్పేలా, ‘ఒకే కుటుంబం’లో సామరస్యాన్ని పెంపొందించేలా, ‘ఒకే భవిష్యత్తు’కు ఆశలు కల్పించేలా ఉంటాయి. మన భూగ్రహ గాయాలను మాన్పడం కోసం, భారతీయ సంప్రదాయం, ధర్మకర్తృత్వం ప్రాతిపదికన నిలకడైన, పర్యావరణ అనుకూల జీవన శైలులను ప్రోత్సహిస్తాము.

మానవ కుటుంబంలో సామరస్యాన్ని ప్రోత్సహించడానికిగానూ, అంతర్జాతీయ ఆహార, ఎరువులు, వైద్య ఉత్పత్తుల సరఫరాను రాజకీయాల నుంచి వేరు చేయవలసి ఉంది. అప్పుడే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మానవీయ సంక్షోభానికి దారితీయకుండా ఉంటాయి. మన సొంత కుటుంబాలకు మల్లే, ఎవరి అవసరాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయో వాటినే మనం పట్టించుకుని తీరాల్సి ఉంటుంది.

మన భవిష్యత్‌ తరాల్లో ఆశాభావం నింపడానికి, భారీ ఎత్తున విధ్వంసానికి దారితీసే ఆయుధాల ద్వారా కలుగుతున్న ప్రమాదాలపై అంతర్జాతీయ భద్రతను విస్తరించడం గురించి అత్యత శక్తిమంతమైన దేశాల మధ్య నిజాయితీతో కూడిన సంభాషణను మనం ప్రోత్స హిస్తాము.
 
భారతదేశ జీ–20 ఎజెండా సమగ్రమైనది, ఆశావహమైనది, కార్యాచరణ స్వభావం కలిగినది, నిశ్చయమైనది. భారత్‌ జీ–20 అధ్యక్ష పదవిని... స్వస్థత చేకూర్చి, సామరస్యాన్ని, ఆశను రేకెత్తించే అధ్యక్షతగా మల్చడానికి కలిసి కృషి చేద్దాము. మానవులకు ప్రాధా న్యత ఉండే సరికొత్త ప్రపంచీకరణ నమూనాను రూపొందించడం కోసం కలిసి పని చేద్దాం.

నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top