breaking news
G-20 nations
-
మానవీయ ప్రపంచీకరణ కోసం...
జీ–20 దేశాల కూటమి అధ్యక్ష పదవిని నేడు భారత్ చేపడుతోంది. భారత అనుభవాలు అంతర్జాతీయ సమస్యలకు మార్గాలు చూపించగలవు. ఘర్షణ, పోటీ సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయిన ప్రపంచంలో... సార్వజనీన మానవ ఏకత్వ భావనను ప్రోత్సహించడంపైనే అధ్యక్ష హోదాలో భారత్ దృష్టి పెడుతుందని నేను బలంగా చెబుతున్నాను. ఈరోజు, మన మనుగడ కోసం పోరాడాల్సిన అవసరం లేదు. నేటి మన యుగంలో యుద్ధం ఒక అవసరం కాదు. ప్రజాస్వామ్య మాతృమూర్తిగా మన ప్రాధాన్యతలు ‘ఒకే భూమి’ గాయాలు మాన్పేలా, ‘ఒకే కుటుంబం’లో సామరస్యాన్ని పెంపొందించేలా, ‘ఒకే భవిష్యత్తు’కు ఆశలు కల్పించేలా ఉంటాయి. నేడు జీ–20 దేశాల కూటమి అధ్యక్ష పదవిని భారత్ చేపడుతోంది. ఇంతవరకు 17 పర్యా యాలు ఈ అధ్యక్ష పదవిని స్వీకరించిన సభ్యదేశాలు అద్భుతమైన ఫలితాలు అందించాయి. సూక్ష్మ ఆర్థిక సుస్థిరతను సాధించడం, అంతర్జాతీయ పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించడం, దేశాలను రుణభారం నుంచి బయటపడేయడం ఇవి సాధించిన చక్కటి ఫలితాల్లో కొన్ని మాత్రమే. ఈ విజయాల నుంచి మనం ప్రయోజనాలు పొందటమే కాకుండా వాటి ఆధారంగా మరిన్ని విజయాలు సాధిస్తా మనడంలో సందేహమే లేదు. భారత్ ఈ పెద్ద భారాన్ని స్వీకరి స్తున్నందున, జీ–20 కూటమిని మరింత ముందుకు తీసుకుని పోగలమా అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. మొత్తం మానవ జాతి ప్రయోజనం పొందడం కోసం మన ప్రాథమిక ఆలోచనా ధోరణిని మనం ఉత్ప్రేరకంగా మార్చుకోగలమా? అలా మనం మార్చుకోగలమని నేను నమ్ముతున్నాను. మన ఆలోచనా ధోరణులు, మన మనస్తత్వాలు మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచే రూపొందుతాయి. మానవ చరిత్ర పొడవునా మానవ జాతి కొరతల్లోనే జీవిస్తూ వచ్చింది. పరిమిత వనరుల కోసం మనం పోరాడాం. ఎందుకంటే ఇత రులకు వాటిని నిరాకరించడం ద్వారానే మన మనుగడ ఆధారపడింది మరి. ఆలోచనలు, సిద్ధాంతాలు, అస్తిత్వాల మధ్య ఘర్షణ, పోటీ సర్వసాధారణమైన విషయాలుగా మారి పోయాయి. దురదృష్టవశాత్తూ, మనం అదేవిధమైన ప్రయోజన రహితమైన మనస్తత్వంలోనే ఈరోజుకూ కూరుకుపోయి ఉన్నాం. భూభాగాల కోసం లేదా వనరుల కోసం దేశాలు సాగిస్తున్న పోరాటంలో దీన్ని మనం చూస్తున్నాము. అత్యవసరమైన సరకుల సరఫరా కూడా ఆయుధంగా మారిపోతుండటంలో ఈ వ్యర్థ మనస్తత్వాన్ని మనం చూస్తున్నాము. ఈ ప్రపంచంలో కోట్లాదిమంది ప్రజలు వైరస్ దాడి ప్రమాదంలో ఉంటున్నప్పటికీ టీకాలు మాత్రం అతి కొద్ది దేశాలు పోగు చేసుకోవడంలోనూ దీన్ని మనం చూస్తున్నాము. ఘర్షణ, దురాశ అనేవి మానవ సహజ స్వభావమని కొంతమంది వాదించవచ్చు. ఈ వాదనతో నేను ఏకీభవించను. మానవులు వారసత్వపరంగానే స్వార్థపరులుగా ఉంటున్నట్లయితే, మానవు లందరూ ఒకటే అనే ఏకత్వ భావనను అనేక ఆధ్యాత్మిక సంప్రదా యాలు పూర్వం నుంచీ బోధిస్తూ రావడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలాంటి ఒక సంప్రదాయం భారతదేశంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. అన్ని సజీవ ప్రాణులు, చివరకు నిర్జీవ వస్తువులు కూడా అయిదు ప్రాథమిక మూలకాలను కలిగి ఉంటున్నాయని ఈ సంప్రదాయం చెబుతోంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచతత్వాలే ఆ మూలకాలు. మానవుల శారీరకపరమైన, సామాజికపరమైన, పర్యావరణపరమైన క్షేమం, శ్రేయస్సుకు మనలో, మన మధ్య ఉంటున్న ఈ మూలకాలలోని సామరస్యం అత్యవసర మని ఆ సంప్రదాయం మనకు బోధిస్తోంది. ఈ సార్వజనీన మానవ ఏకత్వ భావనను ప్రోత్సహించడంపైనే భారత్ చేపడుతున్న జీ–20 కూటమి అధ్యక్ష పదవి దృష్టి పెడుతుందని నేను బలంగా చెబుతున్నాను. కాబట్టి ఇకనుంచి మన నినాదం ఒకటే. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’. ఇది నినాదం మాత్రమే కాదు. మానవ పరిసరాలు, పరిస్థితుల్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పులను ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ మార్పులను అభినందించడంలో మనం ఇంతవరకు సామూహికంగానే విఫల మయ్యామని చెప్పక తప్పదు. ఈరోజు యావత్ ప్రపంచ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చ డానికి సరిపోయే ఉత్పత్తులకోసం అవసరమైన సాధనాలను మనం కలిగి ఉన్నాము. ఈరోజు, మన మనుగడ కోసం పోరాడాల్సిన అవసరం లేదు. నేటి మన యుగంలో యుద్ధం ఒక అవసరం కాదు. నిజంగానే యుద్ధం మన అవసరం కాదు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అయిన వాతావరణ మార్పు, ఉగ్రవాదం, సాంక్రమిక మహమ్మారులు వంటివాటిని మనం పరస్పరం పోరాడకుండానే పరిష్కరించు కోగలము. అయితే కలిసి పనిచేయడం ద్వారానే మనం దీన్ని సాధించగలం. అదృష్టవశాత్తూ, మానవజాతి మొత్తం ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించగల సకల సాధనాలను ఈరోజు సాంకేతిక విజ్ఞానం మనకు అందిస్తోంది. నేడు మనం నివసిస్తున్న బారీ స్థాయి వర్చువల్ ప్రపంచాలు డిజిటల్ టెక్నాలజీల భారీ పరిణామాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నాయి. మానవజాతిలో ఆరింట ఒకవంతు ప్రజలకు ఆశ్రయం ఇస్తున్న భారతదేశం– తన భాషలు, మతాలు, ఆచార సంప్రదాయాలు, విశ్వాసాలతో కూడిన అపారమైన వైవిధ్యంతో ఒక సూక్ష్మ ప్రపంచ రూపాన్ని కలిగి ఉంటోంది. సామూహికంగా నిర్ణయాలు తీసుకునే పురాతన సాంప్రదాయాలతో భారతదేశం నేడు ప్రజాస్వామ్య ప్రాథమిక డీఎన్ఏకి దోహదం చేస్తోంది. ప్రజాస్వామ్య మాతృ మూర్తిగా భారత జాతీయ ఏకాభిప్రాయం ఎవరి ఆదేశాలతోనో రూపొందలేదు. కోట్లాది స్వేచ్ఛా వాణుల మేళనంతో ఇదొక సామరస్య శ్రావ్య గీతంగా రూపొందింది. ఈరోజు, భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటోంది. మన పౌర కేంద్రక పాలనా నమూనా అత్యంత వెనుకబడి ఉన్న పౌరుల సంక్షేమ బాధ్యతను కూడా చేపడుతోంది. అదే సమయంలో మన ప్రతిభా సంపన్నులైన యువత సృజనాత్మక మేధాతత్వాన్ని మరింతగా పెంచి పోషిస్తోంది. జాతీయ అభివృద్ధిని ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఒక ప్రదర్శనగా కాకుండా, పౌరుల నేతృత్వంలోని ప్రజా ఉద్యమంగా మార్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం. పారదర్శకంగా, బహి రంగంగా, పరస్పర నిర్వహణీయంగా ఉండే డిజిటల్ పబ్లిక్ ఉత్పత్తు లను రూపొందించే దిశగా మనం టెక్నాలజీని ఉపయోగించు కుంటున్నాం. సామాజిక రక్షణ, ఆర్థిక సమగ్రత, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వంటి వివిధ రంగాల్లో ఇవి విప్లవాత్మకమైన పురోగతిని సుసాధ్యం చేశాయి. ఈ అన్ని కారణాల వల్ల, భారత అనుభవాలు అంత ర్జాతీయ సమస్యలకు మార్గాలు చూపించగలవు. జీ–20 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న కాలంలో భారత అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, నమూనాలను ఇతరులకు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా చూపుతాము. మన జీ–20 ప్రాధాన్యతలు జీ–20 సభ్య దేశాలతో చర్చలపైనే కాకుండా, దక్షిణార్ధ గోళంలో తమ వాణిని తరచుగా వినిపించ లేకుండా పోతున్న మన తోటి ప్రయాణికులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే రూపుదిద్దుకుంటాయి. మన ప్రాధాన్యతలు ‘ఒకే భూమి’ గాయాలు మాన్పేలా, ‘ఒకే కుటుంబం’లో సామరస్యాన్ని పెంపొందించేలా, ‘ఒకే భవిష్యత్తు’కు ఆశలు కల్పించేలా ఉంటాయి. మన భూగ్రహ గాయాలను మాన్పడం కోసం, భారతీయ సంప్రదాయం, ధర్మకర్తృత్వం ప్రాతిపదికన నిలకడైన, పర్యావరణ అనుకూల జీవన శైలులను ప్రోత్సహిస్తాము. మానవ కుటుంబంలో సామరస్యాన్ని ప్రోత్సహించడానికిగానూ, అంతర్జాతీయ ఆహార, ఎరువులు, వైద్య ఉత్పత్తుల సరఫరాను రాజకీయాల నుంచి వేరు చేయవలసి ఉంది. అప్పుడే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మానవీయ సంక్షోభానికి దారితీయకుండా ఉంటాయి. మన సొంత కుటుంబాలకు మల్లే, ఎవరి అవసరాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయో వాటినే మనం పట్టించుకుని తీరాల్సి ఉంటుంది. మన భవిష్యత్ తరాల్లో ఆశాభావం నింపడానికి, భారీ ఎత్తున విధ్వంసానికి దారితీసే ఆయుధాల ద్వారా కలుగుతున్న ప్రమాదాలపై అంతర్జాతీయ భద్రతను విస్తరించడం గురించి అత్యత శక్తిమంతమైన దేశాల మధ్య నిజాయితీతో కూడిన సంభాషణను మనం ప్రోత్స హిస్తాము. భారతదేశ జీ–20 ఎజెండా సమగ్రమైనది, ఆశావహమైనది, కార్యాచరణ స్వభావం కలిగినది, నిశ్చయమైనది. భారత్ జీ–20 అధ్యక్ష పదవిని... స్వస్థత చేకూర్చి, సామరస్యాన్ని, ఆశను రేకెత్తించే అధ్యక్షతగా మల్చడానికి కలిసి కృషి చేద్దాము. మానవులకు ప్రాధా న్యత ఉండే సరికొత్త ప్రపంచీకరణ నమూనాను రూపొందించడం కోసం కలిసి పని చేద్దాం. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి -
G-20 Summit: మళ్లీ దారిమళ్లిన జీ–20
వర్తమానం యుద్ధశకంగా మారకూడదని, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు అంతమొందించటానికి అన్ని పక్షాలూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తూ రెండురోజులపాటు ఇండొనేసియా లోని బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు బుధవారం ముగిసింది. దేశాలమధ్య ఆర్థిక సహకారం పెంపొందించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరచాలన్న సంకల్పంతో 23 ఏళ్లక్రితం ఈ సంస్థ ఏర్పడింది. కానీ ఆరంభం నుంచీ ఇతరేతర సంక్షోభాలు దాన్ని ముసురుకుంటున్నాయి. పర్యవసానంగా శిఖరాగ్ర సదస్సు ఎజెండాపై కాక ఎప్పటికప్పుడు ముంచుకొచ్చే క్లిష్ట సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించక తప్పడం లేదు. జీ–20 సామాన్యమైనది కాదు. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఈ సంస్థ సభ్య దేశాల వాటా 80 శాతం. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం ఈ దేశాలదే. ఇక జనాభారీత్యా చూస్తే దాదాపు మూడింట రెండువంతుల మంది ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు. బాలి శిఖరాగ్ర సదస్సు ఎదుట పెద్ద ఎజెండాయే ఉంది. దాదాపు ఏణ్ణర్థంపాటు కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో భవిష్యత్తు సంక్షోభాలను ఎదుర్కొనడానికి అంతర్జాతీయంగా పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ రూపకల్పనపై సమాలోచనలు ఈ సదస్సు లక్ష్యం. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని కూడా ముసాయిదా తెలిపింది. స్వచ్ఛ ఇంధన వనరుల వినియోగం పెరిగేలా, ప్రపంచ దేశాలు ఆ దిశగా మళ్లేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలని కూడా సంకల్పించారు. స్వచ్ఛ ఇంధన వనరుల కోసం భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. అందు కోసం సంపన్న దేశాలు ఏం చేయాలో కూడా ఈ సదస్సులో చర్చించాల్సి ఉంది. కానీ రెండురోజుల సదస్సునూ గమనిస్తే నిరాశే మిగులుతుంది. నిరుడు అక్టోబర్‌లో ఇటలీలోని రోమ్‌లో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ ఏడాది కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీ–20 సభ్య దేశాల్లో కోవిడ్ పర్యవసానంగా ఉత్పాదకత గణనీయంగా పడిపోయింది. మన దేశం వరకూ చూస్తే ఉత్పాదకతలో 14 శాతం క్షీణత కనబడుతోంది. అందరికన్నా అధికంగా నష్టపోయింది మనమే. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగకపోయివుంటే ఆర్థిక వ్యవస్థలు ఇంత చేటు నష్టపోయేవి కాదేమో! కానీ దురాక్రమణ, అనంతరం రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు తీసుకొచ్చిన అనిశ్చితి ద్రవ్యోల్బణాన్ని అమాంతం తారస్థాయికి చేర్చింది. పర్యవసానంగా వేరే దేశాల మాటేమోగానీ పశ్చిమ దేశాల కొనుగోలు శక్తి పడిపోయింది. వృద్ధిని అది కోలుకోలేని దెబ్బతీసింది. ఈ గండంనుంచి గట్టెక్కేందుకు చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఇది సహజంగానే ఆర్థిక కార్య కలాపాలపై ప్రభావం చూపింది. అమెరికా, బ్రిటన్లు ఆర్థిక మాంద్యంలోకి జారుకునే సూచనలు కనబడుతున్నాయి. యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి స్తంభించే దిశగా కదులుతున్నాయంటున్నారు. ఆకలి, నిరుద్యోగం ఇప్పటికే చాలా దేశాలను చుట్టుముట్టాయి. ఇక ప్రపంచ ఆర్థిక చోదక శక్తుల్లో ఒకటైన చైనాను రియల్ ఎస్టేట్ సంక్షోభం పీడిస్తోంది. దాంతో ఆ దేశ జీడీపీ బాగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. దీన్నుంచి బయటపడటం మాట అటుంచి కనీసం తక్కువ నష్టంతో గట్టెక్కాలన్నా జీ–20 దేశాలమధ్య సహకారం, సమన్వయం, ఐక్యత అవసరం. ఈ శిఖరాగ్ర సదస్సు ఎజెండాలోని అంశాల మాట అటుంచి కనీసం సభ్య దేశాల ఐక్యతకు అనువైన కార్యాచరణ రూపొందించగలిగితే బాగుండేది. కానీ అది సాధ్యపడినట్టు కనబడటం లేదు. ఈమధ్య ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ఒక ముఖ్యమైన సూచన చేసింది. జీ–20 దేశాలన్నీ సమష్టిగా కదలి, గట్టి కార్యాచరణకు పూనుకొంటే ప్రస్తుత సంక్షోభంనుంచి ప్రపంచం గట్టెక్కుతుందని తెలిపింది. ఇందుకు శాంతి నెలకొనడం అవసరమని వివరించింది. కానీ వినేదెవరు? సదస్సు మొదటి రోజున కూడా ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా క్షిపణి దాడులు చేసింది. నాటో సభ్యదేశమైన పోలాండ్‌లో రష్యా క్షిపణి ఒకటి పేలి ఇద్దరు పౌరులు మరణించారు. ఇది ఉద్దేశపూర్వకమా, పొరపాటా అన్నది నిర్ధారణ కాలేదు. ఆ క్షిపణి రష్యా భూభాగంనుంచి ప్రయోగించివుండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెబుతున్నారు. రష్యా ఉద్దేశపూర్వ కంగా చేసివుంటే అది నాటోకు తొలి హెచ్చరిక పంపినట్టే అనుకోవాలి. ఈసారి జీ–20 సదస్సు మొత్తం రష్యా–ఉక్రెయిన్ లడాయిపైనే కేంద్రీకరించక తప్పని స్థితి ఏర్ప డింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సదస్సుకు రాలేదన్న మాటేగానీ సదస్సు మొత్తం ఆయన చుట్టూ, ఆయన మున్ముందు వేయబోయే అడుగుల చుట్టూ తిరిగింది. ఏతావాతా ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి ప్రపంచం తిరోగమించిందనే చెప్పుకోవాలి. రష్యా–పాశ్చాత్య దేశాల వైషమ్యాలు పెచ్చుమీరాయి. దీనికి చైనా తలనొప్పి అదనం. అందువల్లనే ప్రధాన ఎజెండా మాట అటుంచి అసలు రష్యా దురాక్రమణను ఖండిస్తూ జీ–20 ఒక సంయుక్త ప్రకటనైనా విడుదల చేయగలదా అన్న సందేహాలు తలెత్తాయి. అనుకున్నట్టే ఆ ప్రకటనలో హితబోధలే ధ్వనించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 1న జీ–20 సారథ్య బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రెండు ప్రపంచ యుద్ధాల పర్యవసానంగా మానవజాతి మనుగడకు ఏర్పడిన ముప్పును గుర్తుంచుకునైనా సంపన్న రాజ్యాలు కయ్యానికి కాలుదువ్వే పోకడలకు స్వస్తిపలకాలి. శాంతి నెలకొనడానికి దోహదపడాలి. -
ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచం యావత్తు గొప్ప గౌరవ భావంతో భారత్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నల్లధనంపై పోరుకు జీ20 దేశాలు అంగీకరించాయని అన్నారు. ప్రపంచ శాంతి, సుహృద్భావ వాతావరణాన్ని నల్లధనం బలహీనపరుస్తుందన్న అభిప్రాయంతో అన్ని దేశాలు ఏకీభవించాయని పేర్కొన్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ పర్యటన ముగించుకుని వచ్చిన మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు. తాజా విదేశీ పర్యటనలో 38 మంది ప్రపంచ నాయకులతో భేటీ అయినట్టు తెలిపారు. 20 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నానని వెల్లడించారు. ఈ సమావేశాలు నిష్పక్షపాతంగా, సమగ్రంగా, ఫలప్రదంగా జరిగాయని మోదీ వివరించారు. A visit where I saw renewed respect & immense enthusiasm towards India. My blog on the recently concluded visit. http://t.co/apFTvVnyo6 — Narendra Modi (@narendramodi) November 21, 2014