సంక్షేమం పేదల హక్కు | Sakshi
Sakshi News home page

సంక్షేమం పేదల హక్కు

Published Fri, Feb 23 2024 5:17 AM

Sakshi Guest Column On AP CM Jagan Welfare Govt

ఇటీవలి కాలంలో బాగా చర్చ లోకి వస్తున్న రెండు అంశాలు: సంక్షేమం, అభివృద్ధి. సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల లాభపడిన వర్గాలు సంక్షేమం అంటే గవర్నమెంట్‌ పేద వాళ్లకు దోచి పెట్టడం అనే అపోహను సృష్టించారు. నిజానికి సంక్షేమం అంటే గవర్నమెంట్‌ పేద వాళ్ళ పట్ల తనకు ఉన్న బాధ్యతను నెరవేర్చడమే. ఒక రకంగా చెప్పాలి అంటే సంక్షేమం పేద వాళ్ళ హక్కు. ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం తన ప్రజల బాగోగులు అయినప్పుడు సంక్షేమం అందులో ముఖ్య భూమిక పోషించక తప్పదు.

చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే సమ్రాట్‌ అశోకుడు తన ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టారు. తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ద్రావిడ రాజకీయాల వల్ల ఇప్పటికీ వందేళ్లుగా సంక్షేమానికి పెద్ద పీట వేయడం కొన సాగుతోంది. తమిళనాడు ఈ రోజున చాలా ప్రమాణాల్లో దేశంలోనే ముందంజలో ఉండడానికి కారణం అక్కడ అమలు కాబడుతున్న సంక్షేమ పథకాలే. 

గడచిన ఐదేళ్లలో జగన్‌ సారథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ అమలు చేస్తున్న సంక్షేమం కూడా నిరవధికంగా ఇక ముందు కూడా కొనసాగితే అభివృద్ధి ఉరకలు వేస్తుంది. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ విద్య వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. చిన్న వయసులోనే పేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకు గ్లోబల్‌ లింక్‌ లాంగ్వేజ్‌ అయిన ఇంగ్లీష్‌పై పట్టు కల్పిస్తే వాళ్లలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

తద్వారా రాష్ట్రానికీ కొత్త అభివృద్ధి ద్వారాలూ తెరుచుకుంటాయి. ఇంగ్లీష్‌ నేర్చుకున్న ప్రతి విద్యార్థి విజయం సాధిస్తారు అని కాదు కానీ, తప్పనిసరిగా విజయం సాధించ గలిగే వారి నిష్పత్తి పెరగబోతోంది.  తద్వారా ఒక మెట్టు పైన నిలబడగలిగే సామర్థ్యం గల యువశక్తి తయార వుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయో గపడే అంశాలే.

వృద్ధాప్య పెన్షన్‌ స్కీముల వల్ల కూడా తిరిగి సమాజానికీ, రాష్ట్రానికే ప్రయోజనం. వాళ్ళు ఇంకొకరిపై ఆధార పడే అవసరాన్ని తగ్గించడం వల్ల వారు కానీ, వారి కుటుంబీకులు కానీ పలు ఉత్పాదక పనుల్లో వారి శ్రమను వెచ్చించే అవకాశం కలుగుతుంది. ఇతర సంక్షేమ పథకాలూ ఇవే ఫలితాలనిస్తాయి. అయితే ప్రజలు వీటి వల్ల సోమరులవుతున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి కువిమర్శలు ప్రజలను తక్కువగా చూడడం కంటే మరొకటి కాదు. ఇలాంటి విమర్శకులు ఎప్పుడూ కూడా ఉచిత భూమి, నిధులు పొందుతున్న బడా పారిశ్రా మికవేత్తలను నామమాత్రంగానైనా ప్రశ్నించరు. 

గతంలో తమిళనాడులో కరుణానిధి గవర్న మెంట్‌ హయాంలో ఉచిత కలర్‌ టీవీ పథకాన్ని అమలు చేశారు. దీన్ని కొందరు హేళన చేశారు. అయితే, కరుణానిధి ఆ పథకం ప్రవేశపెట్టడా నికి ఒక బలమైన కారణం చెప్పారు. గ్రామాలలో పేద, ముఖ్యంగా దళిత బహుజన వర్గాలకు చెందిన జనాలు గొప్పింటి వారి ఇంటి బయట నుంచుని టీవీలు చూసేవారు. ఈ కలర్‌ టీవీ పథకం ద్వారా ఎవరింటిలో వారు కూర్చునే టీవీని చూడగల ఆత్మ గౌరవం సాధించగలిగారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన ఒక పరిశోధన కలర్‌ టీవీల వల్ల మహిళా సాధికారత బలపడినట్టు తేల్చడం గమనార్హం.

మిరిమిట్లు కొలిపే రహదారులూ, ఆకాశ హర్మ్యాలూ, పేరుకే తప్ప ఆచరణలో నిలబడలేని ‘స్మార్ట్‌ సిటీ’లు అభివృద్ధికి సూచీలుగా చంద్రబాబు లాంటివారు పేర్కొంటారు. కింది వర్గాల ప్రజల స్థితిగతుల్ని మార్చే ప్రయత్నం చేయకుండా కేవలం వీటి మీదే దృష్టి కేంద్రీకరిస్తే వచ్చే అభివృద్ధి మాయాజాలమే అవుతుందని ఇప్పటికే పలుమార్లు రుజువయ్యింది. తాను హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మాణం కావించానని ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు. కానీ హైదరాబాద్‌లో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. దాని అర్థం ఏమంటే ఎక్కడైతే అభివృద్ధి జరిగింది అని చెప్పారో అక్కడి ప్రజలే దానికి బలి అయ్యి తమ బ్రతుకులను ఛిద్రం చేసిన బాబును తిరస్కరించారు.

మళ్ళీ 2019లో అమరావతి పేరు మీద చేసిన రియల్‌ ఎస్టేట్‌ ‘అభివృద్ధి’ దందాను కూడా రాష్ట్రం మొత్తం తిరస్కరించడమే కాకుండా అక్కడి ప్రజలు కూడా ఛీత్కరించారు. వారు చెప్పే ‘ట్రికిల్‌ డౌన్‌ ఎకనామిక్స్‌’ ఆర్థిక పరిపుష్టి గలిగిన అమెరికా లాంటి దేశాల్లోనే విఫలమై నేడు అక్కడ కూడా సంక్షేమ అవసరాన్ని గుర్తిస్తున్నారన్న విషయాన్ని గమనించాలి.

ప్రజలందరికీ గవర్నమెంటే ఆరోగ్య బీమా కల్పించాలి (మెడికేర్‌ ఫర్‌ ఆల్‌), సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌) గవర్నమెంటే కల్పించాలి అనే నినాదాలు మొదలయ్యాయి అక్కడ. కొన్ని వేల ఏళ్లుగా వేళ్ళూనుకుపోయిన కుల, వర్గ వైషమ్యాలతో నిండిన సమాజంలో వంచిత ప్రజల సంక్షేమంతో కూడిన అభివృద్ధి మాత్రమే ముందుకు తీసుకువెళ్లే మార్గం.

డా‘‘ జి. నవీన్‌ 
వ్యాసకర్త సామాజిక,రాజకీయ అంశాల విశ్లేషకులు

Advertisement
 
Advertisement