విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు? | professor lakshminaraya write on telangana education system | Sakshi
Sakshi News home page

విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు?

Published Sat, Oct 5 2024 4:58 PM | Last Updated on Sat, Oct 5 2024 5:19 PM

professor lakshminaraya write on telangana education system

అందరికీ విద్య లేకుండా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు తొలి ప్రధాని నెహ్రూ. కానీ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత రేటు 77% దాటలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్షరాస్యత రేటు 66% కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయి స్తామని చెప్పి 7.3% మాత్రమే కేటాయించింది కాంగ్రెస్‌. పక్కన ఉన్న తమిళనాడులో 13.4%,ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యకు 12.6% నిధులు కేటాయించారు.

పాఠశాల విద్యను తీసుకుంటే పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 2022 –23 సంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు  ఉన్నారు. 1,864 స్కూళ్లలో విద్యార్థులే లేరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల దగ్గరలోనే విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం. చట్ట ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కనీసం ఒక్క కిలోమీటర్‌ దూరం ఉంటే తప్ప అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరొక ప్రధానమైన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం. ఇంకా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలసలు, జనాభా తగ్గుదల మొదలైన అంశాలు విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. ఇంకా ఈ విషయంపై లోతైన అధ్యయనం చేసి కారణాలను కనుక్కోకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, తక్కువ విద్యార్థులు ఉన్నారని అక్కడ ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు పంపించడం, విద్యార్థులే లేరని పాఠశాలలను మూసివేయడం మూర్ఖత్వం.

పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం బోధన జరుగుతుందా లేదా చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారులు ఉండాలి. అటువంటి అధికారుల పోస్టులు దాదాపు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దిగ జారుతున్న ఈ పరిస్థితులను చక్కబెట్టి సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు, నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్థాపి స్తామని అంటున్నారు. కామన్‌ స్కూల్‌కు భిన్నంగా ఇప్పటికే రకరకాల అంతరాలతో భ్రష్టు పడుతున్న పాఠశాల విద్యకు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఇంకొక అంతరాల దొంతర తయారు కాబోతున్నది.

అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 17 స్టేట్‌ యూనివర్సిటీలను సమగ్రంగా అభి వృద్ధి చేసే బదులు భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో ఒక ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో 2 వేలకు పైగా ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది ఖాళీలు తీసుకుంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలలోని పోస్టులను భర్తీ చేయలేదు.

ప్రస్తుతమున్న యూనివర్సిటీలను, ఇంజనీరింగ్‌ కళాశాలలను, పాలిటెక్నిక్‌ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి నైపుణ్యాలను నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్‌ యూనివర్సిటీని స్థాపించడం ఎవరికోసమనే ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 పేరెన్నిక గల విదేశీ కంపెనీలు హైద రాబాదుకు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ 2 వేల మందికి నైపుణ్యాలను నేర్పిస్తామని అంటున్నారు. ఈ విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన తక్కువ జీతానికి పనిచేసే, బానిస మనస్తత్వం కలిగిన కార్మికులను తయారుచేయడానికి వస్తుందా ఈ స్కిల్‌ యూనివర్సిటీ అనే అనుమానం కలుగు తుంది. ఇక్కడ ఫ్యాకల్టీని నియమించడంలో, విద్యార్థులకు అడ్మిషన్‌ కల్పించడంలో రిజర్వేషన్ల పద్ధతి పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. 

చ‌ద‌వండి: సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు   

పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. క్రీడా పరికరాలు లేవు. అన్ని పాఠశాలలో పీఈటీ / పీడీ పోస్టులు మంజూరు చేయబడలేదు. పట్టణాలలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలకు ఆట స్థలాలే లేవు. అటువంటి పరిస్థితులలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే. మొత్తానికి గత తొమ్మిది నెలల్లో తెలంగాణ విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి సమాజంలో లోతైన చర్చ జరగవలసి ఉన్నది.


-ప్రొఫెస‌ర్‌  కె. లక్ష్మీనారాయణ 
హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆచార్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement