
కేవలం పహల్‌గామ్‌లోనే కాదు, కేవలం పాకిస్తాన్‌లోనే కాదు, దేశమంతా ఉన్నారు. అవకాశవాద, అవినీతిలో నిండిన ప్రజా, సివిల్ అధికారుల వల్లనే టెర్రరిస్టులు బతుకుతున్నారు, టెర్రరిజం బతుకుతున్నది. టెర్రరిస్టు డబ్బుతో ఆ దేశం, ఈ దేశం అనికాదు, ప్రతి బిజినెస్‌లో పెద్దలు, నేతలు బతుకుతున్నారు. సిగ్గు సిగ్గు! రాబోయే పదేళ్లదాకా, లేదా వందేళ్లదాకా తీవ్రవాదం ఉంటుంది, ఉంచుతారు. వ్యాపారం కోసం, రాజకీయం కోసం! అధికారం కోసం, ఎన్నికల కోసం!
అంతర్జాతీయంగా అన్నీ అమ్ముకోవడాలే గాని, జాతీయతా భావనే లేదు. నాయకులకే కాదు, సగం మంది ప్రజలకు కూడా సిగ్గు పడవలసిన ‘దుర్మార్గం’ ఎక్కువగా ఉంది. గుడికి దర్శనానికి వెళుతున్నాం. ప్రసాదాలను, నిజాలను నమ్ముకోకుండా, ఖనిజాలు అమ్ముకుంటున్నాం. ఆ ఖనిజం కోసం అడవులు నరికేస్తున్నాం. ‘సత్యమేవ జయతే’ అని మన జాతీయ నినాదం. 150 కోట్ల జనాల్లో ఎంతమంది నిజం చెబుతున్నారు? ‘రామ్ నామ్ సత్య్ హై’ అనేది మనదేశంలో చిత్తశుద్ధితో వినేవారున్నారా? రామ్ పేరుతో రాజకీయాలు, మతం పేరుతో అధికారాలతో ఆడు కుంటూ, పై పెదవుల కొస నుంచే ‘జై శ్రీరామ్’ అంటున్నాం. రామరాజ్యం రావడం లేదు. భక్తి లేదు, భయం లేదు. గర్భగుడులలో ఒక్కొక్క స్తంభానికి బంగారపు తాపడాలకు డబ్బిస్తాం కానీ పేదవాడికి తిండిచ్చేవాడు లేదు.
చదవండి: ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దామనీ!
అమెరికాలో అద్భుత ఆకాశాలను తాకే రెండు భవనాలను విమానాల్లో కూల్చిన దుర్మార్గం ద్వారా వందలాది జీవనాలు ధ్వంసమయ్యాయి(2001 సెప్టెంబర్ 11). నిన్న పహల్‌గామ్‌లో 26 మంది ప్రాణాలు తీసిన నేరం చిన్నదేం కాదు. వెంటాడి వేటాడి ఒక్కొక్కణ్ణి పట్టుకు శిక్ష వేస్తాం అంటున్న ప్రభుత్వానికి వందలాది వందనాలు.
అమెరికా చేసిందేమిటి? మాటలు కాదు. తూటాలు కాదు. రాజకీయం కాదు. ఎక్కడున్నా సరే వేటాడి పట్టుకుని అమెరికాను కాపాడుకోవడానికి చూపిన కమిట్‌మెంట్ మనకు ఆదర్శం కావాలి. కమిట్‌మెంట్ అంటే కట్టుబాటు, దీక్ష. అకుంఠిత దీక్ష కావాలి. అది ఉందా? ఒక్కో మరణానికి కన్నీటి బిందువునైనా ఇచ్చుకున్నామా? క్రికెట్ మైదానంలో ఓ రెండు క్షణాలు నిలబడితే చాలా? కోట్ల కోట్ల వ్యాపారం కోసం, ప్రచారం కోసం మౌనమే సరిపోతుందా? ఒక్కో ప్రాణానికి, ఒక్కో సైనికుడి జీవనానికి డబ్బు ఇచ్చే దమ్ముందా?
రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలితం చేశారు. అంటే జరిగినదానికి రాష్ట్ర బాధ్యత లేదు, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. టూరిస్టులయిన మామూలు మనుషుల్ని టెర్రరిస్టులకు బలిచేసిన ప్రభుత్వానికి బాధ్యత లేదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు, మరికొన్ని భూభాగాలతో అఖండ భారత్ అనే నినాదాలు చేసే పెద్దలు... పక్కనున్న టెర్రరిస్టులు, మన నేల మీద మన వారిని చంపేస్తుంటే ఏం చేస్తున్నట్టు? పదేళ్ల ముందు దద్దమ్మలని పాత పాలకులను తిట్టి పోశాం. యూపీఏ చెత్త పరిపాలన వల్ల తీవ్రవాదులు జనాన్ని చంపేస్తున్నారన్నారు. మరి ఇప్పుడు 2025 దాకా ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకుడు అవసరం. ప్రతి సైనికుడిని ఒక శక్తిగా మార్చి, తుపాకీలు ఎక్కుపెట్టినట్టే మహా ధైర్యంగా, రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించి, నిజం చెప్పి, వ్యూహం నేర్పి భారత దేశాన్ని గెలిపించిన (1971 ఇండో–పాక్ యుద్ధం) ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా వంటి సైన్యాధిపతులు మనకు అవసరం. ఆ విధంగా మన దేశాన్ని గెలిపిద్దాం. తీవ్రవాదులను మట్టి కరిపిద్దాం. చెత్త రాజకీయాలు కాదు, మన కైలాస హిమాలయాలున్న మన కశ్మీర్‌ను గెలిపిద్దాం. మన రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజనీతిని నిలబెడదాం.
ప్రొ. మాడభూషి శ్రీధర్
మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్