
సంవత్సరాల క్రితం, నేను హిందీ నవలా రచయిత కమలేశ్వర్ రాసిన ‘కిత్నే పాకిస్తాన్’ (ఎన్ని పాకిస్తాన్లు) – అనే నవల చదివాను. ఆయన భారతీయ సమాజపు విచ్ఛిన్నకరమైన, వివక్ష, అధికార దాహంతో కూడిన ధోరణులను విజయవంతంగా వ్యక్తపరిచారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా నుండి ప్రజలు వలస వెళ్ళిన నేపథ్యంలో.. ‘ధర్మిక విశ్వాసం’ ఆధారంగా ప్రజలను విభజించే మనస్తత్వాన్ని మనం ఎప్పుడు వదిలించుకోగలం అని మరోసారి అడగవలసిన అగత్యం ఏర్పడింది. మెజారిటీ వర్గంవారి మనుగడకు ప్రత్యేక హక్కులు ఉండే మెజారిటీవాదాన్ని... మెజారిటీ పాలన స్థానంలో ఉంచాలనుకుంటున్నారా?
మనం ముర్షిదాబాద్‌తో ప్రారంభిద్దాం. భారత ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత చెలరేగిన అల్లర్లు, అక్కడి మైనారిటీ హిందువుల జీవితాలను దుర్భరంగా మార్చాయి. పరిస్థితి దారుణంగా ఉంది. బాధితుల కుటుంబం ఎదుర్కొన్న విచారణలను బట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. ఆ జిల్లాలోని జాఫరాబాద్ నగరానికి చెందిన టీ స్టాల్ యజమాని హృదయ్ దాస్, అతని కోడలు సుచరిత సర్కార్ జార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండే రాజ్‌మహల్‌లో ఒక జాతీయ పత్రిక విలేకరికి తమ కథను వివరిస్తు న్నప్పుడు కూడా వారు భయంతో వణుకుతున్నారు. కన్నీళ్లు నిండిన వారి కళ్లలో... జరిగిన బీభత్సం ఛాయలు స్పష్టంగా కనిపించాయి.
ఏప్రిల్ 12 ఉదయం ఇదంతా ప్రారంభమైందని వారు చెప్పారు. ప్రతి రోజులాగే, 170 దళిత కుటుంబాలు పనికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా డజన్ల కొద్దీ సాయుధ వ్యక్తులు వారిపై దాడి చేశారు. వారు తాళం వేసిన ఇళ్లపై రాళ్ళు రువ్వారు. దాస్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. కానీ అతను తన నివాసంలోనే ఇరుక్కుపోయాడు. తన ఇంటికప్పుపై రాళ్ళ వర్షం కురుస్తూనే ఉందనీ, వీధుల్లో ఉన్న ప్రజలను కొట్టారనీ దాస్ అన్నారు. అతని సోదరుడు హర్‌గోబింద్, మేనల్లుడు చందన్ దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ గుంపు వారిని పట్టుకుంది. రాడ్లు, కర్రలు. కత్తులతో వారిపై దాడి చేసింది. ‘తిరిగి వచ్చే వారిని తుడిచి పెట్టేస్తామనే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఆ గుంపు హెచ్చరించింది. ‘మిమ్మల్ని రక్షించే ధైర్యం పాలనా యంత్రాంగంలో ఎవరికి ఉందో చూద్దాం’ అనేది దాడి చేసినవారి మరో సవాల్.
సుచరిత భయంతో వణుకుతూ, తాను ముర్షిదాబాద్‌కు ఎప్పటికీ తిరిగి రానని చెప్పింది. ముర్షిదాబాద్, 24 పరగణాలు, పరిసర జిల్లాల్లో చాలా మంది ఇలాంటి కథనాలను వివరించారు. బాధితులంతా తమను రక్షించడానికి పాలనా యంత్రాంగం ఎందుకు ముందుకు రాలేదన్న ఒకే ఒక సాధారణ ప్రశ్న అడుగు తున్నారు. ఇది చట్టబద్ధమైన ప్రశ్న. కానీ వారికి భద్రత కల్పించే బాధ్యత అప్పగించబడిన వారు రాజకీయాలలో బిజీగా ఉన్నారు.
వాస్తవానికి, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో మతతత్త్వ మహమ్మారి చాలా సంవత్సరాలుగా విజృంభిస్తోంది. ఇప్పుడు, ఈ విభేదాలు బయటపడ్డాయంతే! రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఒకప్పుడు మమతా బెనర్జీకి కీలక అనుయాయి అయిన సువేందు అధికారి, బెంగాల్‌లో ప్రబలంగా ఉన్న చట్టవిరుద్ధతను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని పేర్కొంటూ, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపున ముర్షిదాబాద్ హింసాకాండ కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కై కేంద్ర సంస్థలు చేసిన పని అని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ చిరకాల హింసాకాండలో నేరస్థులు, బాధితుల ముఖాలు మాత్రమే మారాయి. నాయకుల ప్రకటనలు మాత్రం అలాగే ఉన్నాయి.
అందరూ బాధితులే!
గత 50 సంవత్సరాలలో దేశంలో జరిగిన అన్ని ప్రధాన హింసాత్మక ఘటనలను సమీక్షిస్తే ఇది నిజమే సుమా అనిపిస్తుంది. 1970–80ల మధ్య, అస్సాంలో హిందీ మాట్లాడే ప్రజలపై జరిగిన దౌర్జన్యాలతో ఈ విద్వేషం ప్రారంభమైందనాలి. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ రాష్ట్రం నుండి పారిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా చాలా మంది హిందువులు పంజాబ్‌ను విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఇందిరా గాంధీ మరణం తరువాత జరిగిన అల్లర్లు సిక్కు సమాజాన్ని ధ్వంసం చేసి పడేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని మాలియానా, బిహార్‌లోని భాగల్పూర్ ప్రత్యేకించి ముస్లింలకు చాలా కఠిన పరిస్థితులను తెచ్చిపెట్టాయి. అల్లర్ల తర్వాత భాగల్పూర్ నగరాన్ని విడిచిపెట్టిన పట్టు నేత కార్మికులు తిరిగి రాలేదు. 1990లలో కశ్మీరు పండిట్లు కశ్మీర్ లోయను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ దురదృష్టకర జాబితా సుదీర్ఘమెనది.
21వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. అయితే, గత సంవత్సరం మణిపుర్‌లో చెలరేగిన హింస మళ్ళీ పాత గాయాలను రేపింది. ఇక్కడ, నిర్వాసితులైన వారిలో ఎక్కువ మంది క్రైస్తవ సమాజానికి చెందినవారు. ఈ హింసాత్మకమైన సంక్లిష్ట సంఘటనలు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులను ఒకేలా ప్రభావితం చేశాయి. కొన్ని సంఘటనలలో వారు నేరస్థులు, మరికొన్నింటిలో బాధితులు. మతం కంటే మెజారిటీవాదం కారణంగా వలసలు ఎక్కువగా జరిగాయి. అల్లర్లను ప్రేరేపించడానికి మత విశ్వాసం ఒక అనుకూలమైన సాధనం. సోషల్ మీడియా విస్తరణ ఇప్పటికే దిగజారుతున్న పరిస్థితిని క్లిష్టతరం చేస్తోంది. ఇది వేర్పాటువాదులు, పుకార్లు వ్యాప్తి చేసేవారు, దుష్ట శక్తులకు శక్తినిచ్చేదిగా సోషల్ మీడియా పనిచేసింది. మన రాజకీయ నాయకులు కూడా విభజనవాద పరిస్థితులను ఉపయోగించు కోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. మతంతో పాటు, ప్రాంతీయ, భాషా వ్యత్యాసాలను ప్రజల మధ్య విభజనను రేకెత్తించడానికి ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనే మరెన్ని దేశాలను సృష్టించాలనీ!
-శశి శేఖర్
‘ది హిందుస్థాన్ టైమ్స్’ సంపాదకుడు