ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?

Kommineni Srinivasa Rao Article on Yellow Media Campaign - Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌లో ఒక వర్గం మీడియా జగన్‌ ప్రభుత్వం మీద చూపుతున్న అక్కసుకు అంతేలేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ తప్పుపట్టి, ఎక్కడ వీలైతే అక్కడ అబద్ధాలో, సబద్ధాలో రాసి ప్రజలలో వ్యతిరేకత పెంచాలని విపరీతంగా శ్రమిస్తున్నారు. పోనీ అలాంటి నిర్ణయాలే తీసుకున్నప్పుడు, అదే వైఖరిని తెలంగాణలో కూడా అనుసరించారా అంటే అదేమీ లేదు. ఏపీలో తాము మద్దతిచ్చే తెలుగుదేశం పార్టీని ఎలాగైనా జాకీలు పెట్టి లేపాలన్న ప్రయత్నంలో భాగంగా జగన్‌ మీద ఎప్పుడు వీలైతే అప్పుడు విషం కక్కుతున్నారు. చెప్పాలంటే– ప్రతిపక్షాల కన్నా, ఈ వర్గపు మీడియా విష ప్రచారాన్ని తట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందంటే ఆశ్చర్యం కాదు. అయినా జగన్‌ మొండి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. 

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల ఏడున, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ను ఈ నెల పదకొండున ప్రవేశపెట్టారు. వీటికి సంబంధించి మీడియా కవరేజీలో ఎంత వ్యత్యాసం ఉందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘ఈనాడు’ ఎంత పక్షపాతంగా కథనాలు ఇచ్చిందో చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. తెలంగాణ బడ్జెట్‌ను  ప్రవేశపెట్టడానికి ముందురోజు ఒక కర్టెన్‌ రైజర్‌ ఇస్తూ, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తారని రాశారు. ఆ మరుసటి రోజు సకల జన సంక్షేమం అని బ్యానర్‌ స్టోరీ ఇచ్చారు. తప్పు లేదు. కానీ అదే ఏపీకి వచ్చేసరికి అప్పుల కుప్ప అని బ్యానర్‌ ఇచ్చారు. తెలంగాణలో ఆయా మీడియా సంస్థలకు వ్యాపార ప్రయోజనాలు అధికంగా ఉండి ఉండవచ్చు. తెలంగాణలో కూడా అప్పులు గానీ, ద్రవ్యలోటు గానీ తక్కువేమీ లేవు. ఇక్కడి ప్రతిపక్షాలు ఆ విషయాన్ని ఎత్తిచూపాయి. కాకపోతే ఈ వర్గం మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీకి వచ్చేసరికి ఆ వర్గం మీడియా ప్రతిపక్ష టీడీపీకి మద్దతిస్తోంది. అప్పుల గురించి కూడా వార్త ఇవ్వడం తప్పు కాదు. కానీ రెండు రాష్ట్రాల వార్తల కవరేజీలో ఇంతటి తేడా ఉండటం పాఠకుడిని మోసం చేయడం కాదా? తెలుగుదేశం పార్టీకి బాగా అతుక్కుపోయిన మరో పత్రిక తన అక్షర ఆయుధాన్ని ఆ పార్టీకి తాకట్టు పెట్టడం ఒక ఎత్తయితే, ఏపీ ముఖ్య మంత్రి జగన్‌పై విద్వేషాగ్ని వెళ్లగక్కడం మరో ఎత్తుగా ఉంటుంది. పైకి మాత్రం ఏదో స్వతంత్ర పత్రికల మాదిరి కనిపించడం, లోపల మాత్రం తమ కుళ్లుబుద్ధిని ప్రదర్శించడం! 

ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ మీడియా పెద్ద పెద్దవాళ్లతో తెలుగు భాష, బోధనపై మాట్లాడించారు. వారు ఎక్కడైనా సంబం« ధిత వ్యాఖ్యలు చేస్తే వాటిని ప్రముఖంగా అచ్చేశారు.  ఈ మీడియా అధిపతుల పిల్లలు ఎవరూ తెలుగు మీడియంలో చదవరు. కానీ పేదవాడికి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వార్తలు రాశారు. ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టే క్రమంలో ఎదు రయ్యే ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలు రాసి ఉంటే తప్పు కాదు. పోనీ అదే విధానాన్ని తెలంగాణలో అనుసరించారా అంటే అదేమీ లేదు. కిక్కురుమనలేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో స్కూళ్లన్నిటిలో ఆంగ్ల మీడియం బోధించాలని ప్రభుత్వం తల పెట్టింది. ఈ వార్తను రొటీన్‌గా ఇచ్చి ఊరుకున్నారు.

ఏపీలో ప్రభుత్వ స్కూళ్లను ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద పూర్తిగా ప్రక్షాళన చేసి, కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారు చేస్తు న్నారు. ఎక్కడా ఈ స్కీమ్‌ మంచిదని విశ్లేషణ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ కార్యక్రమం అమలు చేయడానికి బడ్జెట్‌ పెట్టారు. అదే చంద్రబాబు టైమ్‌లో కనుక ఇది జరిగివుంటే... ఆయన గొప్ప విజనరీ అనీ, ఆయనను అంతా అనుసరిస్తున్నారనీ ప్రచారం చేసేవి. తెలంగాణలో ప్రభుత్వ భూములు విక్రయిస్తుంటే, దానిని గొప్ప విషయంగా, భారీ ఎత్తున ఆదాయం వస్తున్నదని ప్రొజెక్టు చేశాయి. ఏపీలో భూములు అమ్మబోయినా, తనఖాకు పెట్టినా, అమ్మకానికి ఏపీ అనో, మరొకటనో గగ్గోలు పెట్టాయి. 

అమరావతి రాజధానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ‘ఈనాడు’ సంపాదకీయం చదివితే ఆ పత్రికకు జగన్‌పై ఎంత విద్వేషం ఉన్నదో అర్థం అవుతుంది. తీర్పు మంచి చెడులు కాకుండా, టీడీపీ భాషలోనే విరుచుకుపడింది. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై అధికారులు దాడులు చేసి కూల్చివేస్తున్నారు. రాష్ట్రంలో ఈ మధ్య మూడు రోజుల్లో 927 అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసినట్లు మున్సిపల్‌ శాఖ తెలిపింది. 700 మందితో టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించి కూల్చివేసిన వాటిలో అత్యధికం హైదరాబాద్‌ మెట్రో అభివృద్ధి సంస్థ పరిధిలోనివే కావడం విశేషం. చంద్రబాబు టైమ్‌లో నదీ గర్భంలో అనుమతులు లేకుండా నిర్మించిన ప్రజావేదికను ఈ ప్రభుత్వం కూల్చివేస్తే వారికి మద్దతిచ్చే మీడియా విధ్వంసం అని ప్రచారం చేసింది. ఆ పాటకు దగ్గుబాటి పురందేశ్వరి వంటి బీజేపీ నేతలు కూడా వంత పాడారు. విశాఖపట్నంలో అక్రమ కట్టడాలను కూల్చితే కక్ష అని ప్రచారం చేశారు. విశాఖలో టీడీపీ నేతలు, ఇతరులు ఆక్రమించిన వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. వారికి మద్దతిచ్చే మీడియా కూడా అలాగే ప్రచారం చేసింది. పైగా ఈ అక్రమ నిర్మాణాల అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో కొందరు కోర్టును ఆశ్రయించి స్టేలు పొంద గలుగుతున్నారు. అదే హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు నాలా లను ఆక్రమించి చేసిన నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని తెలం గాణ హైకోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏపీలో మాత్రం కృష్ణా తీరంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు కోర్టు రక్షణ లభించింది.హైదరాబాద్‌ సమీపంలోనే దుండిగల్‌ వద్ద చెరువు ఆక్రమించి నిర్మిస్తున్న వంద విల్లాలను అధికారులు సీజ్‌ చేశారు. మరో వంద విల్లాలను ఇప్పటికే సీజ్‌ చేశారు. ఒక్కో విల్లా ఖరీదు కోటి నుంచి కోటిన్నర ఉంటుంది. ఈ లెక్కన మొత్తం స్వాధీనం చేసుకున్న విల్లాల ఖరీదు రూ. 200 కోట్ల పైమాటే. అయినా మీడియా దీనిని ప్రభుత్వ వ్యతిరేక చర్యగా కవర్‌ చేయలేదు. 

తెలంగాణలో అమూల్‌ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి అమూల్‌ ప్లాంట్‌ను 500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిని దాదాపు అన్ని పత్రికలు మొదటి పేజీలో పాజిటివ్‌గా ఇచ్చాయి. మరి ఏపీలో అమూల్‌ పాల సేకరణ ద్వారా రైతులకు మంచి ధర లభించేలా చూస్తుంటే టీడీపీ విమర్శిస్తోంది. ఏపీలో ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ సన్‌ ఫార్మాస్‌ ఒక పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ స్వయంగా సీఎం జగన్‌ పాజిటివ్‌ ధోరణితో ఉన్నారనీ, ఆయన విజన్‌ను గమనించే తాము ఏపీలో యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నామనీ ప్రకటించారు. అలాగే కొప్పర్తి పారిశ్రామికవాడలో, బద్వేల్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో పరిశ్రమలకు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో జగన్‌ను పారిశ్రామికవేత్తలు మెచ్చుకున్నారు. తమిళనాడులో ఏర్పాటు చేయాలని అనుకున్న తమ సెంచురీ ప్లైవుడ్‌ ప్లాంటును జగన్‌ చొరవ వల్ల ఏపీలో నెలకొల్పుతున్నామని చెప్పారు. ఈ విధంగా కనుక చంద్రబాబు టైమ్‌లో జరిగి ఉంటే బ్యానర్‌ కథనాలుగా ఇచ్చేవారు. చంద్రబాబు చేసినా అభినందించవచ్చు. కానీ ముఖ్యమంత్రి మారితే మీడియా ధోరణి మారిపోవడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇవే పత్రికలు ఏదైనా సంస్థ తమ సొంత కారణాలతో ఏపీలో మూసివేస్తే ఇంకేముంది, అన్నీ వెళ్లిపోతున్నాయని ప్రచారం చేస్తున్నాయి. విశాఖలో హెచ్‌ఎస్‌బీసీ శాఖను మూసివేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు శాఖలను మూసివేసింది. అయినా విశాఖ బ్రాంచ్‌ గురించి ప్రస్తావిస్తూ ఒక యువ నాయకుడు ట్వీట్‌ చేశారు. అలాగే పురందేశ్వరి కూడా పరిశ్రమలవారు వెళ్లిపోవాలని అనుకుంటున్నా రని విమర్శించడం ఆశ్చర్యం. అలాంటప్పుడు కొందరు పారి శ్రామికవేత్తలు తాము జగన్‌కు ఉన్న అవగాహన, చొరవ చూసే ఏపీకి వస్తున్నామని ఎలా చెప్పారు? ఇలాంటి అనుచిత విమర్శల వల్లే బీజేపీ నేతలు కొందరు టీడీపీ లైన్‌లో మాట్లాడుతున్నారన్న విమ ర్శలకు గురి అవుతున్నారు. తెలంగాణలో ప్రధానంగా వరి ధాన్యం సేకరణ, ఉపాధ్యాయుల జోనల్‌ సమస్య, ఇతర పెద్ద విషయాలపై ప్రతిపక్షాలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంటాయి. ఏపీలో మాత్రం ఏ ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడినా, దానిని ప్రభుత్వానికి పులిమి ఏపీ అంతా ఏదో అయిపోయిందని ప్రచారం చేస్తుంటారు. ఈ పరిణా మాలు ఎంతకాలం సాగుతాయో గానీ, ప్రతిపక్షాల కన్నా, ఒక వర్గం మీడియా ఆగడాలను తట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉందంటే ఆశ్చర్యం కాదు. 
 

కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top