ఖేత్ బచావో అభియాన్
నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యవసాయ భూమిని కాపాడటం, రైతుల మధ్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ప్రచారాన్ని ‘ఖేత్ బచావో అభియాన్’గా పిలుస్తున్నారు. ‘నేలను కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి, రైతులను కాపాడండి’ అనే ప్రధాన సందేశంతో 2026 జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఈ ప్రచారం సాగుతోంది.
ఎరువులను నిరంతరం వాడటం, అది కూడా అసమతుల్యంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రాంతాలలో పోషకాల కొరత ఏర్పడి, నేల నాణ్యత క్షీణిస్తోంది. మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోతు న్నాయి. వానపాములకు నష్టం వాటిల్లుతోంది. నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని సాగు చేయాల్సి ఉంది. అందుకు కేంద్రం భారీ ఎత్తున ఈ విషయా లపై అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగింది. ఖేత్ బచావో అభియాన్ ప్రధానాంశాలు:
1. మట్టి పరీక్ష – మట్టి ఆరోగ్య కార్డులకు ప్రోత్సాహం: రైతులను క్రమం తప్పకుండా మట్టి పరీక్షలు చేయించుకోవడానికీ, పోషక అవసరాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికీ మట్టి ఆరోగ్య కార్డులను ఉపయోగించేలా ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. ఇది సమతుల్య ఎరువుల వాడకాన్ని సాధ్యం చేస్తుంది. అనవసర ఖర్చు లను తగ్గిస్తుంది. పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలి కంగా నేల సారాన్ని కాపాడుతుంది.
2. సమతుల్య పోషక నిర్వహణ: అధిక రసాయన ఎరువులపై ఆధారపడకుండా, వాస్తవ నేల అవస రాలకు అనుగుణంగా ఎరువులను ఉపయోగించేలా రైతులను ప్రోత్స హిస్తున్నారు. సమతుల్య పోషక నిర్వహణ నేల నాణ్యతను మెరుగు పరుస్తుంది. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తిని నిర్ధారిస్తుంది.
3. సహజ – సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం: ఈ ప్రచారం కృత్రిమ రసాయ నాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ సుస్థిరతను మెరుగు పరిచే సహజ వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.
4. నీటి సంరక్షణ: నీటి కొరత – భూగర్భ జలాల క్షీణతపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు.
5. శాస్త్రీయ వ్యవ సాయ పద్ధతులు: ఆధునిక విత్తే పద్ధతులు, విత్తన శుద్ధి, పంట ప్రణాళిక, సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతులను పాటించ డానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.
6. పచ్చిరొట్ట ఎరువు–నేల సారం: నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరచ డానికీ, నేల సారాన్ని సహజంగా పెంచడానికీ పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
7. పంట మార్పిడి ఆవశ్యకత: వరి వంటి కొన్ని పంటలకే పరిమితం కాకుండా వ్యవసాయాన్ని ఏక రూప పంట విధానం నుంచి బహుళ పంటల సాగు వైపునకు మళ్లించి... సిఫారసు చేసిన పంటల సరళిని, అంతర పంటలను, సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించడం మరో అంశం. దీని వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండటమే కాకుండా సుస్థిర అభివృద్ధి జరుగుతుంది.
8. సమగ్ర సస్య రక్షణ: రైతులు తాము పండించే పలు పంట లలో ఆశించే పురుగులు, తెగుళ్ళు, కలుపు వంటి వాటి నుండి పంటను కాపాడుకోవడానికి ఎక్కువగా పెస్టిసైడ్స్ (పురుగు మందులు) వాడుతున్నారు. చాలా ఏళ్ళుగా పంటలలో పురుగు మందు లను విచ్చలవిడిగా, అధిక మోతాదుల్లో, అనేకసార్లు వాడటం వలన అనేక దుష్ప్రభావాలు చూస్తున్నాము. అందుకే పంటలో ఉన్న అసలు సమస్యను వీలైనంత తొందరగా గుర్తించి ఆ సమస్యకు తగ్గట్టుగా రసాయనాలు వాడాలి. ఉదా: పురుగుకు పురుగు మందు, తెగుళ్ళకు తెగులు మందులు, నల్లికి నల్లి మందులు వాడాలి.
చీడపీడలు, కలుపు కనిపించిన వెంటనే రసాయన మందులను వాడాల్సిన అవసరం లేదు. వీటి ఉధృతి ఒక స్థాయి దాటినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. ఉత్పాదకతను ప్రతి కూలంగా ప్రభావితం చేసి, ఆర్థిక నష్టాలను పెంచే నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల నుండి రైతులను రక్షించాలి. – డా. కె. తేజేశ్వరరావు, డా. బి. సహదేవ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్ .జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం


