దాయాది శత్రుత్వం | The Indian war was a war of cousins | Sakshi
Sakshi News home page

దాయాది శత్రుత్వం

Published Sat, Jun 15 2024 4:34 AM | Last Updated on Sat, Jun 15 2024 4:34 AM

The Indian war was a war of cousins

భారత యుద్ధం దాయాదుల పోరే. అయితే ఒకరిని ధర్ములని, మరొకరిని అధర్ములని అంటాం. సామ్రాజ్యవాద యుద్ధోన్మాదులెవరు? ప్రజాకంటకులెవరు? స్త్రీలను విధవలను, పిల్లలను అనాథలను చేసిందెరు? ఈ దృష్టితో రాజకీయనాయకులను  విశ్లేషించాలి. బంధుమిత్ర, రాజకీయాధికార దాయాదులుంటారు. కొన్నిసార్లు రెండు దాయాదిత్వాలు కలుస్తాయి.కాంగ్రెస్‌కు పిల్ల కాంగ్రెస్‌లు కొంత నష్టంచేశాయి. 

ఇందిర చతురత, అవసర వామపక్ష సమర్థక చర్యలు కాంగ్రెస్‌ను బలోపేతం చేశాయి. ఆమెకు పాతతరం కాంగ్రెస్‌వాళ్ల వలన జరిగిన నష్టం కంటే, వారికి ఆమెతో నష్టం ఎక్కువ జరిగింది. మోదీ దాయాదిత్వంతో ఆడ్వాణి, మురళి మనోహర్‌ జోషి, జస్వంత్‌ సింగ్, యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి వగైరాల రాజకీయ జీవితాలు మాయమయ్యాయి. బీజేపీ అగ్రనాయక ద్వయం గడ్కరీ ఓటమికి విఫలయత్నం చేసిందట. మహారాష్ట్ర శివసేన, నేషనల్‌ కాంగ్రెస్‌లు దాయాదిత్వంతో చీలాయి.

తెలుగు దేశంలో ఎన్టీఆర్‌ –చంద్రబాబు, చంద్ర బాబు–కేసీఆర్‌ల రాజకీయ దాయాది ద్వేషాలు తెలుగు రాష్ట్రాలకూ, దేశానికీ నష్టం చేశాయి. ఆంధ్ర తాజా పూర్వ ముఖ్యమంత్రికి బంధుమిత్ర దాయాదులతో నష్టం జరిగింది. ప్రతిపక్ష కూటమికి ఊహించని విజయం దక్కింది. వామపక్షాల నుండి పెట్టుబడిదారి పార్టీలకు మారినవారి దాయాదిత్వం వామపక్ష వ్యతిరేక విమర్శలకు తావిచ్చింది. వారికి భావజాల నష్టం కలిగించింది. ప్రతి పార్టీలో కుల మత లింగ వివక్షతలున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు పెట్టుబడిదారీ పార్టీల మగ దాయాదిత్వమే అడ్డంకి.

సంకీర్ణ పక్షాలే నేడు మోదీకి దాయాదులు. మిత్రులుగా విడిపోగానే, పాత పొత్తును మర్చి ఉక్రోషంతో తిట్టుకున్నారు. పలుమార్లు కలిసి విడిపోయి కలిసిన మోదీ, అమిత్, నితీశ్, బాబు తీవ్రంగా తిట్టుకున్నారు. అధికార కాంక్షతో కలిసినపుడు పాత తిట్లు గుర్తుకురావా? సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు నేరుగా చేరాలి. దళారీలకు, కార్పొరేట్లకు లాభం చేయరాదు. అర్హులందరికీ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రయోజనాలు అందాలి.  సమాజాన్ని వర్గ, వర్ణ రహితానికి చేర్చాలి. ఈ ఉన్నత దశకు చేరిన పౌరులు రెండు తరాల వరకు ఆ పాలకులను మరువరు.

ఓట్ల కోసమే ఐనా సంక్షేమ పథకాలను తరతమ భేదాలతో అన్ని పార్టీలు ప్రకటిస్తాయి. బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం కల్పించిన ప్రజాసౌకర్యాలను తృణాముల్‌ కాంగ్రెస్‌ రద్దుచేయలేదు. మరింత మెరుగుపరచింది. స్కాండినేవియన్‌ దేశాల్లో గత వామపక్ష, సోషలిస్టు ప్రభుత్వాల సంక్షేమ రాజ్య పథకాలను నిన్నటి మధ్యేమార్గ పాలకులు కాని, నేటి మతవాద పాలకులు కాని రద్దుచేయలేకున్నారు. సామ్రాజ్యవాద అమెరికా ఉచ్చులో పడి ప్రపంచీకరణ పథకాలను అనుమతించారు. బహుళజాతి సంస్థలకు సాయపడుతున్నారు. కాని, ప్రజాసంక్షేమాన్ని తగ్గించలేదు. 

మన రాజకీయులు పోటీపడి అవసరాలను, అమలు అవకాశాలను పరిశీలించకుండా, ఎన్నికల ఎత్తుగడతో కొత్త పథకాలను, పాత పథకాల లబ్ధిని పెంచుతున్నారు. కాని మరో రూపాల్లో ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. ఆస్తులు, అధికారాలు వెంటరావు. గుణగణాలు చరిత్రలో నిలుస్తాయి. విభేదాలకు, కలహాలకు... కలిసి మాట్లాడుకోడం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతాయి.
- వ్యాసకర్త ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి, నాగపుర్‌ నుండి ‘ 94902 04545
-సంగిరెడ్డి హనుమంత రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement