సంస్కరణలతోనే క్రీడలు వర్ధిల్లుతాయి Fifa Bans India Football Federation What Happened | Sakshi
Sakshi News home page

సంస్కరణలతోనే క్రీడలు వర్ధిల్లుతాయి

Published Thu, Aug 25 2022 1:06 AM

Fifa Bans India Football Federation What Happened - Sakshi

నిబంధనల ఉల్లంఘన కారణంగా ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ మీద ‘ఫీఫా’(ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌) నిషేధం విధించడంతో జాతీయ స్థాయిలో క్రీడల నిర్వహణకు సంబంధించిన చర్చ మొదలైంది. ఇది జీర్ణించుకోలేని విషయమే అయినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. అయితే అక్టోబర్‌లో జరగనున్న ఫుట్‌బాల్‌ జూనియర్‌ ప్రపంచ కప్‌ నిర్వహణను వదులుకోలేని కేంద్ర ప్రభుత్వం దీన్ని స్నేహ పూర్వకంగా పరిష్కరించుకునేందుకు యత్నిస్తోంది. ఈ నిషేధ పరిణామాలు ఎలాగైనా ఉండనీ... మొత్తంగా దేశంలో క్రీడా రాజకీయాలకు సంబంధించి ఇదొక చెంపదెబ్బ కావాలి. దీని పాఠాల నుంచి నేర్చుకుని సంస్కరణలకు నడుం బిగించాలి. అప్పుడే దేశంలో నిజంగా క్రీడలు వర్ధిల్లుతాయి.

ఈ దేశంలో క్రీడాసంస్థల పనితీరుపై ఎవ రైనా న్యాయస్థానంలో ప్రశ్నలు లేవనెత్తారను కోండి... నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) సమాధానం ఒక్కటే. తమకు స్వయం ప్రతిపత్తి ఉందీ అని. అదే సమయంలో న్యాయస్థానాలు తమ పరిధిని మించి వ్యవహరిస్తున్నాయని సణుగు తారు కూడా. లేదా న్యాయపరిధిని తగ్గించేందుకు అంతర్జాతీయ నిషేధాలను ఒక బూచిగా చూపే ప్రయత్నం చేస్తారు. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ (ఫీఫా) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఫీఫా ఇటీవలే ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని చూపుతూ ఇండి యన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ను కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఏ) ఆధీనంలోకి తీసుకొస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే తెచ్చుకునే ప్రయత్నమూ జరిగింది. దీంతోపాటే 2011 నాటి జాతీయ క్రీడా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నానికీ అడ్డు పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటీ 2011 క్రీడా నిబంధనలు? 

అధికారమే తప్ప బాధ్యత లేదా?
ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగానికి అదనంగా సిద్ధం చేసిన ఒక డాక్యుమెంట్‌ ఇది. క్రీడా సంస్థల సమర్థ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఈ నిబంధ నల కంటే ముందు ప్రభుత్వం లేదా యువజన వ్యవహారాలు, క్రీడా శాఖలు 1975, 1988, 1997, 2001లలో ఎన్‌ఎస్‌ఎఫ్‌కు మార్గదర్శ కాలు జారీ చేశాయి. అయితే ఈ మార్గదర్శకాలను ఎన్‌ఎస్‌ఎఫ్‌ పట్టించుకోలేదు. ప్రజలు చెల్లించిన పన్నులను వాడుకుంటూ... భారత జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ పోటీల్లో ప్రదర్శించే ఈ సంస్థల వ్యవహారం... అధికారం, డబ్బు అనుభవిస్తూ బాధ్యత, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించడం అంటే తప్పులేదు. 

నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ రాజకీయ నేతలు, అధికారుల ప్రభా వానికి లోనవడం ఎప్పుడో మొదలైంది. ఈ సంస్థలకు ఎన్నికలు కానీ, క్రీడా కారుల ఎంపికలో పారదర్శకత కానీ అస్సలు కనిపించదు. కుంభకోణాలు, జరిగిన తప్పులు దిద్దుకునే చర్యలు లేకపోవడం వంటివి సర్వసాధారణమనే చెప్పాలి. దేశంలో జాతీయ క్రీడాభివృద్ధి చట్టం అమల్లోకి వచ్చే ముందు క్రీడాసంస్థల సమర్థ నిర్వహణకు ఉద్దేశించిన ప్రయత్నం 2011 నాటి క్రీడా నిబంధనల డాక్యుమెంట్‌. అయితే క్రీడాభివృద్ధి చట్టానికి సంబంధించిన బిల్లు ఇప్పుడు మరుగున పడిపోయింది. అన్ని రకాల రాజకీయ పార్టీలూ దీన్ని వ్యతిరేకించాయి. అయితే 2014లో ఢిల్లీ హైకోర్టు 2011 నాటి క్రీడా నిబంధనల డాక్యు మెంట్‌ సరైందేనని తేల్చి చెప్పింది. భారత క్రీడా సంస్థల నిర్వహణకు సంబంధించి ఇదో చారిత్రాత్మకమైన తీర్పు. క్రీడా సంస్థల్లో ఎన్నికలు, ఓటర్లు, అధికారుల అధికార పరిధి, వయసు వంటి అంశాలపై ఇప్పుడు వాడి, వేడి చర్చ నడుస్తోంది. 

ఫుట్‌బాల్, టీటీ, హాకీ, జూడో... ప్రతి కేసులోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చాలామంది కోర్టులను ఆశ్రయించారు. టేబుల్‌ టెన్నిస్‌ విషయంలో నిబంధనలను అతిక్రమించారని గుర్తించిన ఓ క్రీడాకారుడే కోర్టుకెక్కడం గమనార్హం. కోర్టు కాస్తా ఎన్‌ఎస్‌ఎఫ్‌ అక్రమ మైందని ప్రకటిస్తూ కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. ఎన్‌ఎస్‌ఎఫ్‌ 2011 నాటి క్రీడా నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడటం ఈ సీఓఏ బాధ్యత. ఎన్నికల నిర్వహణ, పురాతన కాలం నాటి క్రీడా సంస్థల రాజ్యాంగాన్ని ఆధునికీకరించడం, మేనేజ్మెంట్‌ విధానాలను సమీక్షించడం వంటి వాటి ద్వారా సీఓఏ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. అయితే ఈ సీఓఏలోనూ మాజీ న్యాయ మూర్తులే ఉండటం, వారి పనితీరు నత్తనడకన సాగుతూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అయితే భారతీయ క్రీడా వ్యవస్థ లన్నింటిలోనూ జరిగే తప్పులు వీరికి తెలుసు. వీటిని ఉల్లంఘిస్తున్న వారిని కూడా గుర్తించగలరు. అందుకే ఎవరైనా క్రీడా వ్యవస్థ సమూల ప్రక్షాళణకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. 

కోర్టుల దాకా ఎందుకు?
విషయం కోర్టులకు ఎక్కక ముందే ఎన్‌ఎస్‌ఎఫ్‌ను దారిన పెట్ట గల సత్తా, అధికారం రెండూ మంత్రిత్వ శాఖకు ఉన్నాయి. ఫెడరేష న్లను రద్దు చేయగలిగే, నిధుల మంజూరీని నిలిపివేసే అధికారం కూడా యువజన, క్రీడల మంత్రిత్వ శాఖకు ఉన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే బాక్సింగ్, ఆర్చరీ వంటివాటిని మినహాయించి మిగిలిన చాలా సంస్థల విషయంలో మంత్రిత్వ శాఖ కూడా న్యాయ స్థానాలు స్పందించేంత వరకూ నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిం చింది. ఎందుకంటే, నేతలకూ క్రీడాసంస్థల్లో స్థానం ఉండటం. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ నిర్వహ ణకు కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ను ఏర్పాటు చేసిన వెంటనే క్రీడల మంత్రిత్వ శాఖ తరఫున స్వయంగా సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఆ కేసును చేపట్టి ఒలింపిక్‌ అసోసియేషన్‌కు అండగా నిలవడం గమనార్హం.

ప్రభుత్వం, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ రెండింటి తరఫున కోర్టుకు హాజరైన తుషార్‌ మెహతా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలనీ, లేదంటే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో భారత్‌ను నిషేధిస్తారనీ వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు యథాతథ స్థితిని కొన సాగించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ సంద ర్భంగానే ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ తాత్కాలిక అధ్యక్షుడు అనిల్‌ ఖన్నా... అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్ల పదవీ కాలం పన్నెండేళ్లు కాకుండా, 20 ఏళ్లు ఉండాలని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. 

సాధారణంగా జాతీయ స్థాయి క్రీడా సంస్థలు... క్రీడలు, క్రీడా కారుల కంటే అధికారుల అహానికి, రాజకీయ పలుకుబడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. భారతీయ క్రీడా వ్యవస్థలో ఉన్న ప్రాథమికమైన లోపం... క్రీడాకారులకు తగినన్ని పోటీలు, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఆడేందుకు తగినన్ని అవకాశాలు లేకపోవడమే. ఈ లోపాలే ఇప్పుడు ఫిర్యాదుల రూపంలో బయటపడుతున్నాయి. తమ స్థానాలను పదిల పరుచుకునేందుకు క్రీడా సంస్థల అధికార యంత్రాంగం తాపత్రయ పడుతూండటమే ఇప్పుడు అన్నిచోట్ల కనిపిస్తున్న అంశం. ఈ క్రమంలో అసలు విషయం కాస్తా మరుగున పడిపోతోంది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు.

సమర్థతకే పట్టం కట్టాలి
నేను నివసించే బెంగళూరులో బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ జన వరిలో ఒక నోటీసు జారీ చేసింది. అసోసియేషన్‌ క్రీడాకారులు చిన్న 3 బై 3, 5 బై 5 పికప్‌ బాస్కెట్‌బాల్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం అసోసియేషన్‌ నిబంధనలకు వ్యతిరేకమని. అలా పాల్గొన్న క్రీడా కారులను నిషేధిస్తామని ఈ నోటీస్‌ చెప్పడం గమనార్హం. 2019లో ప్రో వాలీబాల్‌ లీగ్‌ తొలి సీజన్లో విజయవంతమైంది. ఆ వెంటనే వాలీబాల్‌ అసోసియేషన్‌ ఈ లీగ్‌ నిర్వాహకులు బేస్‌లైన్‌ వెంచర్స్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్ట్‌ నిబం ధనలను ఫెడరేషన్‌ ఉల్లంఘించినట్లు కోర్టు నియమించిన మధ్య వర్తులు గుర్తించారు.

ఫెడరేషన్‌ బ్యాంక్‌ అకౌంట్లను స్తంభింపజేయ డంతోపాటు బేస్‌లైన్‌ వెంచర్స్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బేస్‌లైన్‌ వెంచర్స్‌... ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ పేరుతో మళ్లీ ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంటును ప్రారంభించింది. కానీ ఈ లీగ్‌లో పాల్గొన్న కొన్ని రాష్ట్రాల క్రీడాకారులను ఫెడరేషన్‌ పక్కన పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్రీడా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుతున్న వారిలో కొందరు నిజానికి తాము అసమర్థ పరిపాలకులుగా కొన సాగేందుకు పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. క్రీడా సంస్థల మెరుగైన నిర్వహణ వీరి ఉద్దేశం కానే కాదు. 


వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ద హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)


 

Advertisement
 
Advertisement
 
Advertisement