నేపాల్, భారత్ విదేశాంగ మంత్రులు శిశిర్ ఖనాల్, జై శంకర్
భారతదేశానికి నేపాల్‌తో సరిహద్దు వివాదమా! చైనా, పాకిస్తాన్‌లతో వివాదాల గురించి దశాబ్దాలుగా వింటున్న వారికి ఇటీవల వార్తలకు ఎక్కిన ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. నేపాల్ యువప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలతో సమస్య మరొకసారి ముందుకు వచ్చిందిగానీ, ఇది 1816లో మొదలై 210 సంవత్సరాలుగా కొనసాగు తున్న వివాదమంటే మరింత ఆశ్చర్యం కలగవచ్చు.
‘నేపాల్ భూభాగంలోకి ఇండియా చొరబడ టమే కాదు, ఇండియా భూభాగాలలోకి నేపాల్ కూడా పలుచోట్ల చొచ్చుకు పోయింది. ఈ విషయమై మేము ఇండియా, చైనా, బ్రిటన్‌లతో కూడా మాట్లాడాము. బ్రిటిష్‌వారు ఇండియాను వదిలిపోయినప్పటి నుంచి ఈ సమస్య ఉంది’ అన్నారాయన. ఇండియా చొరబడింద నటంతో ఇక్కడా, నేపాల్ కూడా చొరబడిందనటంతో అక్కడా విమ ర్శలైతే చెలరేగాయి గానీ, బాలేంద్ర మాటలను ఒకసారి ఆవేశాలు లేకుండా పరిశీలిస్తే కనిపించేవి కొన్నున్నాయి.
బ్రిటిష్ వలస పాలకుల పుణ్యం
1816లో స్వతంత్ర భారతదేశమన్నదే లేదు గనుక ఆయన నిందిస్తున్నది బ్రిటిష్ వలస పాలకులనే తప్ప స్వతంత్ర భారత ప్రభుత్వాలను కాదు. మరొకవైపు అపుడు నేపాల్‌లో షా వంశపు రాచరిక పాలన సాగుతున్నది. ఇంతకూ వివాదానికి మూలం ఏమిటి? రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగగా, 1816లో సుగాలీ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మహాకాళీ నది సరిహద్దు అవు తుంది. ఒప్పందం జరిగినా వివాదం ఎందుకు కొనసాగింది? ఒక ఉదాహరణ చూద్దాం. ఒక హౌసింగ్ కాలనీకి కాగితంపై లేఔట్ ఉంటుంది. ఆ కాగితంపై ప్లాట్ల మధ్య గీతలు, అడుగుల లెక్కలు ఉంటాయి గానీ, నేలమీద రాళ్లు పాతరు. లేదా రాళ్లు ఒకోసారి పడి పోతాయి. దానితో వివాదాలు వస్తాయి.
సుగాలీ ఒప్పందం విషయంలోనూ అదే జరిగింది. సర్వేయర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా మహాకాళీ నది సరిహద్దు అని ఆ ప్రకారం కాగితంపై గీతలు గీశారు. సాంకేతిక భాషలో దీనిని డీలిమిటేషన్ అంటారు. ఆ ప్రకారం భూభాగంపై హద్దుల రాళ్లు కూడా పాతితే దానిని డిమార్కేషన్ అంటారు. కానీ బ్రిటిష్ పాల కులు రెండూ సరిగా చేయలేదు. మహాకాళీ నది సరిహద్దు అన్నారు గానీ, ఆ నది ఎక్కడ పుట్టి ఏ విధంగా ప్రవహిస్తున్నదనే వివరాలూ లేవు.
ఆ నది ప్రవాహ వేగాలను బట్టి కొంత అటు ఇటుగా మారు తుంటుంది. ఇది అనేక నదుల విషయంలో జరిగేదే. ఈ పరిస్థితు లన్నింటితో బ్రిటిష్ వారికి వచ్చిన సమస్య ఏమీ లేకున్నా, చిన్న దేశమైన నేపాల్‌కు సమస్యలు ఎదురవుతుండటంతో అక్కడి రాజులు ఆ విషయం లేవనెత్తుతూ పోయారు. కానీ ఉపయోగం లేకపోయింది.
ఆ వివాదం 1947లో భారత దేశం స్వతంత్రమయ్యేవరకు ఉండిపోయి, ఆ తర్వాత కూడా ఉభయపక్షాలు 79 సంవత్సరాలు గడిచినా పరిష్కరించుకోకపోవ టంతో ఈ 2026లోనూ కొనసాగుతున్నది. ఇండియా–చైనా, ఇండియా–పాక్ సరిహద్దు సమస్యలు కూడా బ్రిటిష్ పాలన వార సత్వమే. ఇండియా–చైనా సరిహద్దును కాగితంపై గీసిపోయిన సర్ హెన్రీ మెక్‌మహన్, ఇండియా–పాక్ సరిహద్దును అంతే హడా వుడిగా కాగితంపై గీసిపోయిన సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ సృష్టించిపోయిన సమస్యలు ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి.
బ్రిటిష్, ఫ్రెంచ్ వలస పాలకులు ఆసియా, ఆఫ్రికాలలో వదలి పోయిన సరిహద్దు వివాదాలు 50కి తగ్గవు. మరొక ప్రమాదకర స్థితి ఏమంటే, దీనికంతా కారణమైన అప్పటి వలస పాలకులతో పాటు ఇతర సామ్రాజ్యవాదులు, నేటికీ ఆ వివాదాలను ఉపయోగించు కుంటూ వనరులను కొల్లగొట్టడం, వైరి పక్షాలకు ఆయుధాలను అమ్ముకోవటం, రాజకీయ ప్రాబల్యం సంపాదించటం చేస్తున్నారు.
మాదంటే మాది...
నేపాల్‌లో బాలేన్ షా ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభుత్వం ఏర్పడింది 2025లో కాగా, అంతవరకుండిన రాచరిక పాలనలో, నేపాలీ కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టుల హయాంలోనూ భారత్–నేపాల్ సరిహద్దు వివాదం ఏదో ఒక స్థాయిలో కొనసాగు తూనే వచ్చింది. మహాకాళి ప్రాంతంలో లిఫూలేఖ్, లింపియాధురా, కాలాపానీ, అక్కడికి తూర్పున సుస్తా విషయమై సమస్య ఉంది. కె.పి. శర్మ ఓలీ ప్రభుత్వం ఉండినపుడు రెండు దేశాలు కూడా మహా కాళి ప్రాంత భూములను తమతమ దేశాలలో భాగంగా చూపుతూ మ్యాపులు విడుదల చేశాయి. అదే ప్రకారం ఓలీ ప్రభుత్వం కొత్త కరెన్సీని జారీ చేసింది. అదే మ్యాపును ప్రస్తుత ప్రధాని కాఠ్మండూ మేయర్‌గా ఉన్నపుడు తన కార్యాలయంలో ప్రదర్శించారు.
ఆయన పైన పేర్కొన్న పార్లమెంట్ ప్రకటన చేసినపుడు, సమస్య మొదలైంది బ్రిటిష్ కాలంలో అయినందున వారు అప్పటి రికార్డులతో పాటు చర్చలలో పాల్గొనాలని! ఆ ప్రాంతం మీదుగా భారత్, చైనా మధ్య తమ అనుమతి లేకుండా వాణిజ్యం, మానస సరోవర్ యాత్రలు సాగుతున్నందున చైనా కూడా చర్చలకు రావా లనీ అన్నారు. కానీ, సమస్యను ఇండియా–నేపాల్ పరిష్కరించు కోవాలి తప్ప తమకు సంబంధం లేదని బ్రిటన్, చైనా స్పష్టం చేశాయి. భారత విదేశాంగ శాఖ కూడా అదే ప్రకటన చేసింది. వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగమన్నది ఇప్పటికే ఉన్నందున ఆ ప్రకారం చేస్తామన్నది. కానీ అది ఏళ్లుగా కదలటం లేదు.
చరిత్ర భారం లేకుండా...
బాలేన్ ప్రకటన దుమారం సృష్టించటంతో అక్కడి విదేశాంగ శాఖ వివరణ ఇవ్వబూనింది. సరిహద్దులలోని నిర్మానుష్య ప్రాంతా లలో రెండు దేశాల ప్రజలు అటు ఇటు పోవటం గురించి ప్రధాని అన్నారు తప్ప వేరే ఉద్దేశం లేదన్నది. నిజానికి ఇతరత్రా గమనించి నపుడు, సరిహద్దులు నిర్దిష్టంగా డిమార్కేట్ కాని ఏ దేశాల మధ్య నైనా, ‘ఆక్రమణ’లు అన్నట్లు కాకుండా తాత్కాలిక ‘చొర బాట్లు’
రెండు వైపుల నుంచి జరగటం సాధారణం.
1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చైనా వెళ్లి వచ్చిన తర్వాత, రెండు దేశాల సరిహద్దులను ‘థిక్ స్కెచ్ పెన్’తో గీశారు తప్ప స్పష్టత లేదన్నారు. తర్వాత 2021లో, భారత మాజీ జనరల్ వి.కె. సింగ్, కేంద్ర మంత్రి హోదాలో ఉండి, భారత్‌లోకి చైనా ఎంత చొరబడుతున్నదో మనం చైనాలోకి అంతకన్న ఎక్కువ చొరబడున్నామనటంతో ఇపుడు బాలేన్ తరహా విమర్శలే చెలరేగాయి.
ప్రసుత వివాదం తలెత్తిన తర్వాత, మొదట నేపాల్ అధికార పక్షం అధ్యక్షుడు రబీ లమీఛానే ఈ నెల 1 నుంచి 5 రోజులు, ఆవెంటనే విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ 5వ తేదీ నుంచి 3 రోజులు ఢిల్లీని సందర్శించారు. శిశిర్ భారత విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశ మయ్యారు. ‘తాము గత చరిత్ర భారాన్నేమీ మోయటం లేదనీ,ఇండియాతో సత్సంబంధాలు, అభివృద్ధి సంబంధాలు తమ ప్రాధా న్యత’నీ తమ ప్రధాని మాటగా వారికి చెప్పారు. సరిహద్దు అంశం చర్చకు వచ్చి ఉంటుందిగానీ వివరాలు వెంటనే వెల్లడి కాలేదు. బాధ్యత మాత్రం ఉభయులపైనా ఉంటుంది.

వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


