Sakshi News home page

Zahara Begum: చూపున్న మనసు

Published Thu, Sep 28 2023 12:15 AM

Zahara Begum appointed to cabap new chairperson - Sakshi

మనసుకు చూపు ఉంటే ఎదుటి వారి కష్టం కనపడుతుంది. మనసుకు స్పందన ఉంటే ఎదుటివారి సాయం కోసం మార్గం వేస్తుంది. జహారా బేగంకు అలాంటి మనసు ఉంది. అందుకే ఆమె అంధుల కోసం పని చేస్తూ ఉంది. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందిస్తోంది. వారి మేచ్‌లు నిర్వహిస్తోంది. ఆ సేవకు ‘క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’కు చైర్‌ పర్సన్‌గా నియమితురాలైంది. జహారా పరిచయం.

‘మనలో ఎవరైనా ఎప్పుడైనా అంధులు కావచ్చు. దృష్టి పోతే జీవితం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అందుకే దృష్టి లేని వారి గురించి ఎవరికి తోచినంత వారు పని చేయాలి’ అంటుంది జహారా బేగం. తెనాలికి చెందిన జహారా తన తల్లి తాహెరా పేరున ‘తాహెరా ఫౌండేషన్‌’ స్థాపించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ‘నేను నాలుగో క్లాస్‌లో ఉండగా నా క్లాస్‌మేట్‌ ఒకమ్మాయి మధ్యాహ్నం పూట ప్రసాదం తెచ్చుకుని తినేది. అన్నం ఉండేది కాదు. ఆ అమ్మాయి కోసం నేను మా అమ్మతో చెప్పి బాక్స్‌ తీసుకెళ్లేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎందుకో ఎదుటివారికి సాయం చేయాలనే గుణం నాలో ఉంది. ఆ గుణాన్ని వయసు పెరిగే కొద్దీ కాపాడుకున్నాను’ అంటుంది జహారా.

ఆటలంటే ఇష్టం
‘మాది గుంటూరు. చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. బాస్కెట్‌బాల్‌ జాతీయస్థాయి ప్లేయర్‌గా ఆడాను. గుంటూరు మహిళా బాస్కెట్‌బాల్‌ జట్టు మాతోనే మొదలైంది. అయితే చదువులో కూడా చురుగ్గా ఉండి బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చేశాను. ఆ తర్వాత అగ్రికల్చర్‌ ఎంఎస్సీ చేసి పీహెచ్‌డీ కోసం జర్మనీలో కొంత రీసెర్చి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక నా మాతృమూర్తి పేరుతో తాహెరా ట్రస్ట్‌ ప్రారంభించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవల్లో మమేకమయ్యాను. ఆ సమయంలోనే బెంగళూరులోని ‘సమర్థనం ట్రస్ట్‌ ఫర్‌ బ్లైండ్‌’ చేస్తున్న పని నాకు నచ్చింది. వారితో కలిసి అంధుల కోసం పని చేయసాగాను. బెంగళూరులో విమెన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ వర్క్‌షాపును నిర్వహించాను’ అని తెలిపిందామె.

అంధుల కోసం
‘అంధుల క్రీడలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందించేవారూ తక్కువే. వారికోసం నేనెందుకు ఏదైనా చేయకూడదు అనుకున్నాను. అప్పటినుంచి నా చేయూత నిరవధికంగా సాగింది. అంతేకాదు, ‘క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఇన్‌ ఇండియా’ (సీఏబీఐ)లోనూ, ‘టి20 వరల్డ్‌ కఫ్‌ క్రికెట్‌ ఫర్‌ బ్లైండ్‌–2017’ పోటీల సమయంలోనూ చురుగ్గా పని చేసే అవకాశం కలిగింది. దాంతో ఇప్పుడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీబీబీఏపీ) ఛైర్‌పర్సన్‌గా నియమితురాలినయ్యాను. ఇది నాకు సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె.

అంధుల టి20
‘2017లో దేశంలోని  మెట్రో నగరాల్లో 2వ అంధుల టి20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీలను సీఏబీఐ నిర్వహించింది. పది దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్‌ కమిటీ ఇన్‌చార్జ్‌గా నేను రెండు మ్యాచ్‌లను ఆంధ్ర, తెలంగాణలో నిర్వహించేందుకు చొరవ చూపాను. అలాగే ‘తొలి విమెన్స్‌ నేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫర్‌ బ్లైండ్‌ – 2019’  న్యూఢిల్లీలో జరిగింది.

ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ బ్లైండ్‌ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవటం,  క్రీడాకారిణుల లేమి  గమనించాను. దాంతో ఆంధ్రప్రదేశ్‌ అంధ మహిళల క్రికెట్‌ జట్టు రూపకల్పనకు పూనుకున్నా. అనంతపురంలో రాష్ట్రస్థాయి అంధ మహిళల క్రికెట్‌ శిక్షణ శిబిరం నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్‌ జట్టు ఎంపికకు సహకారం అందించాను.. ఇటీవల యూకేలో జరిగిన ఐబీఎస్‌ఏ టోర్నమెంటులో విజేతగా నిలిచిన ఇండియా జట్టులో మా శిక్షణలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణులు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె.

అంధుల క్రికెట్‌ గురించి....
‘అంధుల క్రికెట్‌ ఢిపరెంట్‌గా ఉంటుంది. బ్యాట్, వికెట్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. బంతి మాత్రం వైవిధ్యంగా తయారు చేస్తారు. ఇందులో ఉండే బేరింగ్స్‌ చేసే శబ్దాన్ని ఆధారంగా బాట్స్‌మెన్‌ ఆడతారు. బౌలింగ్‌ సాధారణ క్రికెట్‌లోలా భుజంపైనుంచి కాకుండా దిగువ నుంచి వేస్తారు. క్రికెట్‌ జట్టులో బీ1, బీ2, బీ3 అనే మూడు కేటగిరీల వారుంటారు. బౌలరు, బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా అంధులై ఉంటారు. మిగిలినవారు పాక్షికంగా అంధులు. వీరు ఆడే మైదానం 50 గజాలు మాత్రమే. నిబంధనలన్నీ మామూలే. సీఏబీఐలో 25 వేల మంది సభ్యులున్నారు’ అని తెలిపిందామె.

తన సేవా కార్యక్రమాలను అమెరికాకు కూడా విస్తరించిన జహారా అక్కడ చిన జీయర్‌ నేత్రాలయం కోసం నిధులు సేకరించడంతో తనవంతు సహకారం అందించారు.

– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి.

Advertisement

What’s your opinion

Advertisement