Women In East Godavari Plays Sannai Melam - Sakshi
Sakshi News home page

సన్నాయి మేళం: ఐదు తరాల నుంచి.. ఒకే కుటుంబం నుంచి రాణిస్తున్న మహిళలు

Published Mon, Aug 14 2023 2:48 PM

Women In East Godavari Plays Sannai Melam - Sakshi

మండపేట: హిందూ సంప్రదాయంలో డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. శుభకార్యాలు, వేడుకలకు సన్నాయి మేళం తప్పనిసరి. నాదస్వరం పేరు చెప్పగానే పురుష కళాకారులే గుర్తుకు వస్తారు. అందుకు భిన్నంగా మగవారికి దీటుగా డోలు, సన్నాయిని వినసొంపుగా వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన మహిళా కళాకారులు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఈ గ్రామంలో ఏకంగా పది మందికి పైగా మహిళా కళాకారులుండగా.. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.

ఏడిదలోని వెంటూరి సాహెబ్‌ కుటుంబం డోలు, సన్నాయి వాయిద్యానికి ప్రసిద్ధి. తమ ఇంట ఈ కళకు 80 ఏళ్ల క్రితం ఆయనే ఆజ్యం పోశారు. సాహెబ్‌ తదనంతరం ఆయన కుమారులు, మనవలు, మునిమనవలు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీతారలు, ప్రముఖుల ఇళ్లలో జరిగే వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చి గ్రామానికి గుర్తింపు తెచ్చారు.

ఎంతోమంది కళాభిమానులు వీరి నైపుణ్యానికి మెచ్చి గండపెండేరాలు, సింహతలాటాలు, బంగారు కడియాలతో సత్కరించారు. గత ఐదు తరాల్లో 25 మందికి పైగా సాహెబ్‌ కుటుంబీకులు నాదస్వర కళను నేర్చుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత తరంలో మేము సైతం అంటూ ఆ ఇంట మహిళలు వాయిద్య కళలో రాణిస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణ

సన్నాయి మేళంలో వాయిద్య పరికరాలు డోలు, సన్నాయి, చిన్న హార్మోనియం (శ్రుతి బాక్స్‌), తాళం ఉంటాయి. ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకూ సభ్యులుంటారు. సాధారణంగా పురుష కళాకారులే ఆయా వాయిద్యాలను వాయిస్తూంటారు. అయితే ఏడిద సన్నాయి మేళంలో మహిళా వాయిద్య కళాకారులు ప్రత్యేక ఆకర్షణ.

గ్రామంలోని సాహెబ్‌ కుటుంబానికి చెందిన మూడు సన్నాయి మేళం బృందాలుండగా.. వీటిలో పది మందికి పైగా మహిళా కళాకారులే ఉండటం గమనార్హం. సాహెబ్‌, తర్వాత ఆయన తనయులు, మనవలు ఎంతో మందికి డోలు, సన్నాయి వాయించడంలో శిక్షణ ఇస్తున్నారు.

వారితో పాటు తమ ఇంట్లోని ఆడపిల్లలకు కూడా నేర్పిస్తూంటారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సన్నాయి మేళంలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. మగవారితో సమానంగా డోలు, సన్నాయి అలవోకగా వాయిస్తూ వివిధ వేడుకలకు మరింత శోభను తీసుకువస్తున్నారు. కుటుంబ పోషణలో చేదోడువాదోడవుతున్నారు.

అంతా ఒకటే కుటుంబం

ఎక్కడ ప్రదర్శన ఉంటే అక్కడకు బృందంలోని తమ కుటుంబ సభ్యులతో కలిసి వీరు వెళ్తూంటారు. గత పదేళ్లలో ఉభయ రాష్ట్రాలతో పాటు రాజాస్తాన్‌లో వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో జరిగిన వివాహాది శుభకార్యాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మండపేట, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వేడుక జరిగినా మహిళలతో డోలు, సన్నాయి మేళం ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీంతో మహిళా వాయిద్య కళాకారుల ప్రాధాన్యం పెరిగింది. చదువుతో పాటు తమ ఇంట ఆడపిల్లలకు వాయిద్య కళలో శిక్షణ ఇస్తూంటామని కళాకారుడు వెంటూరి మీరా సాహెబ్‌ (చిన్న) తెలిపారు.

సరదాగా చేసిన సాధనే ఉపాధి అయ్యింది
నా చిన్నతనంలో ఏడిదలో మా తండ్రి సత్యనారాయణ చాలా మంది పిల్లలకు శిక్షణ ఇచ్చేవారు. వారితో పాటు నేనూ సరదాగా సన్నాయి వాయిద్యం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ విద్యే మాకు మంచి గుర్తింపు తెచ్చింది. కుటుంబ పోషణకు ఆసరా అవుతోంది.

– డి.సీతారత్నం, వాయిద్య కళాకారిణి, మండపేట

ఎంతో గౌరవంగా చూస్తారు
తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జరిగిన బ్రహ్మోత్సవాలు, శుభకార్యాల్లోను, సినిమా హీరోలు, రాజకీయ నాయకులకు సంబంధించిన వివిధ వేడుకల్లోను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. ఆయా చోట్ల నిర్వాహకులు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తుంటారు.

– వెంటూరి రమాదేవి, వాయిద్య కళాకారిణి, ఏడిద

గ్రామానికి గుర్తింపు తెచ్చారు
డోలు, సన్నాయి కళలో వెంటూరి సాహెబ్‌ కుటుంబం రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చారు. ప్రత్యేకంగా పురుషులతో సమానంగా మహిళలు ఈ కళను నేర్చుకుని కుటుంబ పోషణలో భాగస్వాములు కావడం అభినందనీయం.

– బూరిగ ఆశీర్వాదం,సర్పంచ్‌, ఏడిద

 
Advertisement
 
Advertisement