ప్రతిభకు మారు పేరు ఆ ఊరు

Woman Sarpanch prathibha wins state biodiversity award - Sakshi

అభివృద్ధికి చిరునామా

అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్‌ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్‌ ప్రతిభకు మారుపేరయింది.

తెలంగాణ, కుమ్రుం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్‌ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్‌ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్‌ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి.
 
‘‘మహిళా రిజర్వేషన్‌లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను  ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది.

ఇక అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్‌ ద్వారా టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి, ఎస్‌బీఐ– ఆర్‌ఎస్‌ఈటీ సహకారంతో కుట్టు మిషన్‌లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు.  

 వీథి వీథీ తెలుసు!
మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్‌ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్‌లున్నాయి. కిరోసిన్‌ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్‌ ఉంది.

వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్‌ సిలిండర్‌లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్‌ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి.

అందరూ ఇంటిపన్ను కడతారు
మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు.

జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్‌ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు.

ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు.  

► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్‌
► ఉత్తమ మహిళా సర్పంచ్‌ 2021 మార్చి 8
► జాతీయ స్థాయిలో సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ
► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం
► బెస్ట్‌ బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌ అవార్డు 2023

 
మా ఊరికి సర్పంచ్‌గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top