నేటి నుంచి 34 రోజుల పాటు బ్రేక్!
భాద్రపదం శూన్యమాసం కావడమే కారణం
అక్టోబర్ 11 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు
వివాహాది శుభకార్యాలకు సోమవారం నుంచి స్వల్ప విరామం ఏర్పడనుంది. వివాహ ముహూర్తాల సీజన్‌కు ఆదివారంతో తెరపడింది. భాద్రపదం శూన్య మాసం కానుండటంతో ఈ నెల 7 నుంచి అక్టోబర్ 10 వరకు 34 రోజుల పాటు విరామం కలగనుంది. దీంతో పెళ్లిళ్లతో కళకళలాడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కల్యాణ మండపాల్లో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి.
మళ్లీ మూడు నెలల పాటు..
అక్టోబర్ 11 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ నెలాఖరు వరకు శుభ ముహూర్తాలు ఉండటంతో మళ్లీ సందడి నెలకొననుంది.
ప్రత్యేక ప్రాధాన్యం
భాద్రపద మాసానికి పంచాంగ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో వినాయక చవితి, అనంత చతుర్దశి, పితృకార్యాలకు సంబంధించిన మహాలయ పక్షం వంటి పర్వదినాలు రావడంతో దేవతారాధన, వ్రతాలు, పితృకర్మలకు ప్రాధాన్యం ఇస్తారు. సంప్రదాయ ముహూర్త శాస్త్రం ప్రకారం ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు. ఆశ్వయుజమాసం నుంచి ప్రారంభమయ్యే ముహూర్తాల్లో శుభ కార్యాలు జరుపుకోవచ్చు.
– గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల



