ద్వారకా తిరుమలలో భద్రతా వైఫల్యం.. భక్తుల ఆగ్రహం | Security breach at Dwaraka Tirumala in Eluru district | Sakshi
Sakshi News home page

ద్వారకా తిరుమలలో భద్రతా వైఫల్యం.. భక్తుల ఆగ్రహం

Jun 29 2026 10:20 AM | Updated on Jun 29 2026 11:37 AM

Security breach at Dwaraka Tirumala in Eluru district

సాక్షి, ఏలూరు జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆలయం లోపల మొబైల్ ఫోన్లు నిషేధం ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి స్వామివారి మూల విరాట్‌తో పాటు ఆలయ అంతర్గత దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో సెల్‌ఫోన్లు పూర్తిగా నిషేధించినప్పటికీ, భక్తుల తనిఖీల్లో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల బ్యాగులు, వ్యక్తిగత వస్తువుల తనిఖీ సరిగా జరగకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వీడియోలో మూల విరాట్‌తో పాటు ఆలయ అంతర్గత పరిసరాలు కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఆలయ పవిత్రతకు విఘాతం కలిగించే చర్యగా భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదని భక్తులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం ఆలయ అనివేటి మండపంలో కొందరు వ్యక్తులు సినిమా పాటలకు డ్యాన్సులు చేసిన ఘటన కూడా వివాదాస్పదమైంది. అప్పట్లో కూడా భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా సుప్రభాత సేవ జరుగుతున్న సమయంలోనే మూల విరాట్‌ను వీడియో తీసిన ఘటన బయటపడటంతో ఆలయ నిర్వహణపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భక్తుల ఆగ్రహం
ఆలయం ముఖ మండపం వద్ద నుంచి స్వామివారిని వీడియో తీస్తున్న వ్యక్తిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. భక్తులు ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు ఇప్పటికి వరకు స్పందించకపోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement