
వికాసం
రెండు రాష్ట్రాలలో ఎమ్‌సెట్ అడ్మిషన్ల గాలి వీస్తోంది. పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా బీటెక్ వైపు తల్లిదండ్రులు దారి మళ్లిస్తున్నారు. మనం ఏదనుకున్నామో అది కాకుండా వాళ్లు ఏదనుకున్నారో అది చేయనిచ్చే వీలు లేదు అనేక కారణాల రీత్యా తల్లిదండ్రులకు కూడా. కాని గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఏం చేస్తున్నాడో చూడండి. తన కుమారుడు అఖిల్‌ని చెస్ ప్లేయర్‌ని చేయలేదు. చిత్రలేఖనంలో అభిరుచి ఉన్న ఆ అబ్బాయి చేత బొమ్మలేయిస్తున్నాడు. అఖిల్ అద్భుతమైన బొమ్మలు వేస్తున్నాడు
‘నీకు ఏది ఇష్టమో దాని కోసం కృషి చేసే ధైర్యం నీలో ఉండాలి అని చెప్తుంటారు నాన్నగారు’ అంటాడు అఖిల్ ఆనంద్. 15 ఏళ్ల అఖిల్ ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చెస్ విజేతగా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ కుమారుడు. ఇటీవలే ‘మార్ఫొజెనెసిస్’ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ చేశాడు. ఇదే కాదు ఇంతకు ముందు చాలా ముఖ్య నగరాల్లో అఖిల్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు జరిగాయి.
క్రికెటర్ల పిల్లలు క్రికెటర్లు, ఇంజినీర్ల పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవ్వాలని, అవుతారని అనుకోవడం సాధారణం. అలాగే గ్రాండ్ మాస్టర్ కొడుకు చెస్‌లో ప్రవేశిస్తాడని అనుకోవడం కూడా మామూలే. అయితే ఇక్కడ అసాధారణంగా పిల్లవాడి ఆసక్తికే విలువ ఇచ్చాడు విశ్వనాథన్ ఆనంద్.
‘నాకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి బొమ్మలంటే ఆసక్తి అని గ్రహించి పెయింటింగ్‌లోనే కృషి చేయమని ప్రోత్సహించారు నాన్న. అంతేకాదు అందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించారు’ అంటున్నాడు అఖిల్.
చిత్రకారిణి డయానా సతీష్ దగ్గర శిక్షణ పొందిన అఖిల్ అంతటితో ఆగలేదు. భారతీయ చిత్రకళకు సంబంధించిన మెళకువలు గ్రామీణ కళాకారుల దగ్గర ఉంటాయని బెంగాల్‌కు చెందిన గ్రామీణ చిత్రకారుల కేంద్రం ‘హస్త’లో శిక్షణ తీసుకున్నాడు. అందుకే అఖిల్ బొమ్మల్లో గాఢమైన రంగులు, స్థానికత ఛాయ కనిపిస్తాయి.
‘నాకు గణితం ఇష్టం. నా బొమ్మల్లో గణితం అంశ ఉంటుంది. అలాగే మైథాలజీ... మత చిహ్నాలు కనిపిస్తాయి. మీరు గ్రామీణుల చిత్రకళ గమనించండి... సిందూర రంగు, అపరంజి రంగు ఎన్ని వన్నెలు ΄ోతాయో. జనం గొప్పతనం అది. అందుకే నాకు మన రాజ్యాంగ ప్రవేశిక ఇష్టం.‘వుయ్ ద పీపుల్’ అంటుంది అది. ప్రజల పట్ల మన రాజ్యాంగం వివక్ష చూపదు. అందరూ సమానమే. నా చిత్రకళ కూడా అలాంటి స్ఫూర్తితోనే ఉంటుంది’ అంటాడు అఖిల్.
తండ్రిని విపరీతంగా అంటి పెట్టుకుని తిరిగే అఖిల్ తండ్రిని అనేక ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు తెలుసుకుంటూ ఉంటాడు.
‘నాన్న నాతో సినిమాలకు వస్తారు. నాతో స్టార్‌వార్స్ సిరీస్ చూస్తారు. నేనెప్పుడైనా బొమ్మను పాడు చేసి అప్‌సెట్ అయితే నన్ను వాకింగ్‌కు తీసుకెళ్లి తాను చెస్ ఆడేటప్పుడు ఎలాంటి తప్పులు చేశారో వాటి నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పి ఉత్సాహం నింపుతారు. నాన్నకు, నాకు సంగీతం ఇష్టం. ఇద్దరం చాలా కచ్చేరీలకు కూడా వెళుతుంటాం. అయితే ఆయనకంటే నాకు ఎక్కువ పాప్ సాంగ్స్ తెలుసు. నాకు ఏది ఇష్టమో అది చేస్తే ఆయనకు ఇష్టం’ అన్నాడు అఖిల్.
తన ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయంలో అఖిల్ సందర్శకులతో ఇంటరాక్ట్ అవుతాడు. ‘వాళ్లు నాతో మాట్లాడి చాలా సందేహాలు అడుగుతారు. నేను సమాధానాలు చె΄్తాను. వాటితో వాళ్లు సంతృప్తి చెంది నా బొమ్మను కొంటే చాలా సంతోషిస్తాను’ అంటున్నాడు అఖిల్. అఖిల్ వేస్తున్న అడుగులలో తల్లి అరుణ ఎప్పుడూ తోడుగా ఉంటోంది.
విశ్వనాథన్ ఆనంద్, అరుణలకు అఖిల్ ఒక్కడే సంతానం. బొమ్మలు వేయడం కాకుండా ప్రయాణాలను ఎక్కువ ఇష్టపడే అఖిల్ ప్రపంచాన్ని చుట్టేస్తూ దేశాలు తిరుగుతూ దేశమంటే మట్టి కాదు మనుషులని తెలుసుకుంటూ ఉంటాడు.