ఆత్మీయం
అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. ధర్మమూర్తి అయిన రాముడు రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు. అందువల్ల రావణుని సంహరించిన తర్వాత రామునికి అతనిపై అపారమైన జాలి, దయ కలిగాయి. ఎందుకంటే ఇప్పుడు రావణునికి చితిపేర్చి, ఆ చితికి నిప్పంటించడానికి కూడా ఎవరూ మిగలలేదు.
రావణుని కుమారులు, సోదరులు, మనుమలు, బంధువులు, సేనానులు, సైన్యం.... ఒకరేమిటి స్త్రీలు తప్ప రావణుని బలగమంతా తుడిచిపెట్టుకుపోయింది. చివరకు మిగిలిందల్లా విభీషణుడొక్కడే. విభీషణునికి అన్నగారంటే భయం, భక్తి, ద్వేషం, ప్రేమ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ, ఆయనకు అంత్యక్రియలు జరిపించడం మాత్రం ఎందుకనో ఇష్టం లేకపోయింది. బహుశ రాముడు ఏమైనా అనుకుంటాడేమో అనే శంక వల్ల కావచ్చు, తాను చెప్పిన మాటను అన్నగారు పెడచెవిన పెట్టి, చివరికిలా శత్రువు చేతిలో కుప్పకూలిపోయాయే అనే కోపం వల్ల కావచ్చు.
అలాగని ఆయన శరీరాన్ని అలా యుద్ధభూమిలో వదిలేసి వెళ్లడానికి మనస్కరించడం లేదు. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రామచంద్రుడు. విభీషణుని వద్దకు వచ్చాడు. భుజంపై చేయివేశాడు. విభీషణుని చేతులను తన చేతిలోకి తీసుకుని, ఆ΄్యాయంగా నొక్కుతూ, ‘‘ఎవరిపైన అయినా ద్వేషం, పగ పెంచుకుంటే, అది వారు మరణించేంతవరకే ఉండాలి. మరణించిన తర్వాత కూడా వారిపైన ద్వేషం చూపడం మంచిది కాదు.
శాస్త్రప్రకారం మరణించిన వారు దాయాదులు అయితే, వారి అంత్యక్రియలకు వెళ్లకపోవడం, కర్మకాండలలో పాలుపంచుకోకపోవడం, వారి కర్మభోజనం చేయకపోవడం అధర్మం. అంతేకాదు, మరణించిన వారిపై బురద జల్లడం, వారిని విమర్శించడం, వారి ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మాట్లాడటం కూడా అధర్మమే. నీ సోదరుడైన రావణుడు మరణించాడు కాబట్టి అతనిపై నీకే కాదు, నాకు కూడా ఇప్పుడు ఎటువంటి ద్వేషభావమూ ఉండకూడదు. ఆ మరణంతో అతనిపై ఉన్న పగ, ప్రతీకారం, ద్వేషభావం కూడా నశించినట్లే భావించు’’ అంటూ హితవు పలికాడు.
ఆ మాటలు విన్న తర్వాత విభీషణుడు శాస్త్రోక్తంగా తన అన్నకు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధపడ్డాడు. రాముడు అన్నివిషయాలలోనూ తోడుగా ఉండి, విభీషణుని చేత ఉత్తరక్రియలన్నీ జరిపించాడు. అంతకుమునుపు వాలి మరణానంతరం కూడా ఇదేవిధమైన సూత్రాన్ని సుగ్రీవుడికి బోధించి, అంగదుడి చేత వాలికి ఉత్తరక్రియలు జరిపించి, అనంతరం సుగ్రీవుని చేతనే అంగదునికి కిష్కిందానగరానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయించాడు రాముడు.
మరణించిన వారికి కర్మకాండలు జరిపించి, తెలిసిన వారినందరినీ కర్మ భోజనానికి పిలవడం, వారంతా వచ్చి ఆ భోజనాలు చేసి వెళ్లడం వల్ల మృతుల ఆత్మకు శాంతి చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది. కొందరు వివిధ రకాల కారణాలతో... సాకులతో మృతి చెందిన బంధుమిత్రులను చివరి చూపు చూసేందుకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. మరికొందరు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా వెళ్లరు. అది మహా అపరాధం. మరణంతో వారితో ఉన్న శత్రుత్వం సమసిపోతుంది. కష్టంలో ఉన్న వారిని పరామర్శించడం పుణ్యకార్యమే కానీ ధర్మ విరుద్ధమైనది కాదు.
– డి.వి.ఆర్.


