జోషి అంకుల్‌.. ఓ సంచి

Uncle Joshi Cloth Bags Selling Elderly Man From Mumbai - Sakshi

వృద్ధాప్యం శాపంలా భావిస్తూ కాటికి కాళ్లు చాపుకుని రోజులు వెళ్లబుచ్చుతుంటారు చాలా మంది. అతి తక్కువమంది మాత్రమే దేవుడు ఆయుష్షును బోనస్‌లా ఇచ్చాడు అనుకుంటూ ఉన్న జీవితాన్ని అర్ధవంతంగా మలుచుకుంటారు. అలా అర్థవంతంగా జీవిస్తున్న జోషి అనే 87 ఏళ్ల వ్యక్తి కథ ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పడేసే గుడ్డ పీలికలతో సంచులను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. 

అంకుల్‌ జోషి..
ముంబైలోని డొంబివాలిలో ఈ తాత చేతి సంచులను అమ్ముతూ కనిపిస్తుంటాడు. స్వశక్తిపై జీవిస్తున్న జోషి కథను ట్విట్టర్‌ యూజర్‌ గౌరీ వెలుగులోకి తెచ్చారు. ‘అంకుల్‌ జోషి’ వయసు 87. అతను అమ్మే ఒక్కో సంచి రూ .40 నుండి రూ. 80 మధ్యలో ఉంటుంది. సోఫా, కర్టెన్‌ తయారీదారులనుంచి చిరిగిన క్లాత్‌లను సేకరిస్తాడు. వాటిని జాగ్రత్తగా ఒక్కోటి జత చేస్తూ సంచులను కుడతాడు. అతను డోంబివాలి ఫడేకే రోడ్డున కూర్చుని ఉంటాడు. ఎవరైనా అటుగా వెళితే ముంబై జోషి అంకుల్‌ను కలిసి ఒక బ్యాగ్‌ కొనడం మాత్రం మర్చిపోవద్దు’ అని తన ట్వీట్‌ ద్వారా సందేశం ఇచ్చారు గౌరి. 
వయసు పైబడినా ఎవరిమీదా ఆధారపడకుండా చేతి సంచులను తయారుచేస్తూ, వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తున్న జోషి అంకుల్‌ నేటి తరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top