
శ్రావ్యమైన సంగీతానికి చెవి కోసుకునే స్వరాభిమానులకు సరైన వేదిక– జపాన్‌లో జరిగే ‘ఫుజీ రాక్ ఫెస్టివల్!’ ఈ వేడుక జపాన్‌లోని నిగాటా ప్రిఫెక్చర్‌లో ఉన్న నేబా స్కీ రిసార్ట్‌లో ప్రతి ఏటా జూలై నెల చివరి వారంలో మూడురోజుల పాటు జరుగుతుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు ఈ సంగీత సంబరం జరగనుంది. ఈ వేడుక తొలిసారిగా 1997లో ప్రారంభమైంది. పచ్చని పర్వతాల నడుమ, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రత్యేకంగా సాగుతుంది.
ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. రాక్, పాప్, ఎలక్ట్రానిక్, హిప్–హాప్, జానపద శైలులలో సంగీతం శ్రోతలకు వీనులవిందు చేస్తుంది. గ్రీన్ స్టేజ్, వైట్ స్టేజ్, రెడ్ మార్క్ వంటి అనేక వేదికలపై జరిగే ప్రదర్శనలు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తాయి. సంగీత ప్రదర్శనలతో పాటు, స్థానిక కళా ప్రదర్శనలు, ఇతర వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను మరింతగా ఉత్సాహపరుస్తాయి.
ఫుజీ రాక్ ఫెస్టివల్ కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాదు, ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యమిస్తుంది. ఈ వేడుకల నిర్వాహకులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం వంటి అనేక పర్యావరణ అనుకూల కార్యక్రమాలను చేపడతారు. ‘ప్రకృతితో కలసి ఉందాం’ అనే నినాదంతోనే ఈ వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
(చదవండి: రాజుగారి 'కలా'ఖండం..! మదిలో మెదిలి, రూపుదిద్దుకున్న కోట)