
ఒక రాజు కల ఏకంగా కళాఖండమైంది. కాని, ఆ కల తీరకుండానే రాజు కథ ముగిసింది. జర్మనీలోని బవేరియా పర్వత శ్రేణుల మధ్య న్యూష్వాన్ స్టీన్ కోట– నిర్మాణం, ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఎందరో మనసులను దోచేస్తుంది. ‘లూడ్‌విగ్ 2’ అనే రాజు 19వ శతాబ్దంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధతో, ఇష్టంతో ఈ కోటను కట్టించుకున్నాడు. ‘లూడ్‌విగ్ 2’ – నాటి జర్మన్ సంగీత స్వరకర్తగా పేరున్న రిచర్డ్ వాగ్నర్ అభిమాని కావడంతో, వాగ్నర్ ప్రేరణతోనే ఈ కోటను కట్టించాడు.
సింహాసనం దగ్గర నుంచి గానకచేరీ గది వరకు ప్రతి గదినీ అత్యంత కళాత్మకంగా రూపొందించారు. అయితే, ఈ కోట నిర్మాణం పూర్తికాకుండానే అనుమానాస్పద పరిస్థితుల్లో ‘లూడ్‌విగ్ 2’ మరణించాడు. ఆయనను మానసిక రోగిగా ప్రకటించి, రాజ్యాన్ని త్యజించమని బలవంతం చేసిన కొద్ది రోజులకే ఆయన, ఆయన వైద్యుడు సమీపంలోని స్టాంబెర్గర్ సరస్సులో శవాలుగా దొరికారు.
ఇది ఆత్మహత్యగా ప్రచారం చేసినా, అంతశ్శత్రువులే రాజును హత్య చేశారని చాలామంది ఇప్పటికీ నమ్ముతారు. విధి ఆడిన వింత నాటకంలో ‘లూడ్‌విగ్ 2’ కల చెదిరింది. అతడి మదిలో మెదిలి, రూపుదిద్దుకున్న కోట మాత్రం ప్రపంచానికి ఒక కళాఖండంగా మిగిలింది.
(చదవండి: ధోతికట్టు..అదిరేట్టు..! నాడు గౌరవం..ఇవాళ ట్రెండీ స్టైల్..)