
‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడుకండువా లేనిదే గడపదాటని వాడుపంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు
సినారె.. రాసిన ఈ నాలుగు పంక్తుల్లో తెలుగువాడి పంచెకట్టు వైభవాన్ని చాటి చెప్పాయి.
ధోతి ఒక అంచును పైనున్న లాల్చీ కుడి జేబులో పెట్టుకుని కనిపించిన నందమూరి తారకరామారావు తన తెలుగుదనపు ఠీవీని ప్రదర్శించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తనదైన శైలి పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనానికి ప్రతిరూపంగా కనిపించేవారు. తెలుగు వారు ఠీవీగా చాటుకునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విదేశీ పర్యటనలు మినహా ఎప్పుడూ పంచె కట్టును వీడింది లేదు’.
ఈవెంట్లలోనే..
నాటి తరం కట్టు బొట్టు ఇప్పడు ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ప్రత్యేక సందర్భాల్లో నాటి చీరకట్టులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నాటి వస్త్రధారణ నేటి ఈవెంట్స్‌లో సరికొత్త సంప్రదాయ అలంకరణగా మారింది.
– పడకంటి ఇందు,చామ కృష్ణవేణి, కరీంనగర్
ఎనభై ఏళ్లుగా..
మా పుట్టిల్లు మర్తనపేట. అత్తగారి ఊరు ఇప్పలపెల్లి. పెళ్లయిన నాటి నుంచి ఇదే తరహా గోచీ చీరలే ధరిస్తున్న. 80 ఏళ్లు దాటుతున్నా మరో ఆలోచన లేదు. 18 మూరల చీరను కూడా సులువుగా కట్టుకుంటాం. కష్టం చేసుకుని బతికెటోళ్లకు ఇదే సౌకర్యం.
– గొడుగు లచ్చవ్వ, ఇప్పలపల్లి
సాగు పనులకు అనుకూలం
నా చిన్నప్పటి నుంచి గోచీ గుడ్డ ధరించేది. కొంత పెద్దయ్యాక మొదలైన ధోతికట్టు ఇప్పటి వరకూ కొనసాగిస్తున్న. ధోతితో ఉండే సౌకర్యం మరే వస్త్రంతో ఉండదు. వ్యవసాయం చేసుకునే మాలాంటి కుటుంబాల్లో మగవాళ్లందరికీ ధోతికట్టే అలవాటైంది. సాగు పనులకు సౌకర్యంగా ఉండడం ధోతికట్టులో ఉన్నంతగా మరి దేనిలోనూ ఉండదు.
సలేంద్రి దేవయ్య, పెద్దూరు
అర్ధశతాబ్దకాలం క్రితం వరకు పురుషులు పంచెకట్టు, స్త్రీలు గోచి చీరలతో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చేవారు. క్రమంగా ఈ వస్త్రధారణలో మార్పు ప్రవేశించింది. పల్లె సీమల్లో ఒక ఈడు దాటిన స్త్రీ, పురుషులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తున్నా మెజార్టీ ప్రజల్లో ఈ అలవాటు దాదాపు కనుమరుగయ్యే దశ కనిపిస్తోంది.
పంచెకట్టు ఒక తరం ఉనికిని, అస్తిత్వాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక కార్యాలు, వివాహాది శుభకార్యాల సమయంలో వరుడితో పాటు అతని తండ్రి, కన్యాదానం చేసే వధువు తండ్రి సైతం పంచెకట్టుకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లలకు ఐదారేళ్ల వయసొస్తే పంచెలు కట్టించే వేడుక నిర్వహించడం కూడా చూస్తున్నదే.
పంచెకట్టు ప్రయోజనాలు
శరీరానికి సహజమైన గాలి తగలడం పంచెకట్టుతో ఉన్న నిజమైన సౌకర్యం. ఏ తరహా శరీరానికైనా నప్పే పంచె వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం బాగుంటుందంటారు. పది మంది పిల్లల్ని కని పెంచిన పూర్వీకుల సంతతి కూడా ఇందుకు నిదర్శనంగా కనిపించడం విశేషం.
ఇక స్త్రీల వేషధారణలో సైతం గోచీ పెట్టుకునే చీరలు ఈ తరానికి తెలియవంటే ఆశ్చర్యం లేదు. అమ్మమ్మ, నాన్నమ్మలంటేనే ఆ తరహా వేషధారణ గుర్తొచ్చేది. ఇప్పుడు మెల్లగా మొదలైన మార్పు అటు పంచెను ఇటు గోచీ చీరను తుడిచిపెట్టేసింది.
సుమారు ఏడెనిమిది మీటర్లు లేదా 9 గజాలు లేదా 18 మూరల పొడవుండే ఈ చీరలు ధరించడం తెలుగునాట తరాలుగా కొనసాగింది. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి సాగుపనులకు అనుగుణంగా ఉండే అద్భుతమైన కట్టుబడి ఇది. గొల్ల కురుమలతో పాటు సాగు పనులు చేసే కాపు సామాజికవర్గాల్లో ఈ తరహా చీరకట్టు కనిపించేది. వాళ్ల ఆచారాల ఆధారంగా కొంగు కొందరు ఎడమ వైపు మరి కొందరు కుడివైపుకి ధరించేవారు.
ఈ తరానికి తెలియని బొడ్లె సంచి
గోచీ చీర ధరించే మహిళలు విధిగా ధరించే మరో వస్త్ర పరికరం బొడ్లె సంచి. ఈ తరానికి కనీసం చూసే భాగ్యం కూడా లేని అపురూపమైన నాటి మనీ పర్స్. వాలెట్‌గా పిల్చుకుంటున్న నేటి మనీ పర్స్‌లోని అరల కన్నా ఎక్కువగా ఉండే ఈ బొడ్లె సంచిలో ప్రయాణాలకు అవసరమైన చిల్లర నాణేలు, ఒకటో రెండో కరెన్సీ నోట్లకు భద్రమైన బ్యాగు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బులున్న బొడ్లె సంచిని గోచీ చీరతో పాటు బొడ్లో దోపుకునే సంరక్షించుకునేవారు. ఇది కూడా లేని వాళ్లు కొంగు చివరన డబ్బులు మూటగా కట్టుకుని దాన్ని శరీరం చుట్టూ తిప్పి తిరిగి బొడ్లో దోపుకునే వారు.
జీన్స్ ప్యాంటుల్లోకి వచ్చాక..
స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా ఇప్పుడు అందరూ కామన్‌గా ధరించేది జీన్స్ ప్యాంట్‌నే. యువతరానికి నచ్చినప్పటికీ దీంతో ఉండే అసౌకర్యం, అనారోగ్యం కూడా ఎక్కువే. జననేంద్రియాలను పట్టి ఉంచే లక్షణంతో ఉంటాయి కాబట్టి సహజమైన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణానికి గురవుతుంటాయి. కాబట్టి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటిగా నిపుణులు చెప్తున్నారు. ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అవుతున్న జంటలు కొన్నైతే, స్థిరపడ్డాకే సంతానం అనుకుంటూ 30 దాటినా పెళ్లిల్లు లేవు, 40 దాటినా సంతానం లేకుండా పోతున్నారు.
అన్ని మారిపోతున్నాయి
మన సంప్రదాయలు ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని మారిపోతున్నాయి. మగ్గం బట్టలు పోయి మిల్లు బట్టలు వచ్చాయి. అప్పటి దోతి, పంచె కుట్టు, బనీయన్‌లు ఇప్పుడు కానరావడం లేదు. నేను మాత్రం మా తాత, నాయిన పద్ధతిలోనే నడుచుకుంటున్న.
– కనుమల్ల రామస్వామి, నేత కార్మికుడు, వెదిర
గోచీ పెట్టుకోవడమే అలవాటు
చిన్నప్పుడు గౌను, లంగాజాకెట్ వేసుకునేదాన్ని. వయస్సు వచ్చాక లంగా, జాకెట్ ఓనీ, తర్వాత గోచిచీర కట్టుకుంటున్న. ఇప్పటి పిల్లలకు గోచిపెట్టుకోవడం నామోషీగా అనుకుంటారు. కానీ అదే మన పాతకాలం పద్ధతి. చీర కంటే గోచి చీర కట్టుకుంటే బాగుంటుంది.
– కనకమ్మ, వ్యవసాయదారు, కరీంనగర్
నిండుగా ఉంటుంది
పాత పద్ధతిలో ఆరుగజాల చీర కట్టుకుంటే నిండుగా ముతైదువ తనం ఉట్టిపడుతుంది. ఇప్పుడు ఎవరూ పాత పద్ధతులు పాటించడంలేదు. ఇంకా ముసలివాళ్లు మాత్రమే గోచిచీర కట్టుకుంటున్నారు. – ఓదెమ్మ, వ్యవసాయదారు,రైతుబజార్, కరీంనగర్
(చదవండి: