తొంభైఏళ్లు నిండేంత వరకు మనుషులు బతకడమే కొంత అరుదు. ఒకవేళ ఆ వయసు వచ్చేంత వరకు బతికి ఉన్నా, కీళ్లు సడలి నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది తొంభై ఏళ్ల వయసులోనూ తొణకని కండలతో, సడలని దేహదారుఢ్యంతో బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకుని ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఈ పెద్దాయన. ఈయన పేరు కనాజావా తోషిసుకే.
ఇటీవల జపాన్‌లో జరిగిన వెటరన్ బాడీ బిల్డర్స్ పోటీలో పాల్గొన్నాడు. ఈ పోటీలో 41 ఏళ్లు పైబడిన వారి నుంచి 90 ఏళ్లు నిండినవారి వరకు 13 కేటగిరీల్లో దాదాపు రెండువందల మంది బాడీబిల్డర్లు పాల్గొన్నారు. కనాజావా ‘85 ప్లస్’ కేటగిరీలో ఈ పోటీలో పాల్గొని, ఆరుగురు ప్రత్యర్థులను వెనక్కు నెట్టి చాంపియన్‌షిప్ గెలుచుకుని, ప్రపంచంలోనే అత్యంత వయోధిక బాడీబిల్డర్‌గా రికార్డు సృష్టించాడు.


