ఔరా! సౌరా! | Today is Ratha Saptami | Sakshi
Sakshi News home page

ఔరా! సౌరా!

Jan 25 2026 5:49 AM | Updated on Jan 25 2026 5:56 AM

Today is Ratha Saptami

నేడు రథసప్తమి

ఆదిత్యుడికి ఎన్నో ఆలయాలు

లోకానికి వెలుతురు, వెచ్చదనం ఇచ్చేది సూర్యభగవానుడు...సూర్యుడే భూమి మీదనున్న ప్రాణులన్నింటికీ జీవనాధారం...చరిత్రపూర్వ యుగంలో మనుషులు సూర్యుడిని ఆరాధించేవారు.

ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తారు. సూర్యుడిని జ్యోతిషశాస్త్రం గ్రహరాజుగా పరిగణిస్తుంది. మన దేశమంతటా ప్రాచీనకాలంలో వ్యాప్తిలో ఉన్న షణ్మతాలలో సౌరమతం కూడా ఒకటి. మన దేశంలోనే కాదు, ప్రాచీనకాలంలో ఇతర దేశాలలో కూడా సౌర ఆరాధన ఉండేది. చరిత్రను పరిశీలిస్తే, ఆదిత్యుడినే ఆదిదేవుడని చెప్పవచ్చు. 

ప్రాచీన ఈజిప్టు భూభాగంలో చరిత్ర పూర్వయుగం నుంచే సూర్య ఆరాధన వ్యాప్తిలో ఉండేది. ఈజిప్షియన్‌ ప్రజలు సూర్యుడిని ‘ర’, ‘రె’ అనే పేర్లతో పూజించేవారు. క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్ది నాటికి ఈజిప్షియన్ల ప్రధాన దైవాలలో ‘ర’కు ప్రత్యేక స్థానం ఉండేది. క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలో వర్ధిల్లిన మెసపొటేమియన్‌ నాగరికతకు చెందిన ప్రజలు సూర్యుడిని ‘షమాష్‌’ అనే పేరుతోను, సుమేరియన్లు ‘ఊటూ’ అనే పేరుతోను పూజించేవారు. 

క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలోనే భారత భూభాగంలో మొదలైన వైదిక యుగంలో వైదికార్యులు సూర్యుడిని విశేషంగా ఆరాధించేవారు. సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా వేదాలు కీర్తించాయి. సౌర ఆరాధనకు నిదర్శనంగా పురాతనమైన కొన్ని సూర్య దేవాలయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం...

మార్తాండ దేవాలయం
ఇది కశ్మీర్‌లోని మట్టన్‌ పట్టణంలో ఉంది. దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఇదొకటి. పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ సూర్య దేవాలయం సుమారు క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. విదేశీయుల దాడుల్లో కొంత, తర్వాత సంభవించిన భూకంపాలలో కొంత ఈ ఆలయం చాలావరకు ధ్వంసమైంది. 

పీఠభూమి ప్రాంతంలో ఉన్న మట్టన్‌ పట్టణంలో ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన మార్తాండ ఆలయం వద్ద నుంచి తిలకిస్తే, దిగువనున్న కశ్మీర్‌ లోయ ప్రాంతం అంతా కనిపిస్తుంది. మార్తాండ ఆలయ ప్రాంగణంలో 84 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఈ ఆలయ పరిరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.

కోణార్క దేవాలయం 
ఈ ఆలయం ఒడిశాలోని కోణార్క పట్టణంలో ఉంది. తూర్పు గంగవంశానికి చెందిన గజపతి లాంగూల నరసింగదేవుడు పదమూడో శతాబ్దిలో దీనిని నిర్మించాడు. దీని నిర్మాణం 1238–64 మధ్య కాలంలో జరిగింది. కళింగ శిల్పకళా చాతుర్యానికి అద్దం పట్టే కోణార్క ఆలయంలో ప్రధానంగా రెండు నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి నాట్యమండపం కాగా, మరొకటి గర్భాలయం. ఈ ఆలయం కొంత శిథిలమైనా, చాలావరకు శిల్పసంపద ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. 

ఈ ఆలయంలో ముప్పయిమూడు అడుగులకు పైగా ఉండే అరుణ స్తంభం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సూర్యుడి రథాన్ని పోలిన ఆలయ నిర్మాణం, రథ చక్రాలపై సైతం సూక్ష్మమైన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పూరీలో వెలసిన జగన్నాథుడి ఆలయానికి కోణార్క ఆలయాన్ని సింహద్వారంగా భావిస్తారు. ఈ ఆలయంలో పలు కళా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఈ వేడుకలతో పాటు కోణార్క సముద్ర తీరంలో ఏటా కోణార్క్‌ బీచ్‌ ఫెస్టివల్‌ కూడా జరుగుతుంది.

రహీల్యా సాగర్‌ సూర్య దేవాలయం 
ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మహోబా పట్టణంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దికి చెందిన చందేలా రాజు రహీలా ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. రహీల్యా సాగర్‌ తటాకం ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఈనాటికీ నిలిచి ఉంది. ఈ ఆలయం ఉన్న మహోబా పట్టణాన్ని త్రేతాయుగంలో కేకపురం అని, ద్వాపరయుగంలో పాటనపురం అని పిలిచేవారని చెబుతారు. 

మహోబా పట్టణం, ఆ పరిసరాలకు సంబంధించి పలు పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వనవాస కాలంలో సీతారాములు ఇక్కడ కొన్నాళ్లు గడిపినట్లు చెబుతారు. ఇక్కడకు సమీపంలోని తటాకాన్ని ‘రామకుండ్‌’ అంటారు. గోరఖ్‌గిరి కొండ గుహను ‘సీతా రసోయి’ అంటారు. ఈ తటాకంలోనే సీతారాములు స్నానాలు చేసేవారని, గుహలో సీతమ్మవారు వంటచేసేవారని చెబుతారు. 

చందేలా రాజులు చంద్రవంశీకులైనా, ఈ ప్రదేశానికి సూర్యవంశీయుడైన రాముడితో సంబంధం ఉండటంతో ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో సభా మంటపం, గర్భాలయం ప్రధాన భాగాలుగా కనిపిస్తాయి. వినాయకుడు, త్రిమూర్తులు సహా అనేక దేవతలు, పురాణగాథల శిల్పాలు ఆలయ కుడ్యాలు, స్తంభాలపై కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిరక్షిస్తోంది. 

మోధేరా సూర్య దేవాలయం 
ఇది గుజరాత్‌లోని మెహసానా జిల్లా మోధేరా గ్రామంలో ఉంది. చాళుక్య/ సోలంకీ వంశానికి చెందిన ఒకటో భీముడు మోధేరా గ్రామంలో సూర్య దేవాలయాన్ని పుష్పావతీ నదీతీరంలో నిర్మించాడు. ఈ ఆలయం వద్ద నిర్మించిన శిలా శాసనం ప్రకారం దీని నిర్మాణం విక్రమశకం 1083 (క్రీస్తుశకం 1026–27) సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తోంది. మారు గుర్జర వాస్తు శైలిలో చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి శిల్పకళా వైభావాన్ని నిదర్శనంగా నిలిచి ఉంది. 

ఈ ఆలయంలో ప్రవేశమార్గంలో కీర్తితోరణం, దానికి ఎదురుగా సభా మండపం, అది దాటిన తర్వాత గూఢమండపం, లోపల గర్భాలయం ఉంటాయి. రాతిగోడలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోనే సూర్యకుండం అనే మెట్లబావి కూడా ఉంది. 

వనవాసకాలంలో సీతారాములు ఇక్కడ గడిపినట్లు గాథలు ప్రచారంలో ఉండటంతో సూర్యకుండాన్నే రామకుండం అని కూడా అంటారు. ఈ ఆలయంలో ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ మహోత్సవం, మాఘ శుక్ల సప్తమి రోజున రథసప్తమి పర్వదినాలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాయణ మహోత్సవం సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఏటా నాట్యోత్సవం కూడా జరుగుతుంది. 

మడ్‌ఖేడా సూర్య దేవాలయం 
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని టీకమ్‌గఢ్‌ జిల్లా మడ్‌ఖేడా గ్రామంలో ఉంది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు ఈ సూర్యదేవాలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించారు. నాగర శిల్పకళా శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచి ఉండటం విశేషం. ఆలయం లోపలికి ప్రవేశించగానే మండపం, ఆ తర్వాత అంతరాలయం, లోపల గర్భగుడి ఉంటాయి. ఆలయం గోడలపైన, స్తంభాలపైన అద్భుత శిల్పాలు కనువిందు చేస్తాయి. 

గర్భగుడిలోని సూర్యనారాయణమూర్తి విగ్రహంతో పాటు ఆలయ కుడ్యాలపై చెక్కిన శ్రీమహావిష్ణువు దశావతారాలు, శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, బ్రహ్మ విష్ణువుల శిల్పాలు, అంతరాలయంలోని గంగా యమునల శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ సంప్రదాయాలకు చెందిన శిల్పాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఈ ఆలయ పరిరక్షణను పర్యవేక్షిస్తోంది.

దేవ్‌ సూర్యమందిరం 
ఇది బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లా దేవ్‌ పట్టణంలో ఉంది. స్థలపురాణ గాథల ప్రకారం ఈ ఆలయాన్ని సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈ ప్రాంతంలో పురాతన కాలం నుంచి సూర్య ఆరాధన ఉండేదనేందుకు నిదర్శనంగా ఇక్కడ క్రీస్తుశకం 642 నాటి గుప్తుల శాసనం బయటపడింది. అయితే, ఆ శాసనంలో ఈ ఆలయం ప్రస్తావన లేదు. 

ఈ ఆలయ నిర్మాణంలో నాగర, ద్రావిడ, వేసరా వాస్తు శిల్పశైలులు కనిపిస్తాయి. మిశ్రమ శైలిలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. ఈ ఆలయంలో చంద్రవంశ రాజు భైరవేంద్ర క్రీస్తుశకం 1437లో వేయించిన శాసనం కూడా ఉంది. ఈ ఆలయంలో ఏటా కార్తీక శుక్ల చవితి నుంచి నాలుగు రోజుల పాటు ‘ఛuЇ పూజ’ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి.

సోనాటాపాల్‌ సూర్య మందిరం 
ఇది పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా సోనాటాపాల్‌ గ్రామంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం కళింగ వాస్తుశైలిలో ఉంటుంది. ఇది క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందినదని పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. శాలివాహనులు దీనిని నిర్మించినట్లు స్థలపురాణ గాథలు ఉన్నా, దీనిని పాల్‌ వంశానికి చెందిన బిష్ణుపూర్‌ రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 

అప్పట్లో కళింగ శైలిలో నిర్మించిన చాలా దేవాలయాలు పూర్తిగా రాతి నిర్మాణాలు. సోనాటాపాల్‌లోని ఈ సూర్య మందిరం మాత్రం ఇటుకలతో నిర్మించినది కావడం విశేషం. ఈ ఆలయ పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన పురాతన టెర్రకోట వస్తువుల ఆధారాల ప్రకారం ఇది కోణార్క ఆలయం కంటే పురాతనమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడి గర్భగుడిలో ఎలాంటి విగ్రహమూ ఉండదు. 

దీని గురించి రకరకాలుగా స్థలపురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే జరిపిన తవ్వకాలలో పురాతన జైన శిల్పాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఈ ఆలయంలో నిత్యపూజలు జరగవు గాని, అప్పుడప్పుడు ఆలయం వద్ద జానపద కళా ప్రదర్శనలు జరుగుతుంటాయి.

సూర్యనార్‌ కోవిల్‌ 
ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా అడుతురై పట్టణంలో ఉంది. కులోత్తుంగ చోళుడి హయాంలో ఇది క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో నిర్మితమైంది. ద్రావిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఐదంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. తమిళనాడులో వెలసిన నవగ్రహ ఆలయాలలో ఇదొకటి. ఇక్కడి నవగ్రహ ఆలయాల గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. 

తమిళనాడు ప్రజలు ‘సూర్యనార్‌ కోవిల్‌’ అని పిలుచుకునే ఈ ఆలయానికి ఇదివరకు కులోత్తుంగ చోళ మార్తాండాలయం అనే పేరు ఉండేది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతుంటాయి. ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, వేడుకలు కూడా జరుగుతుంటాయి. 

ఆదిత్యపురం సూర్య దేవాలయం 
ఇది కేరళలోని కొట్టాయం జిల్లా ఇరవిమంగళం గ్రామంలో ఉంది. స్థల పురాణ గాథల ప్రకారం ఇక్కడ సూర్యుడి విగ్రహం త్రేతాయుగం నుంచి వెలసి ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో ఒక నంబూద్రి బ్రాహ్మణుడు ఇక్కడ సూర్యుడి కోసం తపస్సు చేశాడని, అతడి తపస్సుకు మెచ్చి సూర్యభగవానుడు ఇక్కడ విగ్రహరూపంలో వెలిశాడని చెబుతారు. ఇది కేరళలోని ఏకైక సూర్యదేవాలయం. దీనిని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలిపే చారిత్రక ఆధారాలేవీ లేవు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 

దేశంలోని సూర్యదేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటే, ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇందులోని సూర్యభగవానుడి విగ్రహం ప్రత్యేకమైన శిలతో తయారైంది. ఇది నూనెను పీల్చుకుంటుంది. అందువల్ల ఈ ఆలయంలో తైలాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. వంశపారంపర్యంగా నంబూద్రి బ్రాహ్మణులే ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో విశేషమైన పూజలు, వేడుకలు జరుగుతాయి.

ముల్తాన్‌ సూర్య దేవాలయం 
ఇది పాకిస్తాన్‌లోని ముల్తాన్‌ నగరంలో ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయానికి సంబంధించిన కచ్చితమైన చారిత్రక ఆధారాలేవీ లేవు. చైనా యాత్రికుడు జువాన్‌జాంగ్‌ భారత ఉపఖండంలో పర్యటించే నాటికి ఈ ఆలయం ఉనికిలో ఉంది. సిం«ద్‌ ప్రాంతంలో ఇదొక్కటే సూర్య దేవాలయం అని జువాన్‌జాంగ్‌ క్రీస్తుశకం 641 నాటి తన యాత్రానుభవాల గ్రంథంలో రాశాడు. 

క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి చెందిన సాంబపురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. విదేశీయుల దాడిలో పదో శతాబ్ది కాలంలో ఈ ఆలయం కొంత ధ్వంసమైన తర్వాత దీనిని పునర్మించారు. ఆ తర్వాత మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో పదిహేడో శతాబ్దిలో జరిగిన దాడుల్లో ఇది బాగా ధ్వంసమై, శిథిలావస్థకు చేరుకుంది. అలనాటి ఆలయం ఇప్పుడు ఒక శిథిల అవశేషంగా మాత్రమే మిగిలి ఉంది.

కటార్‌మల్‌ సూర్య దేవాలయం 
ఇది ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కటార్‌మల్‌ గ్రామంలో ఉంది. కత్యూరీ వంశానికి చెందిన రాజు కటార్‌మల్‌ ఈ ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించారు. ఈ ఆలయంలో సూర్యభగవానుడు ‘వృద్ధాదిత్యుడి’గా కొలువుతీరి ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతలకు చెందిన నలభై నాలుగు ఉపాలయాలు ఉన్నాయి. 

హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి ఆరువేల అడుగులకు పైగా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నుంచి తిలకిస్తే, ధగధగలాడే మంచుకొండలు కనిపిస్తాయి. అరసవల్లి ఆలయంలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా ఏడాదికి రెండుసార్లు నిర్ణీత దినాలలోని సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టు పాదాలను తాకుతాయి.

అరసవల్లి సూర్యనారాయ స్వామి ఆలయం
ఇది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కళింగ రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతికాలంలో జరిగిన యుద్ధాలు, దాడుల్లో ఈ ఆలయం ధ్వంసం కావడంతో పద్దెనిమిదో శతాబ్దిలో దీనిని పునరుద్ధరించారు. 

ప్రస్తుతం కనిపించే కట్టడంలో చాలాభాగం అప్పుడు పునరుద్ధరించిన నిర్మాణమే! కశ్యప మహర్షి స్వయంగా ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ‘పద్మపురాణం’ కథనం. ఈ ఆలయంలోని అద్భుత విశేషం ఏమిటంటే, ఏటా రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యభగవానుడి విగ్రహం పాదాలను తాకుతాయి. 

ఉత్తరాయణంలో మార్చి 9–11 తేదీలలోను, దక్షిణాయనంలో అక్టోబర్‌ 1–3 తేదీలలోను సూర్యోదయ సమయంలో ఈ అద్భుతాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరుతారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాల్లో విశేషంగా పూజలు, వేడుకలు జరుగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement