
సాక్షి, శ్రీకాకుళం: అరసవిల్లి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో(Arasavalli Temple) బుధవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు(Sun Rays Arasavalli) స్వామివారి మూలవిరాట్‌ను తాకాయి. నాలుగు నిమిషాలపాటు కనువిందు చేసిన ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. రేపు కూడా ఇలాంటి దృశ్యం కనిపించే అవకాశం ఉందని పూజారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకడం ఒక అద్భుతమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మికంగానూ విశేషమైందిగా భావించబడుతోంది. ప్రతి సంవత్సరం మార్చి 9, 10.. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉదయం 6:05 గంటలకు సూర్య కిరణాలు ఆలయ ద్వారాల ద్వారా నేరుగా సూర్య భగవానుడి పాదాలను తాకుతాయి.
ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య, శాంతి, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భానుకిరణాల స్పర్శతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా కనిపించడం భక్తులలో పులకింత కలిగిస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడతాయి. ‘ఓం సూర్యనారాయణాయ నమః..’ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.
ఆలయ నిర్మాణం అస్త్రోనామికల్ ప్రిసిషన్‌తో ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుని విగ్రహాన్ని శిల్పకళా నిపుణులు ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని నిర్మించారు. పంచద్వారాలు, గాలిగోపురం ద్వారా కిరణాలు నేరుగా విగ్రహాన్ని తాకేలా నిర్మాణం చేయబడింది. అందుకే సూర్యుని కక్ష్య మార్పుల వల్ల కేవలం సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే జరుగుతుందని చెబుతుంటారు.
ఇదీ చదవండి: కళారాల కళకళ