
వర్షాకాలం మొదలైంది. రోజూ వర్షంలో తడవడం, చలిగాలులు, వాతావరణం కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తడి జుట్టును అలా వదిలేస్తే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అందుకే జుట్టు సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా జుట్టు రాలడం, తగ్గి, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యానికి ఉల్లి రసం బెస్ట్ ఆప్షన్. ఉల్లిపాయలకు రుచి, వాసన గురించి కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ, ఉల్లిపాయ నూనె జుట్టు సమస్యలకు అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టులో ఉండే ఫంగస్, బ్యాక్టీరియాల్ని చంపే కొన్ని గుణాల్ని కలిగి ఉంటుంది.
ఉల్లిరసంలో ఉండే సల్ఫర్, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెగిపోయే సమస్యను కూడా పరిష్కరిస్తుంది. సల్ఫర్ కంటెంట్ అధిక మొత్తంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.అవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. కొల్లాజెన్ జుట్టు పెరుగుదలలో చాలా ముఖ్యమైనది. ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు తెల్లబడటాన్ని ఆలస్యం చేస్తాయి. అంతేకాదు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మాడు చర్మంఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలి?
ఉల్లిపాయ తొక్క తీసి మెత్తగా దంచి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు, అల్లోవెరా ముక్కలు వేసి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసి తక్కువ మంట మీద మరిగించండి. ఉల్లిపాయ, పచ్చి వాసన అంతా పోయి చక్కని అరోమా వస్తుంది. ఈ నూనెను సన్నని బట్టసాయంతో ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేసుకొని వాడవచ్చు.
మెరిసే జుట్టు: ఉల్లిపాయ నూనె జుట్టు మెరుపును పెంచడంలో బాగా పనిచేస్తుంది. దీన్ని జుట్టు మూలాలకు మాత్రమే కాకుండా జుట్టు చివరలకు కూడా అప్లై చేసి ఒకటి లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. అంతే కాదు, మీరు నొప్పిని తట్టుకోగలిగితే, పచ్చి ఉల్లిపాయను పేస్ట్ లా చేసి నేరుగా జుట్టుకు అప్లై చేయండి. రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది మరియు జుట్టు మెరుపు పెరుగుతుంది.
ఉల్లిపాయ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఈ నూనెతో జుట్టు మూలాల్లో మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడి జుట్టు మందంగా, ఒత్తుగా పెరుగుతుంది.
ఈ నూనెలోని యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలతో చుండ్రు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇది జుట్టును నల్లగా చేయడమే కాకుండా, దురద వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. జుట్టు సహజ ముదురు రంగు తిరిగి వస్తుంది. అన్ని పొడిబారడం తగ్గి, మృదువుగా , మెరుస్తూ ఉంటుంది. నూనె అప్లయ్ చేసిన రాత్రం అలానే ఉంచేడి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు తొందరగా తెల్లబడదు. అయితే ఉల్లిపాయ రసాన్ని, మెంతులు, కొబ్బరి నూనె,అలోవెరా జెల్ లాంటివాటితో కలిపి రాస్తే మెరుగైన ఫలితం లభిస్తుంది.
నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. ఉల్లివాసన పడనివారు అలర్జీ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఉల్లి నూనెను అప్లయ్ చేసే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.