పుష్కరిణి పురాణం | Swami Pushkarin: Devotees also consider it as the fountainhead of all sacred rivers | Sakshi
Sakshi News home page

పుష్కరిణి పురాణం

Oct 11 2026 3:17 AM | Updated on Oct 11 2026 3:17 AM

Swami Pushkarin: Devotees also consider it as the fountainhead of all sacred rivers

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న స్వామి పుష్కరిణి భక్తులకు అత్యంత పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు పుష్కరిణిని దర్శించుకోవడం, పుష్కరిణి తీరంలో ఉన్న ఆదివరాహస్వామిని దర్శించడం తిరుమల సంప్రదాయంలో ప్రత్యేకమైనది. 

పురాణాల ప్రకారం స్వామి పుష్కరిణి మొదట వైకుంఠంలో ఉండేదని చెబుతారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ తీర్థాన్ని గరుడుడు భూలోకానికి తీసుకువచ్చాడని కథనం. శ్రీవేంకటేశ్వరస్వామి తిరుమల కొండపై వెలసినప్పుడు ఆయన కోసం గరుడుడు వైకుంఠ పుష్కరిణిలోని కొంత భాగాన్ని భూలోకానికి తీసుకువచ్చాడని భక్తుల విశ్వాసం. అందుకే దీనికి ‘స్వామి పుష్కరిణి’ అనే పేరు వచ్చిందని పురాణ కథనం. 

స్వామి పుష్కరిణికి ఆదివరాహస్వామి ఆలయంతోనూ ప్రత్యేకమైన సంబంధం ఉంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం తిరుమలలో మొదటగా వరాహస్వామికి అధికారం ఉండేదని, అనంతరం శ్రీనివాసుడు కొండపై నివాసం ఏర్పరచుకున్నారని కథనం. అందుకే శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. తిరుమల ఆలయ చరిత్రలో పుష్కరిణి నీటికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్వామివారి ఆలయంలో కొనసాగే ఆచారాల్లో పుష్కరిణి ప్రస్తావన కనిపిస్తుంది.

ముఖ్యంగా బ్రహ్మోత్సవాల చివరి రోజున జరిగే చక్రస్నానం సమయంలో స్వామి పుష్కరిణి ప్రధాన వేదికగా మారుతుంది. మలయప్పస్వామి ఉత్సవమూర్తితో పాటు సుదర్శన చక్రానికి పవిత్ర స్నానం నిర్వహించడం ఈ కార్యక్రమంలోని ముఖ్య ఘట్టం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి పర్వదినాల్లోనూ స్వామి పుష్కరిణికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా వైకుంఠ ద్వాదశి సందర్భంగా జరిగే చక్రస్నానం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పుష్కరిణి తీరం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement