breaking news
Lord Srinivasa
-
బ్రహ్మాండనాయకుడి పవిత్రోత్సవాలు! ఎందుకు చేస్తారంటే..?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి శాస్త్రోక్తంగా అర్చించటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కానిపని. అలాంటిది సామాన్య మానవులు జరిపే శాస్త్రోక్త విధానమైన భగవత్పూజా విధానం అతిదుస్సాధ్యమని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారికి జరిగే నిత్యపూజల్లో, ఉత్సవాలలోనూ ద్రవ్య మంత్రతంత్రాది లోపాలు అనేకం చోటు చేసుచేసుకోవడం పరిపాటి. ఇలా తెలిసీ తెలియక జరిగిన దోషనివృత్తికి ప్రత్యేకంగా ఉత్సవ రూపాల్లో ఉన్న ఒక ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది. దానికే పవిత్రారోపణం లేక పవిత్రోత్సవం అని పేరు. ఆగస్టు 3 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్న సందర్భంగా....పవిత్రోత్సవం అంటే పరమపవిత్రమైన ప్రాయశ్చిత్త మహోత్సవం. సంవత్సరానికొకసారి ఆలయ పవిత్ర వాతావరణం పునఃస్థాపితం కావడానికి జరిపే ఉత్సవమిది. ఆలయాల్లో సంవత్సర పర్యంత చేసే ఆరాధనలలో జరిగే దోషాలను నిత్య, నైమిత్తిక, కామ్య ఉత్సవాలైన నిత్యారాధనాహోమ (బలి) నివేదన, బలి సమర్పణలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జ్యేష్టాభిషేక, సహస్రకలశ స్నపన, ఆరాధనాదులు, దేశ ప్రజాజనహితార్థం ఆచరించే యజ్ఞ యాగాది క్రియలలో జరిగే మంత్ర, తంత్ర, క్రియారూప, శౌచ, అశౌచ దోషనివారణకై స్వామికి జరిపించే ఉత్సవం. ఈ పవిత్రోత్సవంలో పూసలుగా అమర్చబడిన మాలలను ప్రతిష్టించి శ్రీస్వామివారికి, ఆలయపరివార దేవతలకు సమర్పించటం ప్రధానఘట్టం. పవిత్ర సూత్రాలను పవిత్రమండపంలోని పీఠంలో ఉంచి వాటిని దర్భకొసలతో కూడిన పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి ఆగమోక్త విధానంగా వాటిని ప్రతిష్టించి ఉక్తహోమం జరిపి ఉత్సవమూర్తులకు అష్టకలశ స్నపనం జరిపి ధ్వజ ఛత్ర చామర పింఛ నృత్య గేయ సమాయుక్తంగా ఆచార్యుడు ఆలయ ప్రదక్షిణం చేసి దేవదేవుణ్ణి విశేషంగా అర్చించి అష్టోత్తరశత పవిత్ర సూత్రాలను జాను పర్యంతం సమర్పించడం ఉత్తమం. చతుః పంచాశత్ (54) సూత్రములను ఊరువుల వరకు సమర్పిస్తే మధ్యమం. సప్తవింశతి (27) సూత్రాలను నాభ్యన్తం సమర్పిస్తే అధమం అని ఆగమోక్తం. వీటిలో యథాశక్తి సమర్పించాలి. పవిత్రములను ఈవిధంగా దేవ దేవునికి ఆరోపణ చేయటమే పవిత్రారోపణం. ఇదే విధంగా పరివారదేవతలకు కూడా ఒక్కొక్కరికీ సమర్పించాలి. ముందుగా అంకురార్పణ చేయాలి. ఇది దాదాపు అన్ని ప్రధాన ఆలయాలలోనూ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరిపించవలసిన ఉత్సవం.తిరుమలలో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితజన వత్సలుడు అయిన శ్రీమన్నారాయణునికి వైఖానసాగమోక్తంగా జరిగే ఈ పవిత్రోత్సవం భక్తితో చేయించినా, కళ్లారా దర్శించినా భక్తులు సర్వ పాపల నుంచి విముక్తి పొంది యశస్సు, సంపద, సంవత్సరార్చన ఫలం, విష్ణుసాయుజ్యం, అశ్వమేధయాగ ఫలం, సర్వోపద్రవనివారణయేగాక సర్వాభీష్టఫలాలు పొంది నిర్భీతులై, ధర్మ తత్పర నిష్టాగరిష్టులై సుఖిస్తారని భృగు సంహిత చెబుతోంది. పవిత్రోత్సవం అనే మాటకు పవిత్రీకరణ కార్యక్రమమని పేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వ్రేలికి దర్భతో చేయబడిన పవిత్రం ధరించి కార్యక్రమం జరపడం అలవాటు. దీనివల్ల కార్యక్రమానికి మానసికంగా యజమానికి నిర్మలతత్త్వం చేకూరుతుందనేది సంప్రదాయం.ఆలయాల్లో పవిత్రోత్సవం ఏడాదికొక పర్యాయం ఆలయపవిత్ర వాతావరణం పునఃస్థాపితమయ్యేందుకు జరుగుతుందని చెప్పుకున్నాం కదా... ఐతే ఇది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో, అంతకు ముందు బలిపీఠాల వద్ద, మూలబేరం వద్ద జనసమ్మర్దం వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని పోగొట్టేందుకు జరిపే సంప్రోక్షణం కన్నా భిన్నమైంది. దానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పేరు. పవిత్రోత్సవంలో మంత్ర, వేద, పురాణపారాయణాది కార్యక్రమాల ద్వారా భగవానుడే లేదా మూలమూర్తే విద్యుదుత్పాదక యంత్రంగా పనిచేయడం జరుగుతుంది.ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ రోజుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి, ఆయన దేవేరులతో పాటు ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యాణ మండపంలోని యాగశాలలో ఉంచబడి ఉత్సవానంతరం పూర్ణాహుతి అయిన తర్వాత మరల ఆలయప్రవేశం గావించబడతాయి. ఈ దినాల్లో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మొదటిరోజున పట్టుపోగులతో తులసిపూసలు లేదా తామరతూడు సరంలా కనిపించే పవిత్రాలను యాగశాలలో ఉంచుతారు. రెండవరోజున శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రములను శ్రీవారి ఆలయానికి, బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి నడుమగల ప్రధాన ఇతర పరివారదేవతలకు సమర్పించటం జరుగుతుంది. మూడవరోజున పవిత్ర విసర్జనం జరుపబడి పూర్ణాహుతితో ఉత్సవం సమాప్తమవుతుంది.చారిత్రకంగా ఈ పవిత్రోత్సవం 15వ శతాబ్దంలో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటానికి, ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల లేదా సిబ్బంది వల్ల తెలియకుండా జరిగే దోషాలను నివారించడానికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ ఏకాదశినాడు ఉత్సవమూర్తిని తిరుమామణిమండపంలో వేంచేపు చేస్తారు. ద్వాదశినాడు తలకు, మెడకు, మణికట్టుకు తిరుపవిత్రంతో అలంకరించి దేవేరులతో కూడా ఊరేగింపు జరుపుతారు. శ్రావణ శుక్లద్వాదశి విష్ణు పవిత్రారోపణ దినంగా తులసి పెంచటానికి ఉపయోగించే భూమిలో పెరిగిన ప్రత్తి చెట్లనుండి తీసిన దారంతో ఈ పవిత్రం చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద నివేదన తప్పకుండా జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలను ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజమాసాల్లో శుక్లపక్షంలోని పాడ్యమి, విదియ, పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమిల్లో భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, రేవతి, శ్రవణం మొదలైన నక్షత్రాల్లో ఆచరించాలని పంచరాత్రాగమం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఉపయోగించే పవిత్రాలు బంగారు, వెండి, రాగి, మృణ్మయం, పత్తి, ముంజ గడ్డి, దర్భ, పట్టు మొదలైనవాటితో చేస్తారు. అలా చేసిన పవిత్రాలను ఆచార్యుడు స్వీకరించి, పంచగవ్యాదులతో ప్రోక్షించి, ఆ ఆలయాగమాన్ననుసరించి పవిత్రాలకు యజ్ఞ ఆరాధనాదులను పూర్తి చేస్తారు. వీటిని స్వామికి సమర్పించడంవల్ల సర్వులకూ ఆయుః క్షేమాభివృద్ధి కలుగుతుంది. శ్రీమన్నారాయణారాధనను అత్యంత భక్తిశ్రద్ధలతో సంవత్సర కాలం చేస్తే కలిగే ఫలితమంతా పవిత్రారోపణమాచరిస్తే కలుగుతుందని ప్రతీతి. చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?ఈ పవిత్రోత్సవం (Pavithrotsavam) మహా ప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతీ సంవత్సరం చేయాలి. ఈ ఉత్సవం అలా ఆచరించకున్నా పరమాత్మకు ఆ సంవత్సరకాలం చేసిన ఆరాధనమంతా నిష్పలమవుతుంది. అందువల్ల ఈ ఉత్సవాన్ని ప్రతిసంవత్సరం ఆచరించాలని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచడం, ఆ తర్వాత రోజు పవిత్రాలు యాగశాలలో ఉంచడం, తర్వాత పవిత్రసమర్పణం, పూర్ణాహుతి జరిపి ఉత్సవాలకు స్వస్తి వాచకం పలుకుతారు. ఎప్పుడు ప్రారంభం...ఈ పవిత్రోత్సవాలు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజులలో మూడు రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు ముందు రోజు ‘అంకురార్పణం’తో ప్రారంభమవుతాయి, ఇందులో నవధాన్యాలను మట్టి పాత్రలలో విత్తుతారు.ముఖ్య ఉద్దేశ్యం...ఏడాది పొడవునా జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. - డి.వి.ఆర్. భాస్కర్ -
డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం
డాలస్: అమెరికాలోని డాలస్‌లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్లో తెలుగువారి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జూన్ 25వ తేదీన అలెన్ ఈవెంట్ సెంటర్ (క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్) వేదికగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) చేపడుతున్న ఈ విశేష కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొననున్నారు. స్వయంగా దేవదేవతల ప్రతిరూపాలను, పూజారులను ఆయన వెంటబెట్టుకుని రానున్నారు. ఈ సందర్భంగా డాలస్‌లో ఉంటున్న తెలంగాణ, తెలుగు వారి సౌకర్యార్థం టీపాడ్ తగిన ఏర్పాట్లను చేస్తోంది. పద్మావతీ అలిమేలు సమేత శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డూ ప్రసాదం, విశేష పూజల్లో భాగస్వాములయ్యే వారికి తిరుమల లడ్డూతోపాటు వస్త్రం అందజేయనున్నట్టు టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే స్వామివారి విశేష సేవా కైంకర్యాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. అందరూ ఆహ్వానితులేనని, పార్కింగ్ కూడా ఉచితమని తెలిపారు. డాలస్‌లో తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కల్పించడం పట్ల స్థానిక భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారనీ టీపాడ్ ప్రతినిధులు చెప్పారు. మరిన్ని వివరాల కోసం tpadus.org ని సంప్రదించవచ్చు. -
శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ
–తిరుమల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సాక్షి, తిరుమల : రాష్ట్ర డీజీపీ సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ఆలయానికి వచ్చారు. వేకువజాము తోమాల సేవ, ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మీ, ఇతర పోలీసు అధికారులతో కొంత సమయం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మాట్లాడి, పలు సూచనలు చేశారు. తర్వాత పోలీసు అతిధిగృహంలో ఆయన టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో బ్రహోత్సావాలపై సమీక్షించారు. భద్రతాపరమైన విషయాలపై చర్చించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రత కల్పించాలని సూచించారు. ఈ సారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సభ్యులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కార్గ్ దర్శించుకున్నారు. వీరికి డెప్యూటీఈవోలు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఓఎస్డీ లక్ష్మీనారాయణ యాదవ్ ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం సినీనటి శ్రియ కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు, భక్తులు ఉత్సాహం చూపారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున విఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలేశుడిని దర్శించుకున్న సమయంలో ఆ పార్టీ నేతలు రోజా, కరుణాకర్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. -
రేపు పుప్పాలగూడలో శ్రీనివాస కల్యాణం
హైదరాబాద్: పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీపద్మావతి అలివేలుమంగా సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య ఆచార్యుల నిర్దేశంతో శృంగేరి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా సేవా సమితి అధ్యక్షుడు వంగల కేశవ భట్ కోరారు.