
వారాంతపు వినోదాలకు పునఃస్వాగతం
గతంలో ఆగిపోయిన సండే ఫండే మరోసారి
మిస్‌వరల్డ్ పోటీల నేపథ్యంలో నగరంలో నిర్వహణ
18న ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లలో బ్యూటీల సందడి
మెట్రో నగరాల్లో వీకెండ్స్ సందడికి కొదవే ఉండదు. వీకెండ్స్ అంటేనే ఇక్కడ ఒక ట్రెండ్ అన్నట్టు. అయితే గత కొంత కాలంగా ఈ ట్రెండ్ నెమ్మదించింది. వారాంతాల్లో ఫుల్ జోష్‌తో జరిగే ఈవెంట్లు కరోనా తర్వాత నెమ్మదించాయి. దీనికితోడు నగరంలో అధికారికంగా నిర్వహించే వీకెండ్ కార్యక్రమాలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే గతంలో కొంత కాలం పాటు నగరవాసుల్ని ఉర్రూతలూగించిన వారాంతపు వినోద కార్యక్రమం మరోసారి ‘సండే.. ఫండే’ తిరిగి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు.
నగర వాసులు ఎంతో ఆసక్తిగా పాల్గొనే వీకెండ్ కార్నివాల్ కార్యక్రమం మళ్లీ తిరిగి రానుంది. ప్రతి వారాంతపు రోజును ‘సండే–ఫండే’ పేరిట ఉర్రూతలూగించే విధంగా నిర్వహించారు. కరోనా తర్వాత పూర్తిగా నెమ్మదించిన ఈ పరిస్థితి. అనంతరం కొంత కాలం నిర్వహించినా.. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీకెండ్ జోష్‌కు మిస్ వరల్డ్ పోటీ తిరిగి ఊపిరిపోయనుంది. ఈ ఈవెంట్ మే 18న ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విభిన్న రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో జానపద నృత్యాలు, వంటల పోటీలు వంటి మరెన్నో నగర వాసులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంపై రాష్ట్ర చరిత్ర, అభివృద్ధి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
నాటి వీకెండ్.. సూపర్ హిట్..
నగరవాసులకు వినోదం ద్వారా వారాంతపు ఆహ్లాదాన్ని పంచడానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ‘సండే–ఫండే’కు రూపకల్పన చేశారు. దీని కోసం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకూ ట్యాంక్ బండ్ రోడ్డు మీద వాహనాలకు ప్రవేశం ఆపేసి, ఈ వినోద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ రహదారిని పలు రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాట్లతో ట్యాంక్ బండ్ రోడ్ ఒక ఓపెన్ ఎంటర్‌టైన్ మెంట్ ప్లేస్‌గా అవతరించేది. ఆ సందర్భంగా మ్యూజికల్ ప్రదర్శనలు, అబ్బురపరిచే ఫైర్‌వర్క్స్, జానపద కళలు, ఇంద్రజాల ప్రదర్శనలు వంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు.
ప్రమోషన్ యాక్టివిటీస్..
ఆరీ్మకి చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ ప్రదర్శనలు, శిల్పారామం కళాకారుల చేతి వృత్తిదారుల ఉత్పత్తుల అమ్మకాలు, ఫుడ్ ట్రక్స్ ద్వారా వివిధ రకాల వంటకాలు.. వంటివి ఇందులో భాగమయ్యేవి. అంతే కాకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎమ్‌డీఏ) ద్వారా ఉచిత మొక్కల పంపిణీ కూడా జరిగేది. లేజర్ షోలు, ఫైర్ స్పోర్ట్స్ ఉండేవి. పలు ప్రైవేటు టీవీ చానెళ్లు తమ ప్రమోషన్ యాక్టివిటీస్‌కు కూడా అదే సందర్భాన్ని ఉపయోగించుకునేవి. దీంతో చిన్నితెర సెలబ్రిటీలు, యాంకర్స్ సైతం నగరవాసులకు కనువిందు చేసేవారు. అదే సమయంలో హుస్సేన్ సాగర్ వద్ద ఫౌంటెన్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కోవిడ్ కారణంగా నిలిపేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత మధ్యలో ఒకసారి పునరుద్ధరించినా దీర్ఘకాలం కొనసాగలేదు. చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.
రీఛార్జ్.. రీస్టార్ట్..
సండే ఫండే నాటి ఉత్సాహాన్ని మళ్లీ తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం నగరం కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను ఎంచుకున్నారు. నగరవాసులు మరచిపోయిన వారాంతపు సందడి సండే ఫండేకు పునరై్వభవం రావాలంటే.. అది మిస్ వరల్డ్ పోటీదారులను ఇందులో భాగం చేయడం ద్వారా సాధ్యపడుతుందని భావించి, మిస్ వరల్డ్ డైలీ షెడ్యూల్‌లో దీనిని కొత్తగా జేర్చారు. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ ఈవెంట్ నిరాటంకంగా కొనసాగుతుందని వారమంతా అలసి, సొలసిన నగర జీవికి సాంత్వన పంచుతుందని ఆశిద్దాం.