
సెలవులు వస్తే అబ్బాయిలు ఆటల్లో పడతారు. ఆడపిల్లలు తీర్చుకోవాల్సిన ముచ్చట్లలో మునిగిపోతారు.మల్లెలు విరగగాసే ఈ సీజన్‌లోకనకాంబరాలతో వేసే పూలజడ మిస్సవకూడని జ్ఞాపకం. ఇక గోరింటాకు డిజైన్లు.... పట్టుచీరలతో కొత్త డ్రస్సులు...వెండి పట్టీల వెతుకులాట...పొదుపు చేసి కొనదలచిన బంగారు వస్తువు...వేసవిలో ఆడపిల్లల హడావిడే వేరబ్బా. పెద్దవాళ్లకు గుర్తుండాలేగాని. మరి ఈ సీజన్ సంబరంలో ఉంచారా వారిని? ఏం కావాలని అడిగారా?
వేసవి వస్తే ఆడపిల్లల ఆటలు వేరు. చెట్ల నీడల్లో, వరండాల్లో గుంపుగా చేరి వారు చెప్పుకునే కబుర్లకు అంతు ఉండదు. ఇక గోరింట సింగారానికి వేసవి సెలవులే అదను. గోరింటాకు చెట్టు ఏ ఇంట్లో ఉందో వెతికి, వారిని బతిమాలి, ఆకు కోసుకొచ్చి, నూరి, చేతులకు మంచి మంచి డిజైన్లు వేసే అక్కలను వెతికి పెట్టించుకుని, గోరింట ఆరే దాకా అమ్మ చేత్తో ముద్దలు తింటూ... ఎప్పుడెప్పుడు పండుతుందా ఎంత ఎర్రగా పండుతుందా కాచుకుని... ఆ తర్వాత కడిగి నీదెలా పండిందంటే నాదెలా పండిందనుకోవడం... భలే వేడుక.
ఇక అన్నింటికి మించిన అట్రాక్షన్ పూలజడ.
మామూలుగానే అమ్మాయిలకు పూలు ఇష్టం. జడ ఇష్టం. పూలున్న ΄÷డవు జడ ఇంకా ఇష్టం. స్కూలుకెళ్లే రోజుల్లో ఈ ముచ్చట తీరే తీరుబడి ఉండదు కాబట్టి వేసవిలోనే ముహూర్తం. పూలజడ వేయించుకోవాలి... అద్దంలో జడ కనిపించేలా ఫొటో దిగాలి అని అప్పట్లో ప్రతి అమ్మాయి కోరిగ్గా ఉండేది.
అది సెంటిమెంట్ కూడా. అయితే ఇది అనుకున్న వెంటనే అవదు. ఫలానా రోజున వేద్దామని ముందే అనుకుంటూరు. తండ్రికి సమాచారం ఇస్తారు... మరి స్టూడియోకు తీసుకెళ్లి ఫొటో తీయించాలి కదా. కాస్ట్యూమ్స్ సెలక్షన్ ఉంటుంది. అమ్మమ్మ, నానమ్మ వంటి పెద్దవాళ్లకు పిన్ని, పెదమ్మలకు కబురు పెడతారు... పూల జడ కార్యక్రమం ఉందని. ఎందుకంటే పూల జడకు అవసరమైన మల్లెలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని తేవాలి.
వాటి మధ్యన కనకాంబరాలు, రోజాలు, మరువం, దవనం లాంటివి పెట్టి జడలు అల్లే స్పెషలిస్టులు కొందరుంటారు. వారి డేట్‌ను ముందే తీసుకోవాలి. వారు అనుకున్న టైమ్‌కన్నా లేటుగా వచ్చి ఆ కబురూ ఈ కబురూ చెప్తూ జడ సిద్ధం చేస్తారు. పూలజడ వేసుకుంటే జడకుప్పెలు పెట్టుకోవటం మరో ముచ్చట. అవి అందరి దగ్గరా ఉండవు కదా... అక్కడికీ ఇక్కడికీ వెళ్లి జడకుప్పెలు తెచ్చుకుని, పూలజడ చివరలో అలంకరించుకుని పావడా కట్టుకుని ఇరుగమ్మలకు, పొరుగమ్మలకూ తాతయ్యలకూ పెదనాన్నలకూ మామయ్యలకూ అత్తయ్యలకూ చూపించి రావడం...
వాళ్లు మెటికలు విరిచి పదో ఇరవయ్యో చేతిలో పెట్టటం మరో ముచ్చట. ఇంటికొచ్చిన నాన్న తన బంగారు కూతురు పూల జడతో కళకళలాడుతూ కనిపించేసరికి అనురాగం ΄పొంగుకొచ్చి ఏం అడిగినా కొని పెట్టేస్తాడు. ఫొటో తీయించి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో అందరికీ కనిపించేలా ప్రదర్శనకు పెడతాడు. ఈ తతంగం అంతా చూసిన కొందరు తల్లులు వారికి ఆడపిల్లలు లేకనోయినా పిల్లలు మగవాళ్లయినా సరే, బారెడు జుట్టు ఉందని పూలజడలు వేసి ఫొటోలు తీయించి పెద్దయ్యాక చూపించటం, వీళ్లేమో సిగ్గుపడుతూ వంకర్లు తిరగటం... ఇప్పుడు ఆ పూలూ లేవు... ఆ ముచ్చటా లేదు.
(చదవండి: ఇల్లు చిన్నగా ఉంటేనే బెటర్ : ఓ తల్లి చెబుతున్న నమ్మదగిన వాస్తవాలు)