సృష్టిలో ప్రతి జీవరాశి తన మనుగడను కొనసాగించడానికి శక్తి అత్యవసరం. ఈ శక్తి ప్రధానంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా మానవాళికి అవసరమైన పోషకాలు పంటలు, పశుసంపద ద్వారా లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి.
పశువైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ‘పశు వైద్యులు– ఆహార ఆరోగ్య సంరక్షకులు’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవటం అత్యంత సముచితం.
పశు సంపద ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోషక అవసరాల నేపథ్యంలో పశు వైద్య రంగం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది.
మన పూర్వీకులు పశువులను, ప్రకృతిని సమానంగా గౌరవించి, పర్యావరణహితమైన విధానాలతో వ్యవసాయం, జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమతుల్య జీవన విధానాన్ని మళ్లీ ఆచరిస్తే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితం అందించవచ్చు.
ఆరోగ్యంపై సమగ్ర దృక్పథం
పశువైద్యం కేవలం జంతువుల వైద్యంతో పరిమితం కాకుండా.. మనుషుల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు అంతా ఒక్కటే (వన్ హెల్త్) అనే సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది.
ఈ మూడూ పరస్పరం అనుసంధానమైనవి. పశువైద్యులు పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడటమే కాకుండా పరోక్షంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే పశువులకు చికిత్స ఇచ్చేటప్పుడు మందుల అవశేషాలు పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం.
సంక్రమిత వ్యాధుల నియంత్రణ
పశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు: రేబీస్, బ్రూసెల్లోసిస్, టీవీ వంటివి. ప్రస్తుతం గుర్తించిన సంక్రమిత వ్యాధులలో సుమారు 60% జంతువుల ద్వారా వ్యాపిస్తున్నాయి.
ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వస్తున్నాయని అంచనా. అరణ్య ప్రాంతాలలో మానవ జోక్యం పెరగటం ఈ వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పశువైద్యులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటి. అనవసరంగా, అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ఆహారంలో అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పశువైద్యులు బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని ప్రోత్సహించాలి.
పశుసంపద సుస్థిర ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) అంచనాలప్రకారం, ప్రపంచానికి అవసరమైన ప్రోటీన్‌లో సుమారు 30–40% జంతువుల నుంచి లభిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం సుమారు 20% ఆహారం పశువ్యాధుల వల్ల కోల్పోతున్నాం. పశువుల విసర్జితాల పునర్వినియోగం ద్వారా సేంద్రియ వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం వర్థిల్లుతుంది. తద్వారా పర్యావరణం, పశువులు, మనుషుల మధ్య సమన్వయంతో ఆహార గొలుసును కాపాడుకోవచ్చు.
14.5% వరకు పశువుల ఉద్గారాలు
ప్రస్తుతం పశువైద్య రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు వాతావరణ మార్పు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 14.5% హరిత గృహ ఉద్గార వాయువులు పశుసంపద నుంచి వెలువడుతున్నాయని అంచనా.
దీర్ఘకాలిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే 10–15% వరకు పశువుల పెరుగుదల, వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. అయితే, పశుసంపద మనకు ముఖ్యమైన ప్రోటీన్ వనరుగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పశువైద్యులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే పద్ధతులు, సుస్థిర పశుసంవర్ధన విధానాలు, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్బన్ మార్కెట్‌లో భాగస్వామ్యం కల్పించడం కూడా ఒక ముఖ్య లక్ష్యం.
మీథేన్ ఉద్గారాలు
ప్రపంచంలో అత్యధిక పశుసంపద కలిగిన దేశం మనదే. ఎఫ్‌ఏఓ, ఐసీఏఆర్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం హరిత గృహ వాయువు ఉద్గారాల్లో సుమారు 14–16% వ్యవసాయం నుంచి వెలువడుతుంటే, అందులో పశుసంపద ఉద్గారాల వాటా 55–60%. పాల ఉత్పత్తిలో దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో వ్యవసాయ ఉద్గారాల్లో పశుసంపద వాటా 30–35%గా ఉంది.
ముఖ్యంగా డెయిరీ రంగంలో గేదెల ద్వారా ఎక్కువ మీథేన్ వెలువడుతోందని అంచనా. నెమరు వేసేటప్పుడు జీర్ణప్రక్రియ వల్ల వెలువడే మీథేన్ పశు ఉద్గారాల్లో 85%ను ఆక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే వ్యవసాయ ఉద్గారాలలో పశుసంపద ఉద్గారాల వాటా 25–30%. తెలంగాణలో గొర్రెలు, మేకల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఉద్గారాల తీరు భిన్నంగాఉంటుంది. తెలంగాణ ఎస్‌ఏపీసీసీ చెబుతున్న దాని ప్రకారం మీథేన్ ఉద్గారాలు పశువుల నుండే ఎక్కువ వెలువడుతున్నాయి.
ముఖ్యమైన విశేషాలు
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో పశుసంపద ఎక్కువ. కానీ తక్కువ. కానీ, ముఖ్యంగా ఒక్కో పశువు తలసరి ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% మన దేశంలోనే ఉంది. ఈ కారణంగా మొత్తం ఉద్గారాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి క్రమంలో వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది.
పశువైద్యులు కేవలం జంతువుల వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వన్ హెల్త్ దృక్పథంతో పశువైద్యులు సమగ్ర సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పశు వైద్యులు– ఆహార, ఆరోగ్య సంరక్షకులు’ అనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.
– డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు
(99122 92229),
అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్),
ఏరియా వెటర్నరీ ఆసుపత్రి,
జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా.
saii@doctor.com
(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!)


