ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు కూడా అత్యంత అందుబాటులో ఉండే పండు అరటి పండు. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యధికంగా ఎగుమతయ్యే పండు అరటి పండు. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి అరటి పంట జీవనాధారంగా నిలిచింది. దీన్ని సాగు చేసి విక్రయించి ఆదాయాన్ని పొందుతున్న రైతులు కొందరైతే... అరటి ఉత్పత్తులనే దైనందిన ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఆధారపడుతున్న వారు మరికొందరు. ప్రపంచ అరటిపండు దినోత్సవం ప్రతి ఏప్రిల్ నెల మూడో బుధవారం జరుపుకుంటున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు తింటున్న, ఎగుమతి చేస్తున్న పండ్లలో అరటి ఒకటి. పండుగా తినటమే ఎక్కువ. పచ్చి కాయను కూరగా వండి లేదా కాల్చి లేదా పిండి చేసి నిల్వచేసుకొని దైనందిన ఆహారంగా తినే దేశాలూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పరిమాణ పరంగా మొదటి పది ప్రధాన పంటల్లో అరటి ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచ అరటి పరిశ్రమ విలువ సంవత్సరానికి సుమారు 2,500 కోట్ల డాలర్లు. ఆహార భద్రత, పౌష్టికత, గ్రామీణాభివృద్ధిలో అరటి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
150కి పైగా దేశాలలో అరటిని పండిస్తారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల, ఆహార కొరత ఉన్న దేశాల్లో రోజువారీ ముఖ్యమైన ఆహారంగా అరటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, లక్షలాది మంది చిన్న రైతులకు వాణిజ్య పంటగా కీలకమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా అరటి ఆర్థిక వ్యవస్థ సుమారు 40 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి దోహదం చేస్తోందని అంచనా.
అరటి తోటల్లో లక్షలాది మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి దొరుకుతోంది. ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్‌లో పరోక్ష ఉద్యోగాలు పొందే వారు చాలా మంది ఉన్నారు. ఉత్పత్తి చేసే దేశాల్లోనే కాకుండా అరటి ఆధారిత పరిశ్రమ ముడిసరుకుల తయారీ నుండి అంతర్జాతీయ రవాణా, ఓడరేవు సేవలు, టోకు మార్కెట్లు, చిల్లర మార్కెట్ల వరకు ప్రపంచ అరటి విలువ గొలుసు అంతటా ఎంతో మందికి అరటి ఉపాధిని కల్పిస్తోంది.
ప్రపంచ అరటి పండ్ల ఉత్పత్తి గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2023 నాటికి ఇది 13.93 కోట్ల టన్నులకు చేరుకుంది. భారతదేశం, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈక్వెడార్ అగ్రగామి అరటి ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. అధిక శాతం అరటిపండ్లు స్థానికంగా వినియోగించబడుతుంటాయి. సుమారు 15 శాతం అంతర్జాతీయ వాణిజ్యంలోకి ప్రవేశిస్తున్నాయి.
2024 నాటికి ప్రపంచ ఎగుమతులు 19.7 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ప్రపంచ నికర అరటిపండ్ల ఎగుమతులలో దాదాపు 80 శాతం వాటాతో ఈక్వెడార్, ఫిలిప్పిన్స్, కోస్టారికా, గ్వాటెమాల, కొలంబియా అగ్రగామి ఎగుమతి దేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా, చైనా, రష్యా, జపాన్ అతిపెద్ద దిగుమతి మార్కెట్లుగా కొనసాగుతున్నాయి.
అరటి సాగులో భారత్ వాటా29%
ప్రపంచ అరటి ఉత్పత్తిలో 25–29% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో అరటి తోటల సాగు విస్తారంగా ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 1993లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జాతీయ అరటి పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పింది. ఈదురుగాలులకు అరటి తోటలు కూలిపోవటం రైతులకు అపారమైన నష్టాన్ని కలిగిస్తోంది. ఈ సమస్యను అధిగమించటానికి జీ9 మాదిరిగా అధిక దిగుబడినిచ్చే పాటి అరటి రకాన్ని ఈ కేంద్రం ఇటీవలే రూపొందించటం విశేషం.
వెయ్యికి పైగా అరటి రకాలు
ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అరటి రకాలు ఉన్నాయని అంచనా. అయితే, ప్రపంచ ఎగుమతులలో ప్రధానంగా ‘కావెండిష్’ అరటి పండు రకానిదే ఆధిపత్యం. మన దేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తూ విరివిగా విక్రయిస్తున్న గ్రాండె నైన్ (జీ9) రకం దీనికి సంబంధించినదే. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు, ప్రధాన ఎగుమతి రకం గ్రోస్ మిషెల్.
రుచికి మరియు రవాణాలో తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, ఫ్యూసేరియం విల్ట్ రేస్ 1 అనే మట్టి ద్వారా వ్యాపించే శిలీంధ్రపు తెగులు మహమ్మారిగా మారి లాటిన్ అమెరికా అంతటా గ్రోస్ మిషెల్ తోటలను నాశనం చేసింది. దీంతో ఆ తెగులును తట్టుకోగల కావెండిష్ రకాల వైపు మళ్లవలసి వచ్చింది.
కావెండిష్ అరటిపండ్లు సాగులోకి వచ్చిన కొద్ది కాలంలోనే అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రాధాన్యత గల ఎంపికగా మారాయి. అధిక దిగుబడి, ఏకరీతి రూపం, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం, సుదూర ప్రాంతాలకు రవాణాలో తట్టుకునే శక్తి, స్పష్టమైన పక్వ లక్షణాలే ఇందుకు కారణాలు. నేడు ప్రపంచ అరటి ఎగుమతులలో 90 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా కావెండిష్ అరటి పండ్లదే. అయినప్పటికీ, కావెండిష్ రకంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అరటిపండ్లు సాగులో ఉన్నాయి.
ఇవి స్థానిక ఆహారపు అలవాట్లు, మార్కెట్లు, సంస్కృతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో వంటకు ఉపయోగించే రకాలు (ప్లాంటైన్లు, ఇతర పిండి పదార్థాలు అధికంగా ఉండే అరటిపండ్లు), పండించి తినే అనేక ఇతర రకాల అరటి రకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైన వ్యవసాయ లక్షణాలు, పోషక ప్రయోజనాలు, గుణాలను కలిగి ఉండి జీవవైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కొత్త రకాల అభివృద్ధి
అరటిపండ్లు ఆగ్నేయాసియాలో ఉద్భవించాయి. అడవి అరటిపండ్ల సహజ సంకరీకరణ వలన ఆ ప్రాంతంలో, పసిఫిక్‌లో వాటిని తొలుత సాగు చెయ్యటం ప్రారంభమైంది. అన్ని అరటిపండ్లు ముసేసి కుటుంబంలోని మూసా ప్రజాతికి చెందినవి, ఇందులో ఎన్సెటే, ముసెల్లా ప్రజాతులు కూడా ఉన్నాయి. కాలక్రమేణా కొత్త రకాల అభివృద్ధి జరిగింది. తోటల సాగు, పోషకాల అవసరాలు, పంటకోత అనంతర సవాళ్లను పరిష్కరించడానికి మెరుగైన రకాలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విస్తృత శ్రేణిలో ప్రజనన (బ్రీడింగ్) ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అరటి, ప్లాంటైన్ ప్రజనన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలలో ఫ్యూసేరియం విల్ట్ ట్రాపికల్ రేస్ 4 (టిఆర్4), బ్లాక్ సిగాటోకా (మైకోస్ఫెరెల్లా ఫిజియెన్సిస్), ఎల్లో సిగాటోకా (సూడోసెర్కోస్పోరా ముసే), బనానా బంచీ టాప్ వైరస్ (బీబీటీవీ) వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే రకాలను అభివృద్ధి చేస్తున్నారు.
అరటి ప్రజనన కార్యక్రమాలు కరువు, లవణీయత, తీవ్ర ఉష్ణోగ్రతలు వంటి ఒత్తిళ్లను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన, నాణ్యమైన రకాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూపొందిస్తున్నాయి. తద్వారా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో స్థిరమైన దిగుబడిని పొందటం సాధ్యపడుతుంది. పండ్ల నిల్వ కాలాన్ని పొడిగించడం, ఎంజైమాటిక్ బ్రౌనింగ్‌ను తగ్గించడం, పండ్ల దృఢత్వాన్ని, నిర్వహణ నష్టాన్ని తట్టుకునే శక్తిని పెంచడం ద్వారా కోత అనంతర సమస్యలను తగ్గించటంపై కూడా దృష్టి సారిస్తున్నారు.
అదే సమయంలో, విటమిన్ ఎ, ఇనుము, జింక్‌తో బయోఫోర్టిఫికేషన్ ద్వారాపోషకాలను పెంచుతున్నారు. అలాగే అరటిపండ్లు, కూర అరటి రకాల నాణ్యతను మెరుగుపరచడానికి పిండిపదార్థం, చక్కెర కూర్పును సరిచేయడంపై కూడా ఈ ప్రజనన కార్యక్రమాలు దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో, మారుతున్న మార్కెట్, వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి మెరుగైన రుచి, ఆకృతి, ప్రాసెసింగ్ అనుకూల లక్షణాలతో కూడిన రకాలను అభివృద్ధి చేయడం కూడా జరుగుతోంది.
ఒకే రకం సాగుతో ముప్పు
ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు అరటి పంటపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవనోపాధి కోసం, ఆహార భద్రత కోసం లక్షలాది మంది ఆధారపడే అరటి పంట ఉత్పత్తి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకే రకంపై ఎక్కువగా ఆధారపడటం, అరటిలో అంతర పంటలు వెయ్యకుండా ఏక పంట సాగుపై ఆధారపడటం వల్ల అరటి తోటల సాగు పర్యావరణ పరంగా, చీడపీడల పరంగా ఒత్తిళ్లకు గురవుతోంది. అదేవిధంగా మార్కెట్‌లో ఎదురయ్యే ఒడిదుడుకులు అరటి రంగాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.
కావెండిష్ అంటే జీ9 రకం ఒక్కదాన్నే సాగు చెయ్యటం మానుకోవాలని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రచారం చేస్తోంది. ‘అరటి రకాల్లో ఇప్పటికీ విస్తృతంగా సాగు చెయ్యని అపారమైన వ్యవసాయ వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యపూరిత రకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. స్థానిక మార్కెట్లలో అత్యంత ప్రజాదరణ పొంది, సాగు జరిగే ప్రాంతాల్లోని సాంస్కృతిక వారసత్వంలో భాగమైనవైనప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్య అవసరాలకు మనం ఇచ్చిన ప్రాధాన్యం రీత్యా మరుగునపడ్డాయి.
ఈ అరటి రకాలను తిరిగి సాగులోకి తేవాలి. ఉదాహరణకు.. మైసూరు అరటి రకం. ఈ సంప్రదాయ రకాలు అరటి తోటల్లో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. చీడపీడలను, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవటంలో అరటి రంగం సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త మార్కెట్ అవకాశాలను తెరవడానికి ఈ స్థానిక రకాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ విషయాలను ప్రచారంలోకి తేవాల’ని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది.
అరటి సాగులో సవాళ్లు
అంతర్జాతీయంగా అరటి పంట బాగోగులు, తీరుతెన్నులను పరిశీలిస్తూ ప్రపంచ దేశాలకు తగిన సూచనలు ఇచ్చే సంస్థ ప్రపంచ అరటి ఫోరమ్. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటు చేసిన ఈ ఫోరం ఏమంటోందంటే? ‘ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతి అయ్యే తాజా పండ్లు అరటి పండ్లే.
సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల డాలర్లు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వేలాది గ్రామీణ కుటుంబాలకు అరటి పండ్లు ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. అయితే, అరటి సాగులో వ్యవసాయ రసాయనాలపై అధికంగా ఆధారపడటం, రైతుల చేతికందే ఆదాయం బాగా తగ్గటంతోపాటు గణనీయమైన పర్యావరణ, సామాజిక సవాళ్లు తలెత్తాయి. సంబంధిత వర్గాలన్నీ చురుకుగా సహకరించుకుంటేనే వీటిని సమర్థవంతంగా పరిష్కరించగలం’.
– నిర్వహణ:
పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
(చదవండి: రైతమ్మల గెలుపుకి.. సాంకేతిక సామాజిక స్ట్రాటజీ..)


