విజేతలు రైతమ్మలు.. | sagubadi: Why Women Farmers Are Key to Climate Resilience | Sakshi
Sakshi News home page

రైతమ్మల గెలుపుకి.. సాంకేతిక సామాజిక స్ట్రాటజీ..

Apr 10 2026 5:50 PM | Updated on Apr 10 2026 6:04 PM

sagubadi: Why Women Farmers Are Key to Climate Resilience

మహిళా రైతులకు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని సమర్థవంతంగా, సుస్థిరంగా పెంపొందించే పద్ధతులపై అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) పరిశోధకుల బృందం అధ్యయనం నిర్వహించింది. ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సస్టైనబుల్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ పత్రికలో ఇటీవల ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, మన మహిళా రైతులు నిజమైన వాతావరణ మార్పులను తట్టుకునే శక్తియుక్తులను పెంపొందించుకోవాలంటే వారికి ఏవో కొన్ని సాంకేతికతలను ఉన్నత స్థాయి నుంచి అందించటం ఒక్కటే సరిపోదు. వారికి సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేసి అందించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. భారత దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో విభిన్న కేస్‌ స్టడీలను ఐఆర్‌ఆర్‌ఐ విశ్లేషించి ఈ విషయాన్ని నిర్థారించింది. ఆ వివరాలు చూద్దాం...

వాతావరణ సంక్షోభం దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయం చేసే కోట్లాది మంది మహిళలను కూడా ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ రంగంలో అహరహం శ్రమించటంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మహిళా రైతులు అడుగడుగునా ‘లింగ–వివక్ష’ను ఎదుర్కొంటున్నారు. వారు అధిగమించాల్సిన సామాజిక అడ్డంకులను పరిగణనలోకి తీసుకోకుండా, వారికి కొత్త సాంకేతికతతో కూడిన పనిముట్లను అందించటం వల్ల ప్రయోజనం ఉండటం లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. 

ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సస్టయినబుల్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ పత్రికలో ఇటీవల ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిజంగా ఉపయోగపడే సామర్థ్యాలను మనం పెంపొందించుకోవాలంటే, విడివిడి సాంకేతికతలను అందించడం ఆపి, అనేక ఆవిష్కరణలను కలిపి గంపగుత్తగా అందించడం ప్రారంభించాలి. ఎక్కడో ఉండే నిపుణులు తమకు తోచినట్లు సిద్ధం చేసిన సాంకేతికతను రైతుకు బదిలీ చేసే సాంప్రదాయ అధికార కేంద్రీకృత వ్యవసాయ విస్తరణ నమూనా మహిళా రైతుల విషయంలో విఫలమవుతోందని ఈ పరిశోధన తేల్చింది. 

దానికి బదులుగా, సామాజిక పరిస్థితులు, అవసరాల ఆధారిత సాంకేతిక విధానాన్ని అమలు చెయ్యాలని సూచించింది. అంటే, విత్తనం లేదా ట్రాక్టర్‌ కేవలం మహిళా రైతులకు, పురుష రైతులకు ఒకేలా ఉపయోగపడే ఒక తటస్థ సాంకేతికత కాదని గుర్తించడం.. సామాజిక సంబంధాలు, సాంస్కృతిక నియమాలు, ఆ సమాజంలోని సంస్థాగత అధికార స్థితిగతులపై దాని విజయం ఆధారపడి ఉంటుందని గుర్తించటం అవసరమని అధ్యయనం పేర్కొంది. ఈ భావనను నిరూపించడానికి అధ్యయనంలో భాగంగా ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు భారతదేశవ్యాప్తంగా నాలుగు విభిన్న కేస్‌ స్టడీలను విశ్లేషించారు. సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేయడం ద్వారా మహిళా రైతులు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వైపు సమర్థవంతంగా, సుస్థిరంగా ఎలా మారగలరో ఈ అధ్యయనం వెల్లడించింది.  

విజ్ఞాన శాస్త్రం, భూ హక్కులపై అవగాహనతో చౌడుపై పోరాటం
గుజరాత్‌లోని భావనగర్‌ ఉప్పునీటి చిత్తడి నేలల్లో పర్యావరణ ఒత్తిళ్లు, సామాజిక అసమానతలు విడదీయరానివని ఉత్థాన్‌ అనే సంస్థ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా) గుర్తించింది. ఈ ప్రాంతంలోని మహిళలు నేల లవణీయతతోను, చట్టపరమైన భూమి హక్కుల లేమితో కూడా పోరాడుతున్నారు. భూమి హక్కులు లేకపోవడంతో వారు ప్రభుత్వ రుణాలను లేదా దీర్ఘకాలిక వ్యవసాయ వనరులను సులభంగా పొందలేకపోతున్నారు. 

ఉత్థాన్‌ రూపొందించిన నూతన ఆవిష్కరణల ప్యాకేజీ ప్రత్యేకమైనది. ఇది నేల పరీక్ష, సేంద్రియ ఎరువులు వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను, సామాజిక–చట్టపరమైన సాధికారతతో జత చేసింది. బ్లాక్‌–స్థాయి రెవెన్యూ కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు తోడ్పడే ‘కృషి సఖు’లు (మహిళా సామాజిక రిసోర్స్‌ పర్సన్లు), పారాలీగల్‌ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పారాలీగల్‌ కార్యకర్తలు భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చిక్కుముడులను అధిగమించడంలో మహిళా రైతులకు సహాయపడ్డారు. 

కృషి సఖులు ప్రామాణిక పంటల సాగు పద్ధతులన్నిటినీ బోధించారు. ఈ విధానం ఒక ‘సోదరభావాన్ని‘ సృష్టించింది. దీనిలో మహిళలు తమ తోటివారి నుంచి నేర్చుకున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు, వారిపై వారి భర్తలకున్న విశ్వసనీయతను గణనీయంగా పెంచింది.

ఆవాల కోసం అనుభవజ్ఞానాన్ని, మార్కెట్లను నిర్మించటం
ఉత్తర ప్రదేశ్‌లోని ఉత్తర మైదాన ప్రాంతాల్లో గ్రామీణ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఎఫ్‌ఐ) నీటి ఒత్తిడిని తట్టుకునే, పోషకాలు అధికంగా కలిగి ఉండే ‘పూసా మస్టర్డ్‌ 30’ అనే బయోఫోర్టిఫైడ్‌ ఆవాలు రకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఒక మహిళ తన పంటను సరసమైన ధరకు అమ్ముకోవడానికి మార్గం లేనప్పుడు, కేవలం మెరుగైన విత్తనాన్ని అందించడం నిరుపయోగమని పరిశోధకులు పేర్కొన్నారు. 
జీఎఫ్‌ఐ ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. 

ఈ విత్తనాలతో పాటు ఇతర ఆవిష్కరణల ప్యాకేజీని కలిపి అందించటంపై దృష్టి సారించింది. వారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీల) ద్వారా మార్కెట్‌ అనుసంధానాలతోపాటు సాంకేతిక శిక్షణ ఇప్పించారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి అవగాహన పర్యటనలను నిర్వహించడం ద్వారా, వారు శాస్త్రీయ నైపుణ్యాన్ని రైతులు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 

తద్వారా మహిళా రైతులు నిపుణులతో నేరుగా సంభాషించడానికి వీలు కలిగింది. ఈ మార్కెట్‌ అనుసంధానాలను కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీల ద్వారా ఏర్పడిన సామూహిక భాగస్వామ్యం మహిళా రైతులకు బలాన్నిచ్చింది. మహిళలు తమ ఇళ్లలో, సమాజాలలో తమ అభిప్రాయాలను మరింత స్పష్టంగా వ్యక్తపరచడానికి ఈ సాధికారత సహాయపడింది.

ముందడుగు ఎలా?
మహిళా రైతుల సాధికారత కృషిలో సజావుగా ముందుకు సాగాలంటే మనం తప్పక చేయవలసినవి ఇవేనని ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు: 

ఎంత సమయం?: 
అమల్లోకి తెచ్చే సేంద్రియ వ్యవసాయం వంటి నూతన వ్యవసాయ సాంకేతికతలు ఒక మహిళా రైతు వెచ్చించే సమయాన్ని, శ్రమను ఎలా ప్రభావితం చేస్తాయో క్రమపద్ధతిలో అంచనా వేయాలి. 

అందరికీ భాగస్వామ్యం: ఇంటి బాధ్యతలను పునఃపంపిణీ చేయడానికి పురుషులను భాగస్వాములను చేసే లింగ పరివర్తన విధానాలను అవలంబించాలి. 

వ్యవస్థకు మద్దతు: భూమి హక్కులు, మార్కెట్‌ అందుబాటు, స్వయం సహాయక బృందాలు వంటి సామూహిక వేదికలలో సాంకేతికత వేరూనుకునేలా చెయ్యాలి. 

సాంకేతిక, సంస్థాగత అంశాలతో సామాజిక అంశాలను అనుసంధానించడం ద్వారా, తదుపరి తరం వాతావరణ అనుకూల వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక సాధనాలు కేవలం ఒక షెడ్డుకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆహార భద్రతకు వెన్నెముక అయిన మహిళలకు వాస్తవంగా సాధికారత కల్పించేలా నిర్థారణగా చెయ్యొచ్చు.  

పరిశోధకులు చెప్పినట్లుగా, ‘వ్యవస్థాగత ఏర్పాట్లు (సంస్థలు, పంపిణీ యంత్రాంగాలు, ప్రోత్సాహకాలు), సామాజిక సంబంధాలు (నియమాలు, గుర్తింపులు, శ్రమ పంపిణీ, సామాజిక అభ్యసనం) ఏకకాలంలో రూపాంతరం చెందినప్పుడు మాత్రమే సుస్థిరమైన ఆవిష్కరణ ఆవిర్భవిస్తుంది’.  

తోటివారి నుంచి నేర్చుకోవటం 
ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, తోటి వారి నుంచి నేర్చుకోవడం ఎంత ప్రభావవంతంగా ఉందో తేలింది. అన్ని సందర్భాల్లోనూ, తమలాంటి వారు విజయం సాధించడాన్ని చూసినప్పుడు రైతులు ఆ కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి ఎక్కువ మొగ్గు చూపారు.  

గుజరాత్‌లో తమ భార్యలైన మహిళా రైతులు అమలు చేసిన ప్రత్యేక సాగు పద్ధతుల వల్ల కలిగిన స్పష్టమైన ఫలితాలను కళ్లారా చూసిన పురుషులు, తొలుత సందేహాలు లేవనెత్తినా, చివరికి వారికి మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు తాను పాల్గొనే సమావేశాలను పట్టించుకోని తన భర్త, చివరికి ఆమెతో ‘ఇంటి పనుల గురించి చింతించకు.. నీ సమావేశంపై దృష్టి పెట్టు’ అని చెప్పినట్లు ఒక మహిళా రైతు సంబరంగా గుర్తుచేసుకుంది. నమ్మకాన్ని పెంపొందించటం, సామూహిక కార్యాచరణ, నాయకత్వ శిక్షణ వంటి సామాజిక మద్దతు వల్లనే ఈ సాంకేతికతలు వేళ్లూనుకోవడానికి దోహదపడింది. 

భవిష్యత్తు వైపు చూస్తూ...
వాతావరణ మార్పులను దీటుగా తట్టుకొని నిలిచే ‘క్లైమేట్‌ స్మార్ట్‌’ వ్యవసాయం నిజంగా ‘స్మార్ట్‌’గా ఉండాలంటే, దానిని స్థానిక సమాజంతో కలిసి ఏమేమి చెయ్యాల్లో ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని ఈ అధ్యయనం నిర్ధారించింది. దీనికి కేవలం సాంకేతికతను బదిలీ చేసి చేతులు దులుపుకోవటం నుండి, మహిళల అనుభవాలను పరిగణనలోకి తీసుకునే సహాయక వ్యవస్థలను జోడించడం వైపు మార్పు రావటం అవసరం.

విభిన్న పంటల సాగు నిర్ణయాలు
మహారాష్ట్రలోని ధరాశివ్‌ కరువు ప్రాంతంలో స్వయం శిక్షణ ప్రయోగ (ఎస్‌ఎస్‌పీ) స్వచ్ఛంద సంస్థ మహిళల నేతృత్వంలో వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలిచే వ్యవసాయ నమూనా పద్ధతులను అమలు చేయించింది. ఈ ప్రాజెక్ట్‌ విప్లవాత్మకమైనది. ఎందుకంటే ఇది అధిక పెట్టుబడి అవసరమయ్యే వాణిజ్య పంటల నుంచి రైతుల దృష్టిని ఉద్దేశపూర్వకంగా మళ్లించింది. తక్కువ నీటి వినియోగానికి సంబంధించి స్థానికంగా అమల్లో ఉన్న పద్ధతులను ఉపయోగించి చిరుధాన్యాలు, కూరగాయల వంటి వైవిధ్యభరితమైన ఆహార పంటల వైపు మళ్లించింది.  

మహిళా రైతులకు రైతుగా ఉండాల్సిన మౌలిక గుర్తింపు సమస్యను పరిష్కరించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. మహిళలను వ్యవసాయ నిర్ణయాలు తీసుకునే ప్రాథమిక నిర్ణయాధికారులుగా, ఆవిష్కర్తలుగా నిలబెట్టింది. కేవలం కూలీలుగా మిగిలిపోయిన వారిని వ్యవసాయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే మహిళా రైతు నాయకులుగా మారడానికి సహాయపడింది. నాయకత్వ శిక్షణ ఇచ్చారు. సూక్ష్మ పెట్టుబడుల కోసం కమ్యూనిటీ రిసైలియన్స్‌ ఫండ్‌ ఏర్పాటు జరిగాయి. 

రైతులు –స్థానిక ప్రభుత్వ అధికారుల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు మహిళా కృషి సంవాద్‌ సహాయకుల(కేఎస్‌ఎస్‌ల)ను నియమించారు. ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మహిళలు ఆహార పంటల ఉత్పాదకతలో 10–15% పెరుగుదల సాధించారు. దీనితో పాటు మహిళా రైతు కుటుంబాల నెలవారీ పొదుపు బాగా పెరిగింది. ఇది ఇంట్లో వారి మధ్య సంబంధాలను మార్చివేసింది. పురుషులు తమ భార్యలను తమతో పాటు సమాన భాగస్వాములుగా గుర్తించటం ప్రారంభించారు.

సమ్మిళిత శిక్షణా విధానం
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు గంగా మైదాన ప్రాంతంలో పనిచేసే సత్మిలే సతీష్‌ క్లబ్‌ ఓ పాతాగర్‌ (ఎస్‌ఎస్‌సీఓపీ) స్వచ్ఛంద సంస్థ ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయం అమలులో ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులపై దృష్టి సారించింది. సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ వ్యవస్థ సాంద్రతీకరణ (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఎస్‌ఐ) ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దుక్కి చెయ్యకుండా వ్యవసాయం చెయ్యటం, యంత్రంతో వరి నాట్లు, బహుళ పంటల విత్తనాలను విత్తే పరికరాలను వాడటం వంటి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టింది.  

ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్కువ దృష్టి పెట్టినప్పటికీ, దీనిలోని ఆడా మగా తేగా లేకుండా రైతులందరికీ శిక్షణ ఇచ్చే సమ్మిళిత శిక్షణా విధానం ఉపయోగపడింది. సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉండే భారీ యంత్రాలు వంటి రంగాలలోకి మహిళా రైతులు ప్రవేశించడానికి వీలు కల్పించింది. రైతులు తాము కొనుగోలు చేయలేని ఖరీదైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు వీలు కల్పించే కస్టమ్‌–హైరింగ్‌ కేంద్రాల వ్యాపార కార్యకలాపాలపై, ఎరువులను సమర్థవంతంగా వాడటం, నీటిపారుదలలో మెళకువలపై శిక్షణ ఇచ్చారు. 

పురుషులు ఎక్కువగా దృష్టి సారించే ఇటువంటి సాంకేతికతలలో మహిళలకు శిక్షణ ఇచ్చినప్పుడు, వారు సమాజంలో ఆదర్శప్రాయులుగా గుర్తింపు పొందారు. ఈ మహిళల్లో 80% కంటే ఎక్కువ మంది ఏయే రకాల పంటలు సాగు చెయ్యాలనే నిర్ణయాలలో తమ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు.

  • ఏవో కొన్ని సాంకేతికతలను పై నుంచి అందించటం ఒక్కటే సరిపోదు

  • వారితో కలిసి పనిచేస్తూ వారికి అవసరమైన నైపుణ్యాలను అందించాలి

  • సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును సమన్వయంతో అందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి∙

  • 4 రాష్ట్రాల్లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) జరిపిన అధ్యయనంలో వెల్లడి

పొంచి ఉన్న ప్రమాదాలు

మహిళా రైతుల సాధికారతలో ఈ విజయాలు సాధించినప్పటికీ, రకరకాల వ్యవసాయ సాంకేతికతలతో కూడిన ప్యాకేజీలను అమలు చేసిన విధానంలో ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు అనేక లోపాలను గుర్తించారు. ఈ ప్యాకేజీల ఏర్పాటు ఉద్దేశపూర్వకంగా కాకుండా తాత్కాలికంగా జరిగింది. సంస్థలు మొదట సాంకేతికతపై దృష్టి సారించాయి. అక్కడి రైతుల్లో సామాజిక మద్దతు పొందటాన్ని రెండో ప్రాధాన్యత గల ఆలోచనగా పరిగణించాయి. 

చదవండి: జీవన ఎరువులతో సేద్యానికి జీవం

వేతనం లేని సంరక్షణ పనుల భారం ఒక ప్రధాన ఆందోళన. మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టిన 60 శాతం ప్రాజెక్టుల వల్ల మహిళా రైతులకు కొత్త బాధ్యతలను జోడించడం ద్వారా వాస్తవానికి వారి పని–జీవిత సమతుల్యతను మరింత దిగజార్చాయని ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గుజరాత్‌లో కనిపించే సేంద్రియ వ్యవసాయం వాతావరణానికి అనుకూలమైనదే అయినప్పటికీ, జీవన ఎరువులు, వర్మీకంపోస్ట్‌ తయారీకి అధిక శ్రమ అవసరం. అప్పటికే ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చూసుకుంటున్న మహిళలపై ఈ ఎరువుల తయారీ పనులు మరింత భారాన్ని మోపుతుంది. 

అంతేకాకుండా, అంతర్లీనంగా ఉన్న పురుషాధికార నిర్మాణాలను పరిష్కరించకుండా, మహిళా రైతులకు పనులు పెంచే ఉపరితల ప్రయత్నాల వల్ల వారిని మరింత కృంగదీయటానికి దారితీసే ప్రమాదాన్ని ఈ అధ్యయనం ఎత్తి చూపింది. అనేక సందర్భాల్లో (ఎస్‌ఎస్‌పీ మినహా) పురుషులతో సంప్రదింపులు కొరవడ్డాయి. భర్తలు, కమ్యూనిటీ నాయకులు ఈ సంభాషణలో పాలుపంచుకోకపోతే, మహిళలు ఇంటా బయటా వారి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల శిక్షణలో పాల్గొనలేకపోవచ్చు.

– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement