జివిలిక చెట్టు పొదగానే ఉంటుంది. ఇది అరుదైన చెట్టు. మండలు దీని అడుగు భాగం నుండే వస్తాయి. అందువల్ల గుబ్బురుగా పొదలా అగుపిస్తుంది. దీని పూలు ఐదు పూరెమ్మెలతో తెల్లగా ఉంటాయి. పండ్లలో గింజలు 1–4 ఉంటాయి. ఇవి బఠాని గింజ మందం ఉండి పై తొక్క కాయ దశలో ఆకు పచ్చగా ఉండి, పండిన తరువాత గోధుమ రంగుగా మారుతుంది. కాయలపై నూలు పోగులు ఉంటాయి. అట్లే కొమ్మలు నున్నగా ఉంటాయి. దీనికి కూడా మందు మొక్కగా గుర్తింపు ఉన్నది. కానీ చాలా మందికి దీని విలువ అంతగా తెలియదు. కేవలం పశువుల కాపరులు, గిరిజనులకు మాత్రమే బాగా తెలుసు.
ఉనికి: జివిలిక పొదలు ఎక్కువగా ఉష్ణ మండలాల్లో కినిపిస్తాయి. ముఖ్యంగా ఈ జీనస్‌లో దాదాపు 40 జాతులు మన దేశంలో ఉన్నాయి. వీటిలో ఔషధ గుణాలున్నట్లు గుర్తింపు పొందిన వాటిలో జివిలిక కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాల్లో జివిలిక చెట్లు ఉన్నాయి. దీని స్వస్థలం ఇండియా, చైనా, మలేషియాగా అంచనా. శ్రీలంక, థాయిలాండ్, మైన్మార్, వియత్నాంలలో ఈ జివిలిక ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
ఉపయోగాలు: జివిలిక ΄పొదలు పెద్దగా ఉండవు. ఈ పొదల ఎత్తు 3–5 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇవి చెట్లుగా కనపడవు. గుబురుగా ఉంటాయి. వీటి ఆకులను మేకలు, ఒంటెలు, పశువులు తింటాయి. బరుగులను (మండలను) పొరకలుగా కట్టి బయలు ప్రదేశాల్లో ఊడ్చడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా రైతులు పొలాల్లో కళ్ళాలు కట్టేటప్పుడు ఈ మండలను కోసి పొరకలుగా కట్టి కళ్ళాల్లో ఊడ్చడానికి వినియోగిస్తారు.
ఈ పండ్లను తినొచ్చు. కండ తక్కువగా ఉన్నా రుచికరంగా ఉంటుంది. పై తొక్కను తీసి గింజపై ఉన్న గుజ్జును తినాలి. గింజ గట్టిగా ఉంటుంది. వీటి పూలగుత్తులు ప్రత్యేకంగా తేనెటీగలకు తేనేటి విందు చేస్తాయి. పెద్ద ఈగలు కూడా∙మకరందం కోసం వస్తుంటాయి.
పూలు అందంగా ఉండటం వల్ల అనేక కీటకాలు పూలకు ఆకర్షితమవుతాయి. జివిలికకు ఔషధ గుణాలు ఉండటం వల్ల దీన్ని ఆయుర్వేదంలో బాగా వాడుతారు. వీటి ఆకులను కంటి, ముక్కు రుగ్మతలకు వాడతారు. వీటి వేర్లను పేగుల సమస్యలను అరికట్టడానికి, కలరా, హైడ్రోఫోభియా, కిడ్నీల నొప్పులను, అర్శెలు, మొలలు తదితర సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు.
జివిలిక ఆకులను, పండ్లను దగ్గు, పొట్ట ఉబ్బరం, గర్భస్రావం, చనుబాల పెంపు, ప్లీహం పెరగటం, కంటి సమస్యలు, పైల్స్, కీళ్ళనొప్పులు తదితర సమస్యలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. వీటిలో ఆల్కలాయిడ్స్, ఫినోలిక్ కంపౌండ్స్, ఫ్లేవినాయిడ్స్, ప్రోటీన్స్, కామరిన్లు, స్టెరాయిడ్స్ మొదలగునవి ఉండటం వల్ల ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు.
జివిలిక పండ్లపై విశ్లేషణ చాలా తక్కువ. గ్రేనియ జాతుల వైవిధ్యం ఎంతో ఉంది. దీన్ని ఆసరా చేసుకుని పరిశోధనలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. జివిలిక పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నల్లమల అడవిలో జివిలిక పొదలు చాలా ఉంటాయి. ఇవి అడవులకే పరిమితం కాకుండా మైదాన ప్రాంతాలు, చిట్టడవుల ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. జీవిలిక పండ్లపై ప్రత్యేక పరిశోధనలు అంటూ ఏమి లేవు. వీటిపై దృష్టి సారించి, అధికంగా తినే విధంగా మార్చే ప్రయత్నాలు ఎంతైనా అవసరం. ఇప్పటికీ చెంచులు వీటిని రోగాలు, పుండ్లు మొదలగు సమస్యలను నిరోధించటానికి వాడతారు. వీటి ΄ోషక విలువలను గూర్చి పరిశీలన దొరకలేదు. ఇది ఎంతో ఉపయోగకరమైన అడవి పండ్ల జాతి అని నిస్సందేహంగా చెప్పచ్చు.
వివిధ భాషల్లో జువిలిక పండు పేర్లు
అస్సామీ: హుక్ష పట, క్షహట
ఇంగ్లిష్: క్రాస్ చెర్రి, వెరోనికలో లియా
ఒరియా: కకరోలిం
కన్నడ: ఉడిపె, డడచెలు, చిక్కుడిపె, గండౌడిపె
తమిళం: కలున్ను, తావిడు, తవడు, తవుట్టె
తెలుగు: చీమ చీపురు, జివిలిక, చిట్టిజాన, జివిలికె
బెంగాలీ: కుకుర్ బిచ
మరాఠీ: గౌలి
హిందీ: కుకురుండ, కుకుర్ బిచ, ప్రోంగ్లీ
సంస్కృతం: గుడ శర్కర, నాగబాలగంగెరుకి
పూత: మే – జులై పండ్లు: నవంబర్ – డిసెంబర్
డాక్టర్ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త,
ఐసీఏఆర్ – ఐఐఓఆర్,
రాజేంద్రనగర్, హైదరాబాద్.
మొబైల్: 94407 08924
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
ఇదీ చదవండి: గ్లోబల్ మార్కెట్‌లో కస్తూరి కాటన్ విప్లవం


