యాప్‌ ఆరోగ్యం సేఫ్‌! | The role of mobile health applications in Health and care | Sakshi
Sakshi News home page

యాప్‌ ఆరోగ్యం సేఫ్‌!

Jul 1 2025 3:22 PM | Updated on Jul 1 2025 3:29 PM

The role of mobile health applications in Health and care

హెల్తీ లైఫ్‌ కోసం వందల కొద్ది యాప్స్‌ 

ప్రెగ్నెంట్స్‌ మొదలు కార్డియాక్‌ కేర్‌ వరకు  అరచేతిలో సూచనలు.. 

అవసరమైతేనే డాక్టర్‌ వద్దకు 

వాడే యాప్‌ విశ్వసనీయత,  డేటా ప్రైవసీ తప్పనిసరి 

 అంతిమ నిర్ణయం ఎప్పుడూ వైద్యునిదే.. 

కాలం మారుతున్న కొద్దీ మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి ఇవన్నీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ, అనేక రంగాల్లో మార్పులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో టెక్నాలజీ తెచి్చన విప్లవాత్మక మార్పులు ఎంతో ఆశాజనకంగా మారాయి. ఒకప్పుడు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ అవసరం తగ్గిపోయింది. కేవలం స్మార్ట్‌ఫోన్‌ ఉంటే సరిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అంశాలను మనం ట్రాక్‌ చేయగలుగుతున్నాం. దీని వల్ల ఆరోగ్యంపై అవగాహన పెరగడమే కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది. – సాక్షి, సిటీబ్యూరో  

సాంకేతికత మన ఆరోగ్య సంరక్షణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అప్రమత్తతతో సరైన యాప్‌లను ఎంచుకొని ఉపయోగించుకుంటే, రోజువారీ జీవనశైలిలో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం చాలా సులభం. టెక్నాలజీ ఆధారంగా ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు ఒక శక్తివంతమైన సమాచారంగా మారుతోంది. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణకు మార్కెట్‌లో అనేక అనుసంధానిత యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వివిధ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.

హార్ట్‌ రేట్‌ మానిటర్, ఈసీజీ యాప్‌లు : హార్ట్‌ బీట్స్‌ను ట్రాక్‌ చేయడం, ఏవైనా అసాధారణ పరిస్థితులు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడం ఈ యాప్‌ల ద్వారా సాధ్యమవుతుంది. ఉదాహరణకు కార్డియా మొబైల్, వెల్ట్రాయ్‌ వంటి యాప్‌లు ఇంటి వద్ద నుంచే గుండె పనితీరును గమనించేందుకు తోడ్పడుతున్నాయి.

 స్కిన్‌ కేర్‌ అనలైజర్‌ యాప్స్‌ : నిద్రలేమి, కాలుష్య వాతావరణ ప్రభావం వంటి వాటి వల్ల ఏర్పడే చర్మ సమస్యలను అంచనా వేసి, తగిన చిట్కాలు అందించే యాప్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. స్కిన్‌ విజన్, ట్రోవ్‌ స్కిన్‌ వంటి యాప్‌లు అందులో ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి. 

ఉమెన్‌ హెల్త్, ప్రెగ్నెన్సీ ట్రాకర్స్‌ : గర్భిణుల ఆరోగ్యానికి సంబంధించి ప్రతి దశనూ గమనిస్తూ, తగిన ఆహారం, వ్యాయామ సూచనలు, నిద్ర పద్ధతులు వంటి విషయాల్లో దారి చూపించే యాప్‌లు ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. బేబీ సెంటర్, ఫ్లో, ఒవియా ప్రెగ్నెన్సీ వంటి యాప్‌లు మహిళల ఆరోగ్య సహచరులుగా మారాయి. 

మెంటల్‌ వెల్నెస్‌ యాప్స్‌: మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యానికంతే ముఖ్యం. ఈ అవసరాన్ని గుర్తించి కామ్, హెడ్‌ స్పేస్, మైండ్‌ హౌస్‌ వంటి యాప్‌లు ధ్యానం, బ్రీథింగ్‌ టెక్నిక్‌లు, అనువైన నిద్ర కోసం ఉపాయాలను అందిస్తున్నాయి. 

డైట్‌ – ఫిట్నెస్‌ ట్రాకర్స్‌ : ఆరోగ్యకరమైన జీవనశైలికి సరైన ఆహారం, శారీరక చురుకుదనం అవసరం. మై ఫిట్నెస్‌ పాల్, హెల్తిఫై మీ, ఫిట్టర్‌ వంటి యాప్‌లు రోజువారీ కేలరీలు, వ్యాయామం, నీటి మోతాదు మొదలైన వాటిని ట్రాక్‌ చేస్తాయి. ఇలాంటి యాప్స్‌ వల్ల ఉపయోగాలు.. ‡ సులభతరం : యాప్‌ల ద్వారా వైద్యుడు వద్దకు వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. 

సకాలంలో హెచ్చరికలు: కొన్ని యాప్‌లు ఆరోగ్య సూచీలను విశ్లేíÙంచి ప్రమాద సూచనలుగా అలర్ట్‌ చేస్తాయి. ‡ వ్యక్తిగత సమాచారం ఆధారంగా : ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని అనుసంధానం చేసుకుని యాప్‌లు ప్రత్యేకమైన మార్గదర్శకతను ఇస్తాయి. ‡ అనుసంధానం: ఫిట్‌నెస్‌ బ్యాండ్లు, స్మార్ట్‌వాచ్‌లు, డిజిటల్‌ బీపీ మానిటర్లు వంటి పరికరాలను యాప్‌తో అనుసంధానించి మరింత ఖచ్చితంగా డేటా పొందవచ్చు.

ఆరోగ్యపరమైన అలవాట్లకు : నిద్ర సమయం గుర్తుచేయడం, నీరు తాగమని రిమైండర్‌ చేయడం లాంటి చిన్న విషయాలు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. జాగ్రత్తలు కూడా అవసరమే.. 

నోట్‌: ఆరోగ్య యాప్‌ల వినియోగిస్తున్నప్పుడు కొన్ని విషయాలను గమనించాలి. ముందుగా, వాడే యాప్‌ విశ్వస నీయమైనదేనా? డేటా ప్రైవసీ ఎలా ఉంది? యాప్‌ ఇచ్చే సమాచారం వైద్యుని సలహాకు ప్రత్యామ్నాయంగా కాకుండా, తోడ్పాటు సాధనంగా ఉపయోగపడేలా ఉండాలి. ‘ఆరోగ్య సమస్యల విషయంలో తుది నిర్ణయం ఎప్పుడూ వైద్యునిదే కావాలి’.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement