పట్టు వదలని ఆమె ఇప్పుడు జట్టు కోచ్‌! | Rajwinder Kaur has been appointed coach of the Indian womens judo team | Sakshi
Sakshi News home page

పట్టు వదలని ఆమె ఇప్పుడు జట్టు కోచ్‌!

Sep 16 2026 1:55 AM | Updated on Sep 16 2026 1:55 AM

Rajwinder Kaur has been appointed coach of the Indian womens judo team

లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నంలో గాయాలు, ఎదురుదెబ్బలు సహజం.. కాని క్రీడాకారుల పాలిట మాత్రం ఆ గాయాలే అశనిపాతాలు... పొరపాటున గాని, స్వయంకృతంతో గాని శరీరానికి గాయమైతే కెరీర్‌ గాయబ్‌... ఒక్క రోజులో కలలన్నీ చెదిరిపోతాయి. అలా కల చెదిరిన ఓ క్రీడాకారిణి అందరిలా ఉసూరుమంటూ ఊరికే కూర్చోలేదు. వయసు 40 దాటింది...అయినా సరే ఫిట్‌నెస్‌ పెంచుకుంది. పట్టుదలతో బరిలోకి దిగింది.. గెలిచి చూపించింది. ఆమే పంజాబ్‌కు చెందిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్, అంతర్జాతీయ జూడో క్రీడాకారిణి రాజ్‌విందర్‌ కౌర్‌. 

కెరియర్‌లో ఎన్నో మెడళ్లు సంపాదించిన ఆమె ప్రస్తుతం ప్రపంచ జూడో చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడలకు కూడా భారతజట్టు కోచ్‌గా వ్యవహరించనుంది.     

ఒక క్రీడాకారిణి మోకాళ్ల లిగ్మెంట్‌కు గాయాలైతే ఆమె కెరీర్‌ దాదాపు ముగిసినట్టే. రాజ్‌విందర్‌ కౌర్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. 2014 కామన్‌వెల్త్‌ గేమ్స్‌కి ముందే మోకాళ్ల నొప్పితో బాధపడింది. 2019లో తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో రాజ్‌విందర్‌ జూడోకి దూరమైంది. 2022లో రెండు మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆ తర్వాత 2024 వరకు ఫిజియోథెరపీ చికిత్స తీసుకుని మళ్లీ పోటీకి సిద్ధమైంది. అలా ఆ దూరాన్ని దాటడానికి ఆమెకు ఐదేళ్లు పట్టింది.

తొలి గెలుపు... తొలి గాయం... వరుస విజయాలు... కాలేజీ స్థాయిలో పోటీలలో ఎంత రాణించినా రాజ్‌విందర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది మాత్రం 2007, గౌహతిలో జరిగిన నేషనల్‌ గేమ్స్‌లోనే. జూడోలో తొలిసారి బంగారు పతకం గెలిచి వార్తల్లో నిలిచింది. తర్వాత 2009 లో హరిద్వార్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ జూడో చాంపియన్‌షిప్‌లో రాజ్‌విందర్‌కు కుడికాలికి తీవ్రమైన గాయమైంది. కానీ రాజ్‌విందర్‌ వెనక్కి తగ్గలేదు. 2011లో రాంచీలో జరిగిన నేషనల్‌ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌తో మెరిసింది. తర్వాత ఏడాది విరామం తీసుకుంది. ఎందుకంటే ఆమె కుమారుడికి జన్మనిచ్చింది ఆ ఏడాదే. ఆ తర్వాత విరామానికి సెలివిచ్చి ఏకధాటిగా 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆల్‌ ఇండియా పోలీస్‌ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలిచింది. 

ఇక అంతర్జాతీయ స్థాయిలో 2014లో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో 78 కేజీ విభాగంలో తొలిసారిగా కాంస్యంతో రాజ్‌విందర్‌ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2015, 2017లో వరల్డ్‌ పోలీస్‌ గేమ్స్‌లో రజతం, 2018లో సీనియర్‌ నేషనల్‌ జూడో చాంపియన్‌షిప్, ఇండియన్‌ చాంపియన్‌షిప్‌లలో రజతం గెలుచుకుంది. శస్త్ర చికిత్స తర్వాత  2024 భువనేశ్వర్‌లో జరిగిన ఆల్‌ ఇండియా పోలీస్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌తో సూపర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. తర్వాత 2025లో అమెరికాలోని అలబామాలో జరిగిన వరల్డ్‌ పోలీస్‌ అండ్‌ ఫైర్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించి సత్తా చాటింది.

ఫ్యామిలీ ఉమన్‌... రాజ్‌విందర్‌ భర్త కుల్జిందర్‌సింగ్‌ కూడా జూడో కోచ్‌. ఆయన పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తే, రాజ్‌విందర్‌ మహిళల జట్టుకు కోచ్‌. ఆమె కుమారుడి వయసు 14 ఏళ్లు. ప్రతి రోజూ తన కొడుకుతో పాటే జిమ్‌కి వెళ్లి శిక్షణ తీసుకోవడం ఆమెకు అలవాటు. ఇంటి పనులు చేస్తూ, ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, జూడో క్రీడలో తనదైన ముద్రవేసింది. 

జూడో మ్యాట్‌పై పడిపోవడం ఆమెకు కొత్త కాదు. ఒడిదుడుకులు కొత్త కాదు. ఒకప్పుడు తన కోసం గెలవాలనుకుంది. ఇప్పుడు దేశాన్ని గెలిపించేందుకు తనలాంటి వారికి శిక్షణ ఇవ్వబోతోంది. ఆట నుంచి ఆమెను మోకాళ్లు  కొంతకాలం ఆపి ఉండొచ్చు కాని ఆమె మనసు మాత్రం ఎప్పుడూ జూడో రాజ్‌విందర్‌  కెరీర్‌లో ఎన్ని గెలిచిందన్నది విజయం కాదు.. పడిపోయినా... మళ్లీ లే చి ఎలా నిలదొక్కుకుందన్నదే నిజమైన విజయం.

ఆమె ఛాయిస్‌ కాదు! 
నిజానికి రాజ్‌విందర్‌కు మొదట ఇష్టమైన ఆట 200 మీటర్ల పరుగు పందెం. జూడో గురించి ఆమెకు తెలియదు. పంజాబ్‌లోని తరన్‌తారన్‌ జిల్లా, ఫాజిల్‌పూర్‌ గ్రామం రాజ్‌విందర్‌ స్వస్థలం. 1984 ఏప్రిల్‌ 2న ఆమె పుట్టింది. స్కూల్‌లో చదువుతున్నప్పుడు రన్నింగ్‌ రేస్‌ తన ఫేవరెట్‌ స్పోర్ట్‌. కాని జలంధర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు.. స్కూల్‌లో జూడో జట్టు కోసం కాస్త బలమైన క్రీడాకారిణుల కోసం చూస్తున్నప్పుడు రాజ్‌విందర్‌ అక్కడి కోచ్‌ దృష్టిలో పడింది. వెంటనే రాజ్‌విందర్‌ శిక్షణలో చేరాల్సి వచ్చింది. అలా జూడో ఆట ఆమెను ఎంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement