breaking news
Rajwinder Kaur
-
పట్టు వదలని ఆమె ఇప్పుడు జట్టు కోచ్!
లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నంలో గాయాలు, ఎదురుదెబ్బలు సహజం.. కాని క్రీడాకారుల పాలిట మాత్రం ఆ గాయాలే అశనిపాతాలు... పొరపాటున గాని, స్వయంకృతంతో గాని శరీరానికి గాయమైతే కెరీర్ గాయబ్... ఒక్క రోజులో కలలన్నీ చెదిరిపోతాయి. అలా కల చెదిరిన ఓ క్రీడాకారిణి అందరిలా ఉసూరుమంటూ ఊరికే కూర్చోలేదు. వయసు 40 దాటింది...అయినా సరే ఫిట్నెస్ పెంచుకుంది. పట్టుదలతో బరిలోకి దిగింది.. గెలిచి చూపించింది. ఆమే పంజాబ్‌కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్, అంతర్జాతీయ జూడో క్రీడాకారిణి రాజ్విందర్ కౌర్. కెరియర్లో ఎన్నో మెడళ్లు సంపాదించిన ఆమె ప్రస్తుతం ప్రపంచ జూడో చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడలకు కూడా భారతజట్టు కోచ్‌గా వ్యవహరించనుంది. ఒక క్రీడాకారిణి మోకాళ్ల లిగ్మెంట్కు గాయాలైతే ఆమె కెరీర్ దాదాపు ముగిసినట్టే. రాజ్విందర్ కౌర్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌కి ముందే మోకాళ్ల నొప్పితో బాధపడింది. 2019లో తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో రాజ్విందర్ జూడోకి దూరమైంది. 2022లో రెండు మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆ తర్వాత 2024 వరకు ఫిజియోథెరపీ చికిత్స తీసుకుని మళ్లీ పోటీకి సిద్ధమైంది. అలా ఆ దూరాన్ని దాటడానికి ఆమెకు ఐదేళ్లు పట్టింది.తొలి గెలుపు... తొలి గాయం... వరుస విజయాలు... కాలేజీ స్థాయిలో పోటీలలో ఎంత రాణించినా రాజ్‌విందర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది మాత్రం 2007, గౌహతిలో జరిగిన నేషనల్ గేమ్స్‌లోనే. జూడోలో తొలిసారి బంగారు పతకం గెలిచి వార్తల్లో నిలిచింది. తర్వాత 2009 లో హరిద్వార్‌లో జరిగిన సీనియర్ నేషనల్ జూడో చాంపియన్‌షిప్‌లో రాజ్‌విందర్‌కు కుడికాలికి తీవ్రమైన గాయమైంది. కానీ రాజ్విందర్ వెనక్కి తగ్గలేదు. 2011లో రాంచీలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌తో మెరిసింది. తర్వాత ఏడాది విరామం తీసుకుంది. ఎందుకంటే ఆమె కుమారుడికి జన్మనిచ్చింది ఆ ఏడాదే. ఆ తర్వాత విరామానికి సెలివిచ్చి ఏకధాటిగా 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలిచింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 78 కేజీ విభాగంలో తొలిసారిగా కాంస్యంతో రాజ్విందర్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2015, 2017లో వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో రజతం, 2018లో సీనియర్ నేషనల్ జూడో చాంపియన్‌షిప్, ఇండియన్ చాంపియన్‌షిప్‌లలో రజతం గెలుచుకుంది. శస్త్ర చికిత్స తర్వాత 2024 భువనేశ్వర్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. తర్వాత 2025లో అమెరికాలోని అలబామాలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించి సత్తా చాటింది.ఫ్యామిలీ ఉమన్... రాజ్విందర్ భర్త కుల్జిందర్సింగ్ కూడా జూడో కోచ్. ఆయన పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తే, రాజ్విందర్ మహిళల జట్టుకు కోచ్. ఆమె కుమారుడి వయసు 14 ఏళ్లు. ప్రతి రోజూ తన కొడుకుతో పాటే జిమ్‌కి వెళ్లి శిక్షణ తీసుకోవడం ఆమెకు అలవాటు. ఇంటి పనులు చేస్తూ, ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, జూడో క్రీడలో తనదైన ముద్రవేసింది. జూడో మ్యాట్‌పై పడిపోవడం ఆమెకు కొత్త కాదు. ఒడిదుడుకులు కొత్త కాదు. ఒకప్పుడు తన కోసం గెలవాలనుకుంది. ఇప్పుడు దేశాన్ని గెలిపించేందుకు తనలాంటి వారికి శిక్షణ ఇవ్వబోతోంది. ఆట నుంచి ఆమెను మోకాళ్లు కొంతకాలం ఆపి ఉండొచ్చు కాని ఆమె మనసు మాత్రం ఎప్పుడూ జూడో రాజ్విందర్ కెరీర్లో ఎన్ని గెలిచిందన్నది విజయం కాదు.. పడిపోయినా... మళ్లీ లే చి ఎలా నిలదొక్కుకుందన్నదే నిజమైన విజయం.ఆమె ఛాయిస్ కాదు! నిజానికి రాజ్‌విందర్‌కు మొదట ఇష్టమైన ఆట 200 మీటర్ల పరుగు పందెం. జూడో గురించి ఆమెకు తెలియదు. పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లా, ఫాజిల్పూర్ గ్రామం రాజ్విందర్ స్వస్థలం. 1984 ఏప్రిల్ 2న ఆమె పుట్టింది. స్కూల్లో చదువుతున్నప్పుడు రన్నింగ్ రేస్ తన ఫేవరెట్ స్పోర్ట్. కాని జలంధర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు.. స్కూల్లో జూడో జట్టు కోసం కాస్త బలమైన క్రీడాకారిణుల కోసం చూస్తున్నప్పుడు రాజ్విందర్ అక్కడి కోచ్ దృష్టిలో పడింది. వెంటనే రాజ్విందర్ శిక్షణలో చేరాల్సి వచ్చింది. అలా జూడో ఆట ఆమెను ఎంచుకుంది. -
జూడోలో రజ్వీందర్‌కు కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున జూడోలో భారత్‌కు ఒక కాంస్యం దక్కింది. మహిళల 78+ విభాగం క్వార్టర్స్‌లో రజ్వీందర్ కౌర్.. రటుగీ (కెన్యా)ని ఓడించింది. అయితే 78 కేజీల విభాగం కాంస్య పతక పోరులో జీనా దేవి జోంగ్తమ్ 0-1 తేడాతో కామెరూన్‌కు చెందిన ఎంబల్లా చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 100కేజీ కాంస్య పతక పోరులో సాహిల్ పఠానియా 0-2 తేడాతో న్యూజిలాండ్‌కు చెందిన స్లైఫీల్డ్ చేతిలో ఓడిపోయాడు. స్క్వాష్‌లో దీపికాకు నిరాశ: భారత స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్‌కు ఈసారీ నిరాశే ఎదురైంది. క్వార్టర్స్‌లో అలిసన్ వాటర్స్ (ఇంగ్లండ్) 3-1తో దీపికను ఓడించింది. మరో క్రీడాకారిణి అలంకమోని 3-0తో ఎలీ వెబ్‌పై (పపువా న్యూగినియా)పై గెలిచి సెమీస్‌కు చేరింది. పరుషుల విభాగంలో సౌరవ్ ఘోశల్ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సౌరవ్ 3-2తో స్టీవెన్ ఫింటిస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. దీంతో 1998లో ఈ గేమ్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి క్వార్టర్స్‌కు చేరుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. పురుషుల క్లాసిక్ ప్లేట్ ప్రిక్వార్టర్స్‌లో మహేశ్ మంగనోకర్ 3-0తో క్రీడ్ (వేల్స్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. టేబుల్ టెన్నిస్: టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో 3-0తో స్కాట్లాండ్పై గెలిచింది. మహిళల జట్టు సెమీస్‌లో సింగపూర్ చేతిలో 1-3తో ఓడింది. ఇక కాంస్యం కోసం ఆసీస్‌తో తలపడుతుంది. లాన్‌బౌల్స్: అంతగా అంచనాలు లేని లాన్‌బౌల్స్‌లో ఊహించిందే జరిగింది. మహిళల ఫోర్స్ సెక్షన్-బి రౌండ్ 5లో భారత జట్టు 12-13తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడింది. ప్రి క్వార్టర్స్‌లో విజేందర్, మనోజ్: బాక్సింగ్‌లో భారత్ పంచ్ అదిరింది. స్టార్ బాక్సర్ విజేందర్‌సింగ్, మనోజ్ కుమార్‌లు తొలిరౌండ్‌ను అలవోకగా అధిగమించారు. పురుషుల 74 కేజీల విభాగం తొలి రౌండ్లో విజేందర్ 3-0తో ఆండ్రూ కొమెటా (కిరిబతి)ను మట్టికరిపించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 64 కేజీల విభాగం తొలి రౌండ్లో మనోజ్‌కుమార్ 3-0తో మోకహచనా మోషోషి (లీసోతో)పై సునాయాసంగా గెలిచాడు. మీనా కుమారి నిరాశ: మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధిస్తుందనే అంచనాలున్న మీనా కుమారి నిరాశపరిచింది. 58 కేజీల విభాగంలో మీనా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. స్నాచ్‌లో 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు మాత్రమే ఎత్తగలిగింది. వయసు 60... పతకాలు 18 ఇంగ్లండ్‌కు చెందిన షూటర్ మైకేల్ గల్ట్ 60 ఏళ్ల వయసులోనూ పతకాల పంట పండిస్తున్నాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సొంతం చేసుకున్న అతను కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధిక పతకాల రికార్డు (18)ని సమం చేశాడు. ఢిల్లీ ఎందుకు రాలేదంటే... గ్లాస్గో: నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ లేకపోవడం పెద్ద లోటుగా అనిపించింది. దీనిపై ఇప్పుడు బోల్ట్ మాట్లాడాడు. ‘ఢిల్లీలో అక్టోబర్-నవంబర్లలో గేమ్స్ జరిగాయి. అప్పుడు సీజన్ ముగింపు దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను పోటీ పడాల్సి ఉంది. అందుకు సన్నాహకాల కోసమే ఢిల్లీ గేమ్స్ నుంచి తప్పుకున్నాను’ అని బోల్ట్ చెప్పాడు.


