హెల్త్..
ప్రతి ఒక్కరి జీవితంలో పాదాల వాపు ఏదో ఒక సమయంలో కనిపించడం చాలా సాధారణం. రకరకాల కారణాల వల్ల పాదాల్లో వాపు కనిపిస్తుంటుంది. చాలాసేపు ఏదైనా వాహనంలోగానీ లేదా బస్సులోగానీ కూర్చుని ప్రయాణం చేశాక... పాదాల్లో వాపు రావడం చాలామందిలో కనిపించేదే. ఇది నిరపాయకరమైన వాపు. దీన్ని బినైన్ ఎడిమా అంటారు. అయితే సందర్భాల్లో మాత్రం పాదాల వాపు కాస్తంత సీరియస్ ఆరోగ్య సమస్యలనూ సూచించవచ్చు. అందుకే సాధారణంగా ప్రయాణం చేసిన వెంటనే కాకుండా మామూలుగా ఇతర సందర్భాల్లో పాదాల వాపు కనిపిస్తే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఏయే సందర్భాల్లో పాదాల వాపు అన్నది ప్రమాదకరమైన సూచన కావచ్చనే అంశంపై అవగాహన కోసం ఈ కథనం...
కాళ్లలో/పాదాల్లో వాపు కనిపించే లక్షణాన్ని వైద్య పరిభాషలో ‘ఎడిమా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో ముందుగా అనుమానించాల్సినవి సెల్యులైటిస్, డీప్‌వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లు. ఇవి మాత్రమే కాకుండా... హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల కూడా కాళ్లలో వాపు కనిపించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా పాదాల వాపు కనిపించవచ్చు. కొన్ని మందుల వాడకం వల్లగానీ లేదా అసలే కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు.
పాదాల వాపునకు రకరకాల కారణాలివి...
పాదాల వాపునకు కారణాలలో రెండు రకాలుంటాయి.
అందులో 1. సాధారణ (కామన్) కారణాలు... 2. తీవ్రమైన కారణాలు.
1. సాధారణ కారణాలు (కామన్ కాజెస్)
∙ రక్తహీనత ∙హైపోథైరాయిడిజమ్
∙ మూత్రం ద్వారా ్రపోటీన్ పోవడం (్రపోటీన్ లాస్ ఇన్ యూరిన్)
∙ కొన్ని రకాల మందుల వాడకం వల్ల (మెడికేషన్స్)
2. తీవ్రమైన కారణాలు (సీరియస్ కాజెస్)
∙ కాలేయ వ్యాధులు (లివర్ డిసీజెస్)
∙ మూత్రపిండాల వైఫల్యం (రీనల్ ఫెయిల్యూర్)
∙ గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్)
కొన్ని కారణాల గురించి మరింత విపులంగా...
లివర్ ఫెయిల్యూర్ వల్ల... కాలేయ వైఫల్యం (లివర్ ఫెయిల్యూర్) అయిన వాళ్లలో కాళ్లు లేదా పాదాల్లో వాపు కనిపించే అవకాశాలెక్కువ. ఇలాంటి సందర్భాల్లో ‘లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టీ) అనే పరీక్ష చేయించి, ఆ వాపు లివర్ ఫెయిల్యూర్ వల్లనా లేదా మరో కారణం వల్లనా అనే విషయం తెలుసుకుంటారు. సమస్య నిర్ధారణ తర్వాత దానికి అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు.
కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల...
కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్‌లో ముఖం మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో కాళ్లలో వాపు కూడా కనిపించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.
పాదాలకూ, గుండెకూ సంబంధమిలా...
పాదాల వాపు గుండెజబ్బుకు ఒక ప్రధాన సూచన. గుండె జబ్బు కారణంగా పాదాల వాపు వస్తే అది రెండు కాళ్లలోనూ కనిపిస్తుంది. తొలినాళ్లలో కాలి ముందు భాగంలోనూ, మడమ భాగంలోనూ ఉంటుంది. ఆ తర్వాత పాదం పైన కూడా కనిపించవచ్చు. ఈ వాపు కారణంగా ఎలాంటి నొప్పీ ఉండదు. కాబట్టి ఈ సమస్యతో డాక్టర్ వద్దకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ లక్షణంతో పాటు ఆయాసం రావడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం బాధితులు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఆయాసం, గుండెదడ, ఛాతీ నొప్పి లాంటి లక్షణాలు రాకముందే ఆ పాదాల వాపు అన్నది గుండె జబ్బుకు సూచన కావచ్చన్నది అనుమానించడం వల్ల... సమస్య నిర్ధారన కాస్త త్వరగా జరిగే అవకాశముంది. అలాగో చూద్దాం.
గుండెజబ్బులో పాదాల వాపు ఎందుకొస్తుందంటే...
పాదాలవాపు అనేది గుండె పంపింగ్ సామర్థ్యం (పంపింగ్ కెపాసిటీ) తగ్గినప్పుడు కనిపించే ఓ ముఖ్యమైన లక్షణం. గుండెలో తాను సంకోచించే శక్తి తగ్గినా లేక వ్యాకోచించే సామర్థ్యం లోపించినప్పుడు కాళ్ల వాపు కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తపోటు పెరిగి ఉండటానికి కూడా కాళ్లవాపు అన్నది ఒక లక్షణంగా గుర్తించాలి. గుండెజబ్బు కారణంగా కాళ్ల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోడానికి బీఎన్‌పీ అనే రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. బీఎన్‌పీ విలువ 100 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది గుండెజబ్బు కారణంగానేమో అని అనుమానించాల్సి ఉంటుంది. అప్పుడు కార్డియాలజిస్టును సంప్రదించి ఆయన సలహా మేరకు ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతో కాలివాపు గుండెజబ్బు కారణంగానా, కాదా అన్నది నిర్ధారణ చేయవచ్చు.
ఒకవేళ కాలివాపు అన్నది గుండెజబ్బు కారణంగానే అయితే...
కాలి వాపు అన్నది గుండె జబ్బు కారణంగానే వస్తే... ఆ సమస్యకు డైయూరెటిక్స్ అనే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డైయూరెటిక్స్ మందులు... దేహంలోంచి నీటిని మూత్రం రూపంలో బయటికి పోయేలా చేస్తాయి. అయితే గుండెజబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఈ డైయూరెటిక్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గుండెజబ్బు లేకుండా ఆ మందులు వాడితే అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... గుండెజబ్బు కాకుండా ఇతరత్రా ఏదైనా ఇతర కారణం వల్ల పాదాల / కాళ్ల వాపు వచ్చి ఉంటే... ఆ అసలు కారణాన్ని కనుగొనే అవకాశాన్ని కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా
కనిపించే పాదాల వాపు కాళ్లకు నీరు పట్టి కాళ్లలో వాపు కనిపించడానికి మరో ప్రధాన కారణం ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం. ఇటీవల చాలామందిలో పెరుగుతున్న ఊబకాయం వల్ల నిద్రపోతున్నప్పుడు ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయి ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. దాంతో ఆ సమయంలో ఊపిరితిత్తుల్లో రక్తపోటు కూడా పెరగవచ్చు.
ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు :
∙ పెద్దగా గురకపెట్టడం
∙ నిద్రలో ఉలిక్కిపడి లేవడం
∙ దగ్గుతో పొలమారి నిద్రనుంచి మెలకువ రావడం
∙ నిద్రపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం. ఈ వ్యాధి గురించి అంతగా అవగాహన లేకపోవడంతో నిర్ధారణ సరిగా జరగడం లేదు.
చేయించాల్సిన వైద్య పరీక్షలు :
ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడాన్ని నిర్ధారణ చేయడం కోసం ఎకో పరీక్ష చేయించాలి. కాళ్ల వాపులు వచ్చే వ్యక్తులకు 45 ఏళ్లు దాటితే... వారికి తప్పనిసరిగా ఎకో పరీక్ష చేయించాలి.
చికిత్స : ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియాకు తప్పనిసరిగా చికిత్స చేయించాలి. దాంతో స్లీప్ ఆప్నియా సమస్య తగ్గడంతో పాటు అలా ఆ సమస్య తగ్గినంతున కాళ్ల వాపు కూడా తగ్గుతుంది.
కొన్ని రకాల ఇతర వ్యాధులూ... కాళ్ల వాపులు
ఈ కాళ్లలో వాపు అన్నది కొన్ని రకాల ఇతర జబ్బుల వల్ల కూడా కనిపించవచ్చు. ఇందులో ప్రధానమైనవి... మూత్రపిండాల జబ్బులు, కాలేయ వ్యాధులు కాగా... వాటితో పాటు కటి (నడుము కింది) భాగంలో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్‌లలో కూడా కాళ్ల వాపు కనిపించవచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు పటుత్వం కోల్పోవడం వల్ల కూడా కాళ్ల వాపు రావచ్చు. కొన్ని సార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించనప్పుడూ ఈ సమస్య కనిపించడం కాస్త సాధారణమే. శరీరంలో ్రపోటీన్లు మూత్రం ద్వారా పోతున్నప్పుడు కూడా కాళ్ల వాపు కనిపించవచ్చు. అందుకే కాళ్ల వాపు లక్షణం కనిపించినప్పుడు ప్రధాన కారణాలను కనుగొని వాటికి సరైన చికిత్స తీసుకోవాలి.
కొన్ని రకాల మందుల వాడటం వల్ల...
కొన్నిసార్లు మనం వాడే మందుల వల్ల కూడా కాళ్ల వాపు రావచ్చు. సాధారణంగా రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులకు వాడే మందుల వల్ల ఇలా జరిగే అవకాశముంది. అలాగే నొప్పుల నివారణ కోసం వాడే ఇబు్రపోఫెన్, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచేందుకు వాడే పయోగ్లిటజోన్, స్టెరాయిడ్స్‌తో కాళ్ల వాపులు వచ్చినప్పుడు... పేషెంట్స్ ఏవైనా మందులు వాడుతుండటం వల్ల ఈ వాపు వచ్చిందా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ మందుల వల్లనే కాళ్ల వాపు వచ్చి ఉంటే తక్షణం వాటిని ఆపివేయడం, వాటిని ప్రత్యామ్నాయంగా వేరే మందులు ఇవ్వడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలెక్కువ.
కారణం తెలియని కాళ్ల వాపులు...
మహిళల్లో ముఖ్యంగా 30– 40 ఏళ్లు దాటిన వారిలో కాళ్ల వాపు సమస్య చాలా ఎక్కువ. కాలి వాపుతో పాటు ముఖం, చేతులు కూడా ఉబ్బి ఉండటం సాధారణంగా కనిపిస్తుంటాయి. దీనికి ఇదమిత్థంగా ఎలాంటి కారణం ఉండదు. అందువల్ల వైద్య చికిత్స చేయడం కూడా ముందుగా జరగదు. ఇలాంటి వారికి అన్ని సాధారణ పరీక్షలు చేసి... ఎలాంటి కారణం లేదని నిర్ధారణ చేశాక మాత్రమే కాలివాపునకు చికిత్స చేయడానికి డైయూరెటిక్స్ వాడుతుంటారు. ఇలాంటి వారు కాలి వాపు తగ్గడానికి ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
సిరల (వెయిన్స్) సామర్థ్యలోపం వల్ల...
రక్తాన్ని కాలు మొదలుకొని ఇతరత్రా దేహభాగాల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలను సిరలు అని అంటారు. సాధారణంగా డీ–ఆక్సినేటెడ్ (ఆక్సిజన్ లేకుండా కార్బన్ డై ఆక్సైడ్‌తో కూడిన) రక్తాన్ని ఈ సిరలు వెనక్కు గుండెవైపునకు తీసుకెళ్తూ ఉంటాయి. మనలోని జీవక్రియల వల్ల కొన్ని కాలుష్యాలు వెలువడతాయి. ఆ కాలుష్యాలు కలిసిన రక్తమే చెడు రక్తం. ఉదాహరణకు నడక అనే ప్రక్రియలో... రక్తం కాలి సిరల నుంచి ఊపిరితిత్తులకు చేరి అక్కడ శుభ్రపడి మళ్లీ గుండె నుంచి ధమనుల ద్వారా మళీ కాళ్లకు సరఫరా అవుతుంది.
కొన్ని సార్లు కాళ్లలోని సిరల సామర్థ్య లోపం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోతుంది. అది పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవారిలో లేదా ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య మరికాస్త ఎక్కువగా కనిపించవచ్చు. కాలివాపు కనిపించినప్పుడు అనుమానించాల్సిన కారణాలలో ఈ సిరల సామర్థ్య లోపం చాలా ప్రధానమైనదీ చాలా సాధారణమైనది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ జబ్బు వచ్చే ముప్పు మరింతగా పెరుగుతుంటుంది. తొలి దశలో ఎక్కువ సేపు ప్రయాణం చేసినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది.
ప్రధానంగా ప్రయాణాల సమయంలో సాయంత్రానికి కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని వల్ల ఇబ్బంది లేకపోవడంతో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలెక్కువ. ఈ సమస్య ఉన్నవారిలో పిక్కల్లో కూడా నొప్పి అనిపించడం, కాళ్లు బరువుగా ఉన్నట్లు అనిపించడమూ జరుగుతుంది. క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపిస్తాయి. అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తుంటాయి. ఈ కండిషన్‌ను వేరికోస్ వెయిన్స్ అంటారు. తొలి దశలో కేవలం సాయంత్రాలు మాత్రమే కనిపించే ఈ సమస్య ఆ తర్వాత రోజంతా ఉంటుంది.
కొందరిలో సెల్యులైటిస్ అనే కండిషన్‌లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది. దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కనిపించే ‘డీప్ వీన్ థ్రాంబోసిస్ – (డీవీటీ)’ అనే కండిషన్‌లో కూడా కాలివాపు కనిపిస్తుంది. ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి.
సిరల సామర్థ్య లోపంవల్ల సమస్య వస్తే...
∙ ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవడం ∙ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేసుకుని ఉండటం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలివాపు రాకుండా ఉంటుంది. స్టాకింగ్ వల్ల కాలిపై పడే ఒత్తిడి కారణంగా సిరలకు అది మంచి సపోర్ట్ అందడంతో పాటు ఈ కారణంగా సిరల్లో మళ్లీ రక్తం సులువుగా / సాఫీగా ప్రవహిస్తుంటుంది. ఒకవేళ సమస్యను ఈ దశలో నిర్లక్ష్యం చేయడం వల్ల అది ముదిరి వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధిగా పరిణమిస్తుంది. వ్యాధి బాగా ముదిరితే కాళ్లకు పుండ్లు పడే అవకాశమూ ఉంటుంది.
జాగ్రత్తలు / ఫస్ట్‌లైన్ చికిత్స...
కాళ్లవాపులు కనిపించినప్పుడు బాధితులు...
చాలాసేపు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వాపు ఉన్న కాళ్లపై ఎలాస్టిక్ స్టాకింగ్స్ తొడగాలి. ఈ జాగ్రత్తలతో కాలివాపును నివారించవచ్చు.
స్టాకింగ్ సిరలకు అది మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల క్రమేణా రక్తం సజావుగా ప్రవహిస్తుంటుంది.
ఈ దశలో నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరి ‘వేరికోస్ వెయిన్స్’గా పరిణమిస్తే, కాళ్లకు పుండ్లు పడటం వంటి కాంప్లికేషన్లు కనిపించవచ్చు.
అలాంటప్పుడు ఆయా లక్షణాలూ, కండిషన్లకు అనుగుణంగా రేడియాలజీ చికిత్స, శస్త్రచికిత్సలు చేయించాల్సిన అవసరం పడవచ్చు.
చివరగా... కాళ్లు లేదా పాదాలలో వాపు రావడానికి ఉన్న కారణాలు తెలుసుకున్న తర్వాత... ఎప్పుడో, ఏదో సందర్భంలో అరుదుగా కాళ్లూ లేదా పాదాలలో వస్తున్న వాపులను మినహాయిస్తే... ఈ పాదాల వాపు తరచూ కనిపించడం మరీ ముఖ్యంగా ఏవైనా మందులు వాడుతున్నప్పుడో... ఏదైనా జబ్బు (అండర్ లైయింగ డిసీజ్) కారణంగా కాళ్ల వాపులు వస్తున్నాయేమో అని అనుమానం వస్తే... తక్షణం డాక్టరు / మెడికల్ స్పెషలిస్ట్‌కు చూపించుకుని, తగిన పరీక్షలు చేయించుకుని... అవి మామూలుగా వస్తే కాళ్లవాపులే అని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండవచ్చు. లేదా మరేదైనా కారణం వల్ల వచ్చే కాళ్లవాపులని తేలితే... తగిన చికిత్స చేయించుకుని... ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. - డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్
నిర్వహణ : యాసీన్


