
స్ఫూర్తి
నేను స్వీపర్‌గా పనిచేయడం ఏమిటి?’ అని ఆమె అహానికి పోలేదు. ‘ఇంత చిన్నజీతానికి పనిచేయడం ఏమిటి?’ అని తాను చేస్తున్న పనిని చిన్నచూపు చూడలేదు.
చిన్నదో, పెద్దదో ‘పని’ చేయాలి అని గట్టిగా అనుకుంది ముంబైకి చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్. పనే ఆమెకు ‘పవర్’ అయింది. ఎస్‌బీఐలో స్వీపర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయికి చేరింది...
పేదకుటుంబంలో పుట్టిన ప్రతీక్షకు పదిహేడు సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇరవైలలో ఉన్నప్పుడు భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. ఆ షాక్ నుంచి కోలుకోవడం ఆమెకు చాలా కష్టమైపోయింది. అప్పటికే తనకు రెండు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే పిల్లవాడి గురించి ఎవరు ఆలోచిస్తారు?’ అనుకొని ఆ దుఃఖం నుంచి బయటపడి ధైర్యం తెచ్చుకుంది.
‘ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కడుపు నిండదు. ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి’ అనుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
ముంబై బ్రాంచ్‌కు వెళ్లి ‘ఏదో ఒక పని ఇప్పించండి’ అని అడిగింది. ఆమె భర్త ఈ బ్రాంచ్‌లో బుక్‌బైండర్‌గా పనిచేసేవాడు. ఆ మంచితనం, సానుభూతితో బ్యాంక్ వాళ్లు ఆమెకు తమ బ్రాంచీలో స్వీపర్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. నెలకు అరవై అయిదు రూపాయల జీతం వచ్చేది.
ఆ జీతంతోనే సర్దుకుపోయి ఉంటే ప్రతీక్ష తన భవిష్యత్ గురించి ఆలోచించేది కాదు. ఆ సమయంలోనే తాను మరచిపోయిన చదువు గురించి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనతో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. ‘ఈ వయసులో చదువు ఏమిటి!’ ‘ఇంట్లో బిడ్డను పెట్టుకొని కాలేజీకి వెళతావా!’... ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందేమో అని మొదట భయపడింది. ఆ తరువాత తనకు తానే ధైర్యం తెచ్చుకుంది.
‘నేనేమీ తప్పు చేయడం లేదు. చదువుకోబోతున్నాను. అంతే’ అని గట్టిగా నిశ్చయించుకుంది. ఒకవైపు స్వీపర్ పనిచేస్తూనే మరోవైపు నైట్ కాలేజీలో చదువుకునేది. ఇంటర్మీడియెట్ తరువాత మరో నైట్‌కాలేజీలో డిగ్రీ చేసింది. స్వీపర్ నుంచి బ్యాంక్ క్లర్క్‌గా ప్రమోట్ అయింది. కొంతకాలానికి తిరిగి వివాహం చేసుకుంది ప్రతీక్ష. భర్త ప్రమోద్ ‘నిన్ను ఇంకా పెద్దస్థాయిలో చూడాలనుకుంటున్నాను’ అనేవాడు.
బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలని ప్రోత్సహించేవాడు. అలా బ్యాంకు పరీక్షలు రాసి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏజీఎం (అసిస్టెంట్ జనరల్ మేనేజర్) స్థాయికి చేరింది ప్రతీక్ష. ‘కష్టాల్లో ఉన్నప్పుడు చదువు తప్ప నాకు మరో దారి కనిపించలేదు. చదువును నమ్ముకునేవారికి, కష్టపడేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది’ తన అనుభవ జ్ఞానంతో అంటుంది ప్రతీక్ష తోండ్వాల్కర్. ప్రతీక్ష తన విజయం దగ్గరే ఆగిపోలేదు. తన విజయంతో ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది.
ఆ రెండు అడుగులు
ఆ కష్టకాలాన్ని గుర్తు తెచ్చుకుంటే నాకు ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. అయితే గతంలోనే ఉండిపోతే భవిష్యత్‌ను చూడలేము. నాకు మొదటి నుంచి చదువు అంటే ఇష్టం. ఆ చదువే నాకు ధైర్యాన్ని ఇచ్చి దారి చూపింది. పరిస్థితులే మనకు ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పడానికి నేనే ఉదాహరణ. తెలియని వ్యక్తుల ముందుకు వెళ్లి ‘నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి’ అని అడగడం నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు అనుకుంటాను. ఎవరు ఏమనుకున్నా సరే నేను చదవాల్సిందే అనుకోవడం నేను ధైర్యంగా వేసిన రెండో అడుగు. ఆ రెండు అడుగులు నా జీవితాన్ని మార్చేశాయి
– ప్రతీక్ష తోండ్వాల్కర్