ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
నమస్కారం
భారతీయ సంప్రదాయంలో ఎదుటి వ్యక్తిని కలవగానే ముందుగా చేసే పని ‘నమస్కారం’. ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగమైన గౌరవానికి, ఆత్మీయతకు ప్రతీక. గుడిలో భగవంతుడిని దర్శించుకున్నా, ఇంట్లో పెద్దలను కలిసినా రెండు చేతులు జోడించి నమస్కరించడం మన ఆనవాయితీ. అసలు ఇలా రెండు చేతులూ ఎందుకు జోడించాలి..? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..
‘నమస్తే’ అనే పదంలో దాగిన ఆంతర్యం..
సంస్కృత పదాలైన ‘నమః‘, ‘తే’ కలయికతో ‘నమస్తే’ ఏర్పడింది. ‘నమః’ అంటే నాలోని అహంకారాన్ని వదిలిపెట్టడం, ‘తే‘ అంటే మీకు. అంటే.. ‘నా అహాన్ని విడిచిపెట్టి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను‘ అని అర్థం. హిందూ ధర్మం ప్రకారం ప్రతి జీవిలోనూ దైవాంశ ఉంటుంది. అందుకే ఎదుటి వ్యక్తికి నమస్కరించడం ద్వారా, వారిలో కొలువై ఉన్న పరమాత్మను స్మరించుకుంటున్నామని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
రెండు చేతులు ఎందుకు జోడించాలి..?
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. కుడి చేయి సానుకూల సూర్య శక్తికి, ఎడమ చేయి గ్రహించే చంద్ర శక్తికి ప్రతీకలు. ఈ రెండు చేతులను ఏకం చేసినప్పుడు శరీరంలోని నాడులు సమతుల్యమై, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. చేతులు జోడించే భంగిమ ఎదుటివారి పట్ల మనకు ఉన్న వినమ్రతను, శరణాగతి భావాన్ని సూచిస్తుంది. ఇది బంధాల్లో ఆత్మీయతను పెంచుతుంది.
నమస్కరించే సరైన విధానం..
శాస్త్రాల ప్రకారం, రెండు చేతులను ఛాతీకి దగ్గరగా ఉంచి, తలను కొద్దిగా వంచి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల మనసులో వినయం ఇనుమడిస్తుంది. దేవుడికి లేదా వయసులో పెద్దవారికి నమస్కరించేటప్పుడు కళ్లు మూసుకుని భక్తి శ్రద్ధలతో ప్రణామం చేయడం అత్యంత మంగళకరం.
నమస్కారం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు..
నమస్కారం చేయడం వెనుక కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. రెండు చేతుల వేళ్ల చివర్లు ఒకదానికొకటి తాకినప్పుడు చేతుల్లోని ఒత్తిడి బిందువులు ఉత్తేజితం అవుతాయి. అలా ఆక్యుప్రెషర్.. జరిగి నేరుగా కళ్లు, చెవులు, మెదడుకు అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల నమస్కరించిన వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది.
నమస్కారంలో ఎలాంటి భౌతిక స్పర్శ ఉండదు కాబట్టి, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా నమస్కారానికి ఎంతో గుర్తింపు ఉంది. నేడు యోగాతో పాటు భారతీయ సంస్కృతికి ఉన్న ఆదరణ వల్ల, విదేశీయులు సైతం భౌతిక దూరం పాటిస్తూనే గౌరవాన్ని వ్యక్తం చేసే ఈ ‘నమస్తే’ సంప్రదాయాన్ని ఎంతో ఆసక్తిగా, భక్తితో పాటిస్తున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, భావితరాలకు అందిద్దాం..
– పసుపులేటి శ్రీలక్ష్మి


