ట్రెండ్
ఉదయం లేచింది మొదలు రాత్రి స్టవ్ కట్టేసే వరకు ఉరుకుల పరుగుల జీవితం. పెళ్లి, పిల్లలు, ఇల్లు, ఆఫీస్ డెడ్‌లైన్స్... కెరీర్ రేసులో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆధునిక మహిళలు 2026లో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. అదే ‘మినీ రిటైర్మెంట్’. 60 ఏళ్లకు తీసుకునే రిటైర్‌మెంట్ కాకుండా కెరీర్ మధ్యలోనే 3 నుండి 6 నెలలు బ్రేక్ తీసుకుని లైఫ్‌ను రీఛార్జ్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఈ ధోరణి పట్ల 85 శాతం ఆసక్తితో ఉంటే 35 శాతం ఆచరణలో చూపుతున్నారు.
హైదరాబాద్‌లోని ఒక లీడింగ్ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్న కావ్య (32) ఐదేళ్లుగా రాత్రింబగళ్లు ప్రాజెక్టులతో కుస్తీ పట్టింది. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడి లోనైంది. రెజ్యూమేలో గ్యాప్ వస్తే కెరీర్ పాడవుతుందన్న భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా నాలుగు నెలల‘మినీ–రిటైర్మెంట్’ తీసుకుంది. ఫోన్ పక్కన పడేసి, కేరళలో ఆయుర్వేద డిటాక్స్ తీసుకుంటూ, చిన్నప్పుడు వదిలేసిన పెయింటింగ్ మళ్లీ మొదలుపెట్టింది. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో మళ్లీ ఆఫీసులో అడుగుపెట్టింది.
ఒక ఎడ్–టెక్ స్టార్టప్‌లో కస్టమర్ సపోర్ట్ హెడ్‌గా ఉన్న సుజాత (36) ఆఫీస్ ఒత్తిడికి తోడు ఇంట్లో బాధ్యతలు ఎక్కువై డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇలా అయితే లాభం లేదని దాచుకున్న డబ్బుతో మూడు నెలలు లీవ్ పెట్టి కేవలం పిల్లలతో గడపడానికి, యోగా నేర్చుకోవడానికి ఆ సమయాన్ని వాడుకుంది. ఈ చిన్న బ్రేక్ ఆమెకు కొత్తజన్మను ఇచ్చింది.
ఈ ఇద్దరి కథలూ 2026లోమహిళల మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.
ఎందుకీ ధోరణి?
మహిళలపై సమాజం మోపుతున్న ‘సూపర్ ఉమెన్’ ట్యాగ్ వారిపై భారానికి కారణమవుతోంది. ఇటు ఆఫీసులో మగవారితో సమానంగా టార్గెట్లు రీచ్ అవ్వాలి... అటు ఇంట్లో పర్ఫెక్ట్ కోడలిగా, భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేర్చాలి. ఈ ‘మల్టీ టాస్కింగ్’ వల్ల మహిళల్లో విపరీతమైన యాంగ్జయిటీ, ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి సమస్యలు పెరిగిపోయాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే సమయం దొరకని పరిస్థితి. ‘ఇలాగే పరిగెడితే ఆరోగ్యం పాడవుతుంది, కొన్నాళ్లు బ్రేక్ తీసుకోక తప్పదు’ అనే సామాజిక అవసరం ఏర్పడింది.
బాస్ భరోసా ఇస్తున్నారా?
ఒకప్పుడు ‘కెరీర్ గ్యాప్’ ఉంటే రెజ్యూమేలను డస్ట్‌బిన్ లో వేసే కంపెనీలు 2026లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ‘సబాటికల్ లీవ్స్’ (జీతం లేని దీర్ఘకాలిక సెలవులు) ఇస్తూ ‘మీరు బ్రేక్ తీసుకుని రండి,
మీ సీటు భద్రంగా ఉంటుంది’ అని భరోసా ఇస్తున్నాయి. అయితే కుటుంబాల నుండి మద్దతు విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. విద్యావంతులైన భర్తలు, ఆధునిక కుటుంబాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే సంప్రదాయ మధ్యతరగతి ఇళ్లలో మాత్రం ‘ఉన్న ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వడం ఏంటి? పిచ్చి కాకపోతే’ అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ మహిళలు వీటన్నింటినీ దాటి తమ ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
సగటు మహిళ ఏం నేర్చుకోవాలి?
మరి నెలజీతం వస్తేనే ఇల్లు గడిచే సగటు మధ్యతరగతి మహిళలు, ఒక్క రోజు కూడా లీవ్ దొరకని చిన్న ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఏంటి? వారు ఈ ధోరణిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? దీనికి పెద్ద పెద్ద ప్లాన్స్ అక్కర్లేదు. ‘మినీ రిటైర్మెంట్’ అనే భావనను మీ రోజువారీ జీవితంలోకి మార్చుకోవచ్చు.
‘నో ఆఫీస్ టాక్’: శనివారం
లేదా ఆదివారం కనీసం ఒక అరపూట ఫోన్ ను, ఆఫీస్ మెయిల్స్ ను పూర్తిగా పక్కన పెట్టేయండి.
మైక్రోబ్రేక్స్: నెలకు ఒక శనివారం ఇంట్లో వంట పనికి సెలవు పెట్టి, హోటల్ నుండి తెప్పించుకోండి. ఆ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి.
నో చెప్పడం నేర్చుకోండి: ఆఫీసులో మీ పని పరిధి దాటి వచ్చే అదనపు ఒత్తిళ్లకు, ఇంట్లో అనవసరపు బాధ్యతలకు సున్నితంగా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. పెద్ద బ్రేక్ తీసుకోకపోయినా ఈ చిన్న మార్పులు మీ మైండ్‌ను రీఛార్జ్ చేస్తాయి.
జీవితం అంటే కేవలం సంపాదించడం, బాధ్యతలు మోయడమే కాదు... అందులో మనకూ ఒక స్థానం ఉండాలి. రేసుగుర్రాల్లా పరిగెత్తడం కాసేపు ఆపి, కాస్త అలసట తీర్చుకోవడంలో తప్పు లేదు. మన ఆరోగ్యం బాగుంటేనే, మన కుటుంబం, కెరీర్ బాగుంటాయి. కాబట్టి వీలైతే కొన్ని నెలలు, లేదంటే కనీసం వారంలో కొన్ని గంటలైనా మీ కోసం మీరు ‘మినీ–రిటైర్’అవ్వండి. జీవితాన్ని మళ్లీ ఆస్వాదించండి!
నగరాల్లో మహిళల మినీ రిటైర్‌మెంట్
బెంగళూరు: ఇక్కడ 35% మహిళలు టెక్ కంపెనీలలో కోడింగ్ డెడ్‌లైన్స్ తట్టుకోలేక 35 ఏళ్ల లోపే 6 నెలల సబాటికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
హైదరాబాద్: గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్లలోని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, ఫైనాన్షియల్ సెక్టార్లలో పని చేసే మహిళల్లో 28 శాతం ‘మెంటల్ హెల్త్ బ్రేక్స్’ కోసం కంపెనీల నుండి భరోసా పొందుతున్నారు.
ముంబై: ఇక్కడ 22% మంది మహిళలు అడ్వర్టయిజింగ్, మీడియా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో బ్రేక్స్ తీసుకుని సోలో ట్రావెలింగ్‌కు వెళ్తున్నారు.
ఢిల్లీ: గుర్గావ్, నోయిడా పరిసర ప్రాంతాల్లో 15% మహిళలు కాలుష్యం, లాంగ్ కమ్యూటింగ్ (ప్రయాణ ఒత్తిడి) వల్ల బర్నౌట్ అయి డిజిటల్ డిటాక్స్ కోసం విరామం తీసుకుంటున్నారు.


