మనం గెలవటమే కాదు అవతలి వారినీ గెలిపించాలి! | Married life is a matter of mutual consent and mutual respect | Sakshi
Sakshi News home page

మనం గెలవటమే కాదు అవతలి వారినీ గెలిపించాలి!

Aug 20 2026 1:20 AM | Updated on Aug 20 2026 1:20 AM

Married life is a matter of mutual consent and mutual respect

మన(సు)లో మాట

నా వయసు 36. మాకు పెళ్లై 15 సంవత్సరాలైంది.. మా ఆయన ఒక బిల్డర్‌. మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పటివరకు చాలా అన్యోన్యంగా, సంతోషంగా జీవించాం. కానీ కొంతకాలంగా మా ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నారు. వాటిలో చూసినట్లే బెడ్‌రూమ్‌లో కూడా ఉండాలని నన్ను ఒత్తిడి చేస్తున్నారు.

 నాకు అవన్నీ చాలా అసహ్యంగా, ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అందుకే నేను ఆయనకు దూరంగా ఉండడం ప్రారంభించాను. దాంతో ఈ మధ్య ఆయన చిరాకుగా ఉంటున్నారు. ఇంట్లో కూడా మునుపటిలా కలిసిమెలిసి ఉండటం లేదు. ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు. ఒకసారి ఆయన ఫోన్ లో చూస్తే డేటింగ్‌ యాప్‌లు కూడా కనిపించాయి. అయితే ఆయనకి వేరే చెడ్డ అలవాట్లు ఏమీ లేవు. ఇన్నాళ్లూ బాగానే ఉన్న వ్యక్తి ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయారు? ఆయనను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? దయచేసి సలహా ఇవ్వండి.    
– స్వాతి, బెంగళూరు

మీరు రాసిన లేఖలో మీ బాధ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మార్పు కనిపించిందని వెంటనే ఆయన చెడ్డ వ్యక్తి అయిపోయారని లేదా మీ కుటుంబ జీవితం ముగిసిపోయిందని అనుకోవద్దు. ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ చాలా సులభంగా అందుబాటులో ఉంది. దానితో పాటు అశ్లీల కంటెంట్‌ కూడా అందరికీ సులువుగా చేరుతోంది. కొంతమంది అలాంటి వీడియోలను తరచుగా చూస్తూ, వాటిలో చూపించే దృశ్యాలే నిజమైన దాంపత్య జీవితం అని భావిస్తారు. కానీ అవి కేవలం వినోదం కోసం రూపొందించిన చిత్రాలు మాత్రమే. 

మనం మిగతా సినిమాలను ఎలా చూస్తామో, వాటిలాగే ఇవి కూడా నటీనటులతో చిత్రీకరించిన వినోదాత్మక కంటెంట్‌.  అయితే, మీ లేఖలో మరింత ఆందోళన కలిగించే విషయం డేటింగ్‌ యాప్‌ల వినియోగం. అది మీ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. చాలామంది పురుషుల్లో మధ్యవయసులో, ముఖ్యంగా జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడిన తర్వాత, ఒక రకమైన మిడ్‌ లైఫ్‌ క్రైసిస్‌ కనిపించవచ్చు. అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో కొత్తదనం కావాలనే కోరిక పెరుగుతుంది. దాంపత్య జీవితంలో కూడా చాలా సంవత్సరాలు ఒకే విధమైన అనుభవాలు ఉంటే, కొంత కొత్తదనం కోరుకోవడం అసాధారణం కాదు. దాన్ని జీవిత భాగస్వామిపై బలవంతంగా రుద్దడమే అసలు సమస్య. 

అదేవిధంగా, జీవిత భాగస్వామి కోరికలను పూర్తిగా తిరస్కరించడం కూడా సరైంది కాదు. అది ఇద్దరిమధ్య దూరాన్ని పెంచుతుంది. దాంపత్య జీవితం అనేది ఇద్దరి అంగీకారం, పరస్పర గౌరవం, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. దాంపత్యంలో గెలుపు అంటే మనం గెలవడం కాదు,  అవతలి వారిని గెలిపించడం!

పదిసార్లు మీ భర్త మిమ్మల్ని గౌరవించినప్పుడు, ఒకసారి ఆయన కోసం, ఆయనకు నచ్చినట్లు ఉండటానికి మీరు కూడా ప్రయత్నిస్తే తప్పేమీ లేదు. మారుతున్న ప్రపంచంలో మనుషుల అభిరుచులు, ఆలోచనలు మారుతున్నాయి. అలాగని మీకు అసౌకర్యంగా అనిపించే ప్రతి విషయాన్ని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, ఆయన ఎందుకు అలా కోరుకుంటున్నారో కూడా ప్రశాంతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరూ మాట్లాడుకుని మీ ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మధ్యమార్గాన్ని కనుగొంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరమైతే ఇద్దరూ కలిసి ఒక సైకియాట్రిస్ట్‌ ను సంప్రదించండి. కౌన్సెలింగ్‌ ద్వారా ఇద్దరి అభి్రపాయాలు, అంచనాలు, పరిమితులు చర్చించి ఒక  పరిష్కారానికి రావచ్చు.


డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, 
విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement