కరోనా వైరస్‌: తల్లీ-కొడుకులు పీపీఈ కిట్‌లతో రెడీ

Mother Son Who Help Covid Patients Get Medical Assistance In Kerala - Sakshi

ఊయలలో  నిద్రిస్తున్న పసిపాపలా ప్రశాంతం గా ఉంటుంది కేరళలోని మెలూరు. ఆరోజు ఒక్కసారిగా ఆ గ్రామంలో అలికిడి...అరుపులు.  ‘చెరియన్‌ పడిపోయాడు. అంబులెన్స్‌ మాట్లాడండి..’ ఎవరో అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేశారు. ‘అంబులెన్స్‌ వచ్చేలోపు  పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది ... బండి మీద పట్నానికి తీసుకెళితే మంచిది’ కానీ ఎవరైనా ముందుకు వస్తే కదా! అందరిలోనూ భయం గూడుకట్టుకుపోయింది.

‘అతడిని ముట్టుకుంటే నాకు కూడా వస్తుందేమో’ అని ఎవరికి వారు భయపడిపోతున్నారు. కొందరు అతడి దగ్గరికి రావడానికి కూడా జంకుతున్నారు. కొందరు తమకేమీ తెలియనట్లు, తామేమీ చూడనట్లు చల్లగా అటు నుంచి అటే జారుకుంటున్నారు. అంతలోనే అక్కడికి ఒక స్కూటర్‌ వచ్చి ఆగింది. బాధితుడిని బండిపై పట్నానికి తీసుకెళ్లడానికి సిద్ధం అవుతున్న సమయంలో అదృష్టవశాత్తూ అంబులెన్స్‌ వచ్చింది. అయితే అన్నిసార్లూ అదృష్టం మనవైపే ఉంటుందని నమ్మకమేమీ లేదు కదా! కొండ ప్రాంతంలో ఎగువన ఉండే మెలూరు గ్రామానికి అంబులెన్స్‌ సకాలంలో రావడం అంత సులభమేమీ కాదు. దీనికి ఏదో పరిష్కార మార్గం కనుక్కోవాలని ఆలోచిస్తున్న సమయంలోనే కోవిడ్‌ భూతం ఊరిని దట్టంగా కమ్మేసింది.

సుమారు రెండు వందల మంది కోవిడ్‌ బారిన పడ్డారు. మెలూరు గ్రామాన్ని కంటైన్‌మెంట్‌జోన్‌గా ప్రకటించారు. ఊరిలో రెండు వందల మందికి వచ్చిందా? ఊరికి మొత్తం వచ్చిందా? అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఎటు చూసినా భయం రాజ్యమేలుతోంది. ఏవేవో లక్షణాలు ఊహించుకొని ‘నాకు కరోనా వచ్చింది దేవుడో’ అనే ఏడుపులు ఎక్కువయ్యాయి. ఏది కరోనా? ఏది కాదు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ? అని నాలుగు మంచిమాటలు  చెప్పేవాళ్లు, వాటితోపాటు ధైర్యం చెప్పేవాళ్లు కరువయ్యారు. ఆరోజు ఆపదలో ఉన్న పేషెంట్‌ను కాపాడడానికి ముందుకు వచ్చిన తల్లీ–కొడుకులు సతి, అనీల్‌బాబులు పీపీయి కిట్‌లతో రెడీ అయ్యి ఊరంతటికి ధైర్యం చెప్పడమే కాదు, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి మెడికల్‌ ప్రొఫెషనల్స్‌తో సహాయం అందించడం మొదలెట్టారు.

ఎవరికి ఏ ఆపద ముంచుకు వచ్చినా అంబలెన్స్‌ సిద్ధంగా ఉండేలా చేశారు. ‘ఎందుకలా రిస్క్‌ తీసుకుంటున్నారు’ అని బంధువులు, ఆత్మీయులు సతిని హెచ్చరించేవారు. అయితే వాటిని ఆమె లెక్క చేయలేదు. ‘అపదలో ఉన్న వాళ్లకు సహాయపడడం గొప్ప విషయం కాదు. మన కనీసధర్మం. చావు గురించి నేను ఎప్పుడూ భయపడను. అందరూ చనిపోయేవాళ్లమే. బతికున్నంత వరకు నలుగురికీ సహాయపడాలన్ననేది నా కోరిక’ అంటున్న 49 సంత్సరాల సతి మెలూరు గ్రామపంచాయతీ వార్డ్‌ మెంబర్‌. మొదట్లో ఎలా ఉన్నా ‘మేము సైతం...’ అంటూ సతితో కలిసి పనిచేయడానికి ఊరిలోనివాళ్లు ముందుకు రావడం మొదలైంది. అలా 65 మందితో ఒక ఆర్మీ తయారై పోయింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా, అపద వచ్చినా ఈ ఆర్మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు మెలూర్‌లో ‘భయం’ కంటే ‘బాధ్యత’ ఎక్కువగా కనిపిస్తుంది.
చదవండి: Cover Story: బతుకుదెరువుకు కొత్త దారులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top