
వైవిధ్యమే అందం
అందం అంటే స్వతహాగా మనం ఉండే విధానమే. అందానికి సూత్రాలేం లేవు. దేనినైనా స్వతహాగా ఆస్వాదించడమే అందం. ఇదే ప్రపంచంలోని అందమైన వైవిధ్యం అన్నారు హూన్ త్రాన్ నీ. తెలంగాణ (హైదరాబాద్) వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025పోటీల నేపథ్యంలో మిస్ వరల్డ్ వియత్నామ్ హూన్ త్రా నీ ‘సాక్షి’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. భారతీయతను, మానవత్వాన్ని, భిన్న సంస్కృతుల అద్భుత సమ్మేళనాన్ని గొప్పగా వర్ణించిన హూన్ త్రాన్ సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..!!
ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి నన్ను ఆహ్వానించిన విధానం, ఇక్కడి సంస్కృతిలోని ఆప్యాయత నాకెంతో నచ్చింది. తెలంగాణ స్థానిక సంస్కృతిలో ప్రదర్శించిన నృత్యాలు నన్ను అబ్బుర పరిచాయి. ఇక్కడి కళాకారుల్లో ఒక వైవిధ్యముంది. ఇక్కడి ఆతిథ్యం నాకు మరో ఇంటిని తలపిస్తోంది. నేను బస చేస్తున్న హోటల్ సిబ్బంది నా కోసం పర్యావరణహితమైన పదార్థాలతో తయారు చేసిన అందమైన బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు. మరో సిబ్బంది నా కోసం వియత్నామీస్ భాషలో రాసిచ్చిన లేఖ నన్ను హత్తుకుంది. ఇంటికి దూరంగా ఉన్న నాకు ఈ లేఖ ఎంతో సాంత్వనను అందించింది. ఇవన్నీ ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీకలు. హైదరాబాద్‌లో నాకు బాగా నచ్చిన అంశం పానీ పూరీ. వియత్నాం, నేను చదువుకునే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పుడూ ఇంత రుచికరమైనది తినలేదు. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీ పూరీ ఎలా తినాలో నేర్చించింది.
నా దేశం అందమైన, సాంస్కృతికమైన దేశం. మిస్ వరల్డ్ అంటే.. తమ దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. వ్యక్తిగత విశిష్టత గురించి గొప్పగా ప్రదర్శించే ప్రపంచ వేదిక. ఈ స్ఫూర్తితోనే నేను వియత్నామీస్ ఆత్మస్థైర్యం, సామాజిక బాధ్యత గల అమ్మాయిగా మిస్ వరల్డ్ వేదిక పైన సగర్వంగా నిలుచున్నాను. మిస్ థాయ్‌లాండ్ ఓపాల్, మరో దేశ వనిత సోమ నాకు స్ఫూర్తినిచ్చారు. సామాజికంగా ఎదురయ్యే కొన్ని అడ్డంకులు, అవరోధాలను ఎలా ఎదుర్కోవాలో వారి కథలు విని నేర్చుకున్నాను.
ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించాను
విద్య–విఙ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడి జీవితాలు బాగుంటాయని నమ్ముతాను. అందుకే మా దేశంలో ‘హర్టీ హెల్ప్’ అనే ప్రాజెక్ట్ చేపట్టాను. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్ థీమ్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించాను, అక్కడి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడానికి బుక్ రూంలను ఏర్పాటు చేశాను. నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేస్తున్నాను.
ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర
పుస్తకాలే నాకు సాంత్వన
నా ఫ్యాషన్ మోడలింగ్‌లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. దానిని అధిగమించడానికి నాకు తోడుగా నిలిచింది పుస్తకాలు మాత్రమే. పుస్తకాలే నాకు గురువులు, స్నేహితులు, సాంత్వన. వ్యక్తులు, వ్యక్తిత్వాలు, సామాజిక అంశాలను రచయితలు ఎంతో హృద్యంగా మనకు చేరవేస్తారు. ‘ఎలయర్’ అనే పుస్తకం నాకెంతో నేర్పించింది. ఎప్పుడైనా సరే ఇతరుల విజయాన్ని చూసి మనల్ని పోల్చుకోవద్దు. వారి విజయాలకు కారణాలు వేరు. మన వాస్తవ పరిస్థితులు వేరు. ప్రతీ ఒక్కరికి ఒక వినూత్నమైన దారి ఉంటుంది, ఒక అందమైన ప్రయాణముంటుంది.
అందరినీ గౌరవించండి
ప్రతి ఒక్కరి జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయి. నేనూ వాటిని దాటుకునే వచ్చిన దానినే. ఈ సందర్భంగా నేనొక విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో దయతో ఉండండి. ఎవరినీ తక్కువ చేసి చూడొద్దు, సామాజిక అసమానతలు, అస్పశ్యతలు నాలాంటి అమ్మాయిలను వేదనకు గురి చేస్తాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ వేదికపైన చెప్పాలనుకున్నాను.. కానీ ‘సాక్షి’ దీనిపై నన్ను స్పందన కోరడంతో ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరిని గౌరవించండి, వారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. – హూన్ త్రాన్
– హనుమాద్రి శ్రీకాంత్
ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో