
ఒక పూట పాలు లేకపోతే, ఆ రోజు ఎంత కష్టంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయాన్నే టీ, కాఫీలు పెట్టుకోవడం దగ్గర నుంచి, రాత్రిపూట మజ్జిగ తాగే వరకు ఇంట్లో ఏదోరకంగా పాల అవసరం కనిపిస్తూనే ఉంటుంది. పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ప్రతి పాల ఉత్పత్తితోనూ రోజువారీ అవసరాలు, అలవాట్లు ముడిపడే ఉంటాయి. అందుకే, కుదిరితే పాడినయినా పెంచుకుంటాం, లేదా పాలకేంద్రంలో ఖాతానైనా పెట్టుకుంటాం. ఏదేమైనా రోజుకు లీటరో అరలీటరో పాలు స్టవ్ మీద కాగాల్సిందే! ప్రతి ఇంట్లోనూ పాలకున్న డిమాండ్ అలాంటిది.
నిజానికి పాలు ఒక సంపూర్ణ ఆహారం. పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా పోషకాలనే అందిస్తాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రొటీన్ ఎంతగానో సహాయపడుతుంది. పాలలో విటమిన్–డి, విటమిన్–బి12తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాలు తాగటంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలు ఎముకలను బలపరుస్తాయి, కండరాలను అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం. పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి పాలు చాలా అవసరమని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.
మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పాడిని పెంచి, పాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. అంటే దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుంచే, పశువుల పాలతో ప్రయోజనాలను అందుకుంటున్నాం.
ఏ జంతువుల పాలు.. ఏమేమి ఫలితాలు?
పాలల్లో ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఇక గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులలో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ప్రత్యేక రుచి, పోషక విలువలు, ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి పాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.
బొద్దింక పాలు
కీటకమైన ఈ బొద్దింకల నుంచి పాలను తియ్యడం చాలా అసాధారణమైన పని. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు ‘బొద్దింక పాలు’ అని పిలవబడే ఒక పోషకసమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణను అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి అధిక ప్రొటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. వీటిని మనుషులు వినియోగించుకోవడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బొద్దింకల పాలను ఉత్పత్తి చేయడం లేదు. దీనిని ఒక ‘సూపర్ ఫుడ్’గా మార్కెట్ చేసే ప్రయత్నాలను కొన్ని పరిశోధనా సంస్థలు సాగిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక, సామాజిక అడ్డంకులు చాలా ఉన్నాయి.
ఆవు పాలు
ఇవి ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాలు. ఇవి కాల్షియం, ప్రొటీన్, విటమిన్–డిలతో నిండి ఉంటాయి. ఈ పాలను నేరుగా తాగడానికి, పెరుగు, వెన్న, చీజ్ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.
గొర్రె పాలు
ఇవి చాలా పోషకమైనవి, వీటిలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. గొర్రె పాలను ఎక్కువగా చీజ్ తయారీకి వినియోగిస్తారు. ముఖ్యంగా ఫెటా, రోక్ఫోర్ట్ వంటి చీజ్‌లు వీటితోనే తయారు చేస్తారు.
గేదె పాలు
ఆవు పాల కంటే ఈ పాలల్లో కొవ్వు, మినరల్స్, ప్రొటీన్‌లు కొంత ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, ఇటలీ వంటి దేశాలలో ఎక్కువగా దొరుకుతాయి. పెరుగు, మొజారెల్లా చీజ్, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఈ పాలనే వినియోగిస్తారు. గేదె పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇందులో లాక్టోస్ కూడా ఎక్కువ.
గాడిద పాలు
ఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి పోషక విలువలు చర్మ సంరక్షణకు, ఉబ్బసం నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శిశువులకిచ్చే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా సూచిస్తారు.
మేక పాలు
ఆవు పాల కంటే తేలికగా జీర్ణమవుతాయి. కొంత భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్–ఎ అధికంగా ఉంటాయి. మేక పాల నుంచి చీజ్, పెరుగులతో పాటు సబ్బులు కూడా తయారు చేస్తారు. ఈ మేక పాలు ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 2% వాటాను కలిగి ఉన్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గత 20 సంవత్సరాలలో దీని ఉత్పత్తి దాదాపు 60% పెరిగింది. మేకపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవయవాల పనితీరుకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.
ఒంటె పాలు
పశ్చిమాసియా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాలలో ఒంటె పాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆహారం. ఈ పాలలో విటమిన్–సి, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒంటె పాలు తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ఈ పాలు మంచి ఔషధం. ఈ పాలు కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ పాలను ఐస్‌క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
గుర్రపు పాలు
ఖజక్‌స్తాన్, మంగోలియా, తూర్పు ఐరోపాలో గుర్రపు పాలను కూమిస్, అయిరాగ్ వంటి సంప్రదాయకంగా పులియబెట్టే పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పానీయాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గుర్రపు పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అమైనో ఆమ్లాలు, కొవ్వు శాతం ఈ పాలలో ఎక్కువగా ఉండటంతో చీజ్ తయారీకి ఇవి చక్కగా
పనికొస్తాయి.
మూస్ పాలు
ఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని స్వీడన్, రష్యా, కెనడాలో వాణిజ్యపరంగా ఉపయోగిస్తాయి. మూస్ పాలను చీజ్, పెరుగు, ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్‌లలో మూస్ చీజ్ ఒకటి.
రెయిన్ డీర్ పాలు
సైబీరియా, ఉత్తర స్కాండినేవియా వంటి చల్లని ప్రాంతాలలో నివసించే ప్రజలు రెయిన్ డీర్ పాలను వినియోగిస్తారు. ఆవు పాల కంటే వీటిలో కొవ్వు, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా శక్తిమంతమైన ఆహారం.
జిరాఫీ పాలు
జిరాఫీ పాలు అసాధారణమైనవి. మానవ వినియోగానికి సాధారణంగా లభ్యం కావు. వీటి పాలలో కొవ్వు, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జిరాఫీ పిల్లల వేగవంతమైన పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే, జిరాఫీల నుంచి పాలు తీయడం చాలా కష్టం. అది పెద్ద సవాలుతో కూడుకున్న పని.
యాక్ పాలు
హిమాలయ ప్రాంతంలో ఈ యాక్ పాలు చాలా ప్రత్యేకం. ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, టిబెటన్లు, ఇతర పర్వత నివాసుల ఆహారంలో ఈ పాలను తప్పనిసరి తీసుకుంటారు. ఈ పాలు చిక్కగా, ఎక్కువ కొవ్వులతో ఉండటంతో వెన్న, చీజ్ తయారీకి అనుకూలంగా ఉంటాయి.
అపోహలు నిజాలుపాలు తాగితే బరువు పెరుగుతారు!
ఇది నిజం కాదు. పాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం (ఫుల్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్), తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్ తొలగించిన పాలను తీసుకుంటే క్యాలరీ కంటెంట్ తగ్గుతుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
పాలను ఎక్కువగా కాగబెడితే పోషకాలు తగ్గుతాయి!
ఇది పూర్తిగా తప్పు. పాలను కాగబెట్టడంతో అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, పాలు తాగడానికి సురక్షితంగా మారతాయి. పదేపదే మరిగించడంతో పోషకాలకు ఎటువంటి హాని జరగదు.
పాలు ఎముకల నుంచి కాల్షియంను బయటకు తీస్తాయి!
ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
పాలు తాగితే కఫం ఉత్పత్తి అవుతుంది!
ఈ వాదన పూర్తిగా సరైనది కాదు. దగ్గు సమయంలో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడంతో కఫం పెరుగుతుందని కొందరు నమ్ముతారు, కానీ పాలు తాగడానికి, కఫం ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు.
పాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి!
పాల వినియోగం, మొటిమల మధ్య ప్రత్యక్ష సంబంధానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుశాస్త్రం, హార్మోన్లు, మనం తీసుకునే ఆహారం వంటి ఎన్నో అంశాలు చర్మ ఆరోగ్యంలో కీలకంగా మారతాయి.
తల్లిపాలు పట్టిస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు!
అనారోగ్యంతో ఉన్న తల్లి, తన పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అవి శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.
ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదు!
ప్రసవానంతరం లేత పసుపు రంగులో వచ్చే ముర్రుపాలు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. అవి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, పోషకాలను నిండి ఉంటాయి.
పాలు లాభాలు
పాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అవి పోషకాల మిశ్రమం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కీలకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదపడతాయి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
విటమిన్–ఎ
ఇది కంటిచూపుకు ఎంతో అవసరం. కణాల పెరుగుదలను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
విటమిన్–డి
ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. శరీరం క్యాల్షియంను సమర్థంగా గ్రహించేలా చేస్తుంది. దాంతో ఎముకలకు పటుత్వం లభిస్తుంది.
విటమిన్–బి3 (నియాసిన్)
మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్–బి5 (పాంటోథెనిక్ ఆమ్లం)
శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది.
విటమిన్–బి12
నాడీవ్యవస్థ పనితీరుకు, డీఎన్‌ఏ నిర్మాణానికి ఇది అత్యవసరం.
విటమిన్–ఈ
ఇవి పాలలో తక్కువ శాతం ఉంటాయి. అయితే పాలిచ్చే జంతువులను బట్టి, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది. మనిషి పాలలో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది.
క్యాల్షియం
ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, వాటి దారుఢ్యాన్ని కాపాడటానికి ఇది ప్రధాన పోషకం.
ఫాస్ఫరస్
క్యాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల నిర్మాణానికి ఫాస్ఫరస్ దోహదపడుతుంది.
అయోడిన్
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ కీలకమైనది, ఇది శరీర విధులను నియంత్రిస్తుంది.
సెలీనియం
ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, వాటికి రక్షణ కల్పిస్తుంది.
జింక్
రోగనిరోధక శక్తిని కాపాడటంలో జింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానేలా కూడా చేస్తుంది.
ప్రొటీన్
కండరాల పెరుగుదలకు ప్రొటీన్ అత్యవసరం. కణజాలం నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.
కార్బోహైడ్రేట్స్
పాలలోని లాక్టోస్ ఒక కీలకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
కొవ్వులు
కొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్లు(ఎ, డి, ఈ వంటివి), శరీరంలో ఇముడ్చుకోవడానికి ఈ కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.
నిజానికి లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొక్కల ఆధారిత పాలు (సోయా మిల్క్, బాదం మిల్క్) వంటివి తీసుకోవచ్చు. పాలు అలవాటు ఉన్నవారు, పాలు తాగడంతో ఎలాంటి సమస్య లేనివారు ఏదో ఒక రూపంలో, తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.