
అసామాన్యురాలు
తెలంగాణలో గంగవ్వ ఎలాగో కర్నాటకలో మల్లమ్మ అలాగ. కన్నడ భాషలోని పల్లె పలుకుబడిలో వర్తమాన విషయాలపై మల్లమ్మ చేసే వ్యంగ్య వ్యాఖ్యానానికి చాలామంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆమె ‘మల్లమ్మ టాక్స్’ యూట్యూబ్ చానల్‌కు 50 వేల మంది సబ్‌స్క్రయిబర్స్. అందుకే ఆమెకు కన్నడ బిగ్‌బాస్‌లో పిలుపు వచ్చింది. మారుమూల పల్లెల్లో ఉన్నామని చిన్నబుచ్చుకోక గంగవ్వలా, మల్లమ్మలా ఎవరైనా వెలగొచ్చు.
కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తోన్న ‘కన్నడ బిగ్‌బాస్ 12’వ సీజన్‌ప్రారంభమైంది. అన్ని బిగ్‌బాస్ షోలకు ఉన్నట్టే అక్కడా దానికి ఒక క్రేజ్ ఉంది. ప్రతిసారీ హౌస్‌లోకి వచ్చేవారు ఎవరా అనే కుతూహలం ఉంటుంది. ఈసారి హౌస్‌లోని అభ్యర్థుల్లో పాపులర్ వ్యక్తులు చాలా మందే ఉన్నారు. అయితే వారందరిని మించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమే మల్లమ్మ అలియాస్ ‘మటిన మల్లి’ (మాటల రాణి– ఆమెను అభిమానంగా పిలుచుకునే పేరు).
బిగ్‌బాస్‌లో అందరికంటే ఎక్కువ వయసు మల్లమ్మదే. 70 ఏళ్లు. మల్లమ్మ సరళమైన జీవనశైలి, హాస్యం, గ్రామీణ జీవితంపై ఆమె చేసే కంటెంట్ సోషల్ మీడియాలో ఆమెను వైరల్‌గా మార్చాయి. ఇక్కడ బిగ్‌బాస్‌లో ఎలాగైతే తెలంగాణ గంగవ్వకు చోటు లభించిందో ఆమెకు అలా అక్కడ చోటు లభించింది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న గంగవ్వ ఆ షో పుణ్యమా అని సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోగలిగింది. మరి మల్లమ్మకు ఏం ప్రయోజనం కలుగుతుందో చూడాలి.
కథలు చెప్పే మల్లమ్మ
ఉత్తర కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సురపుర గ్రామానికి చెందిన మల్లమ్మ మంచి మాటకారి. సోషల్‌మీడియా కంటెంట్ క్రియేటర్. ఆమె వీడియోలకు లక్షల్లో వీక్షకులున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రయాణం విచిత్రంగా మొదలైంది. ఆమె గతంలో బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైన్ కంపెనీలో పని చేసింది. ఆమె మంచి టైలర్. ఆ సమయంలో స్టోర్ యజమానులను ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను అప్‌లోడ్ చేసింది. అవి పాపులర్ కావడంతో ఇతర అంశాలపైనా దృష్టి సారించి, మరిన్ని వీడియోలు చేసింది.
పల్లెటూరి పనులు, వంటలు, షాపుల్లో పల్లెజనం బేరసారాలు చేసే తీరు, జాతరలు ఇవన్నీ యథాతథంగా ఎలా ఉంటాయో ఆమె చూపడం వల్ల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు 1.83 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మల్లమ్మ అప్పుడప్పుడూ సరదా కథల్ని కూడా తన వీడియోల్లో పంచుకుంటోంది. ఇంత పాపులారిటీ ఉండటం వల్ల సహజంగానే బిగ్‌బాస్ షోకు ఆహ్వానం అందింది. హోస్ట్ సుదీప్‌తో ఆమె మాట్లాడుతూ బిగ్‌బాస్ హౌస్ నియమాల గురించి తనకేమీ తెలియదని అన్నారు. ‘మల్లమ్మ ఎప్పుడూ తనంతట తానుగా జీవితాన్ని గడిపే వ్యక్తి’ అని సుదీప్ అన్నారు. మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ప్రశంసలతోపాటు వివాదాలు
మల్లమ్మ చేసిన వీడియోలకు అనేక ప్రశంసలు వచ్చాయి. ఒక్క వీడియో మాత్రం తీవ్రమైన విమర్శలు మూటగట్టుకుంది. ఒక తెలుగు సినిమాలోని పాట గురించి ఆమె మాట్లాడిన మాటలతో అనేకమంది తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తన అకౌంట్‌ను మూసివేయాలని అనుకున్నట్లు ప్రకటించింది. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆమె అభిమానులు ఆమెను ఒప్పించారు. అలా ఆమె వీడియోల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. విక్కీ కౌశల్ ‘తౌబా తౌబా’ డ్యాన్స్, ఉర్ఫీ జావేద్ డ్రెస్సింగ్ స్టైల్, ఉత్తర భారతదేశ వంటలు, వైరల్ రీల్స్.. ఇలా అన్నింటి గురించి ఆమె వీడియోలు చేసింది.
అయితే ప్రస్తుతం కన్నడ బిగ్‌బాస్ షో తాత్కాలిక కష్టాల్లో పడింది. పర్యావరణ అనుమతులు లేవని ΄ోలీసులు బిగ్‌బాస్ హౌస్‌ను మంగళవారం సాయంత్రం సీజ్ చేసి కంటెస్టెంట్‌లను ఒక రిసార్ట్‌కు తరలించారు. బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి బయటకు వచ్చే మురుగు నీరు, వ్యర్థ పదార్థాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని నిర్వాహకుల మీద అధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో సంతోషంగా హౌస్‌లో అడుగు పెట్టిన మల్లమ్మ ప్రస్తుతం రిసార్ట్‌కు చేరింది. అయితే సమస్య అతి త్వరలో సద్దుమణిగి షో కొనసాగుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు.