
విదర్భ రాజ్యాన్ని చంద్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. దైవభక్తి కలిగిన ఆయన రాజ్యం మధ్యలో పెద్ద వైష్ణవాలయాన్ని కట్టించాడు. స్వామికి రాతి రథం చేయించాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అందుకు తగ్గ శిల్పి దొరకడం లేదు. చివరకు నారాయణాచారి అనే శిల్పి గురించి చంద్రసేనుడికి తెలిసింది. ఆయన రాతిరథం అద్భుతంగా తయారు చేయగలడని చంద్రసేనుడు భావించాడు. వెంటనే నారాయణాచారిని ఆస్థానానికి పిలిపించి ఆలయానికి రాతి రథం చేయమని కోరాడు.
‘రాజా! శిల్ప కళ నాదే అయినా, నాకు ఆ కళను ప్రసాదించింది ఆ భగవంతుడు. నేను ఇంటికి వెళ్లి భగవంతుణ్ని ధ్యానిస్తాను. ఆయన అనుమతి ఇస్తే తప్పక రథం చేస్తాను. లేదంటే నేను ఆ పని చేయలేను’ అని చె΄్పాడు నారాయణాచారి. చంద్రసేనుడు సరేనన్నాడు. ఇంటికి వెళ్లిన నారాయణాచారి భగవత్ ధ్యానంలో మునిగి΄ోయాడు. మూడు రోజులు గడిచినా ఆయన ధ్యానం నుంచి బయటకు రాలేదు. ఆయన చెప్పే సమాధానం కోసం చంద్రసేనుడు ఎదురుచూస్తున్నాడు.
నాలుగో రోజు నారాయణాచారి ధ్యానంలోనుంచి బయటకు వచ్చాడు. నేరుగా చంద్రసేనుడి దగ్గరకు వెళ్లి రాతి రథం చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో రాజు సంతోషించి అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. మూడు నెలలు శ్రమించి నారాయణాచారి రాతి రథం తయారు చేశాడు. నాలుగు అంతస్తుల ఎత్తులో భారీగా ఉన్న ఆ రథాన్ని రాచవీధిలో ఉంచారు. ప్రజలంతా ఆ రథాన్ని చూస్తూ నారాయణాచారి ప్రతిభను గొప్పగా పొగిడారు. చంద్రసేనుడు సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. నారాయణాచారి దగ్గరికి వెళ్లి ‘రథం తయారు చేసినందుకు ఏం కావాలో కోరుకోండి సమర్పిస్తాను’ అని వినమ్రంగా అడిగాడు. ‘ఏదడిగినా కాదనకూడదు’ అని శిల్పి షరతు పెట్టాడు. ‘నా రాజ్యం మొత్తం ఇమ్మన్నా ఇచ్చేస్తాను. మాట తప్పను’ అని చంద్రసేనుడు వాగ్దానం చేశాడు. ‘అయితే రథాన్ని ప్రారంభించే రోజు అడుగుతాను’ అన్నాడు నారాయణాచారి.
రథాన్ని ప్రారంభించేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. రథాన్నిప్రారంభించే ముందు చంద్రసేనుడు నారాయణాచారిని ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘ఈ ఒక్క రోజు ఈ రాజ్యానికి నేను రాజుగా ఉండాలి’ అని అడిగాడు శిల్పి. ఆ మాటతో అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. చంద్రసేనుడు మాత్రం తాను ఇచ్చిన మాట తప్పను అంటూ నారాయణాచారిని ఆ ఒక్క రోజు తన రాజ్యానికి రాజుగా ప్రకటించారు. రథం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి రథాన్ని ముందుగా లాగాలి. ఆ తర్వాత ప్రజలంతా లాగి పురవీధుల్లో తిప్పుతారు. దీంతో ఆ ఒక్క రోజు రాజుగా ఉన్న నారాయణాచారి రథానికున్న తాడును పట్టుకుని ముందుకు లాగాడు. ఆయన వెంట ప్రజలంతా ఆ తాడు పట్టుకొని ముందుకు కదిలారు. భారీ రథం ముందుకు కదిలింది. కొద్దిదూరం వెళ్లగానే చక్రాలు అదుపు తప్పి రథం ప్రజల మీదకు దూసుకెళ్లింది. రథానికి ముందుగా ఉన్న నారాయణాచారి కింద పడగా ఆయన మీద నుంచి రథం వెళ్లి ఆగిపోయింది.
హుటాహుటిన ఆయన్ను పక్కకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. ఆయన చంద్రసేనుణ్ని పిలిచి ‘రాజా! నాకు శిల్పకళతోపాటు జోతిష్యం కూడా తెలుసు. ఈ రథాన్ని ్ర΄ారంభించిన రోజే ఈ రాజ్యప్రభువు మరణిస్తాడని కనుగొన్నాను. అందుకే ఈ ఒక్క రోజు నేను రాజుగా ఉంటానని కోరాను. నా కోరికను మీరు మన్నించారు. మీవంటి రాజు దేశానికి, ప్రజలకు ఎంతో అవసరం. మిమ్మల్ని కాపాడుకున్నానన్న తృప్తితో కన్ను మూస్తున్నాను’ అంటూ నారాయణాచారి మరణించారు. ఆయన త్యాగనిరతికి కన్నీరు పెట్టిన చంద్రసేనుడు ఆ రాతి రథంపై నారాయణాచారి పేరు చెక్కించి ఆయనను కలకాలం గుర్తుంచుకునేలా చేశారు.