
ఇన్ బాక్స్
మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా ఫూలే. ఆయనపై అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో ప్రముఖ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రలలో... ‘ఫూలే’ సినిమా తయారయింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వారి అభ్యంత రాల కారణంగా... సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదా లను తొలగించాలని సూచించింది. అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు.
మూడు వేల ఏళ్ల పాటు ఈ దేశంలోని మెజారిటీ వర్గాల ప్రజలకు క్షుద్రులు, శూద్రులు, మ్లేచ్ఛులు, ఛండాలురు అనే పేర్లు తగిలించి... బానిసలుగా చూసిన అమా నుష కులవ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలింది. తమ స్వార్థం కోసం మతాన్ని, సమా జాన్ని భ్రష్టు పట్టించిన ఆ మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా ఎదిరించిన ధీశాలి ఫూలే. ‘మనుషులందరినీ పుట్టించినవాడు దేవుడే అయినప్పుడు... ఒక తండ్రి తన బిడ్డలలో కొందరు ఎక్కువ కొందరు తక్కువ... కొందరు ద్విజులు, కొందరు పంచ ములు అంటూ ఎలా శాసిస్తాడు? ఇవన్నీ మీరు రాసిన అబద్ధపు రాతలు! ఇక ఈ అకృత్యాలను కట్టిపెట్టండి!’ అంటూ గర్జించి, స్వార్థపర వర్గాల దౌర్జన్యాలపై సమర శంఖం పూరించాడు మహాత్మా ఫూలే.
శూద్ర బిడ్డలకూ, స్త్రీలకూ చదువు చెప్పడానికి పుణే వీధుల్లో సావిత్రిబాయి ఫూలే వెళుతుంటే... అగ్రవర్ణాలు రాళ్లు వేసే దృశ్యాన్ని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫూలే జీవిత చరిత్రలో ఆయన ఎదుర్కొన్న అవరోధాల ప్రస్తావన ఉండకపోతే... మరేమి ఉంటుంది? జరిగిన చరిత్రను చూపెడితే... మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బుకాయిస్తే ఎలా?
– ఆర్. రాజేశమ్
సామాజిక న్యాయ వేదిక కన్వీనర్